కేజ్రీకి ఉచ్చు బిగిస్తే కవిత పరిస్థితి కష్టమే!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వ్యవహారాలు వేగంగా కదులుతున్నాయి. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పొందగలరా లేదా అనేది చర్చనీయాంశంగా మారుతోంది. ఆయన బెయిలు పిటిషన్ ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఒకవైపు ఆ పిటిషన్ పై తీర్పు వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో.. మొత్తం లిక్కర్ స్కాం కు సంబంధించి కీలక సూత్రధారిగా అరవింద్ కేజ్రీవాల్ పాత్రను నిర్ధారిస్తూ సిబిఐ ఛార్జ్ షీట్ సిద్ధం చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే సుప్రీంకోర్టులో బెయిలు పొందడం కూడా మరింత కష్టమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరో కోణంలోంచి గమనించినప్పుడు.. అరవింద్ కేజ్రీవాల్ చుట్టూతా సిబిఐ బిగిస్తున్న ఉచ్చు తెలంగాణ ఎమ్మెల్సీ, కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి!  కేజ్రీవాల్ పాత్రను నిర్ధరించే కొద్దీ కవితకు బెయిలు రావడం కూడా కష్టం అవుతుంది అని పలువురు అంచనా వేస్తున్నారు.

కవిత ఇప్పటికే పలు రకాలుగా బెయిల్ కోసం పిటిషన్ వేయడం భంగపడడం జరుగుతూనే వస్తుంది. ఆమె ప్రతి పిటిషన్ ను కూడా ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. తాజాగా కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే అక్కడ కూడా ఆమెకు ఏ మేరకు సానుకూల ఫలితం లభిస్తుంది అన్నది సందేహమే.

ఎందుకంటే ఎన్నికలలో ప్రచారంలో పాల్గొనాల్సి ఉన్నదని.. అందువలన తనకు బెయిలు మంజూరు చేయాలని కవిత ఇప్పుడు కోర్టును అభ్యర్థిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఇదే కారణాల మీద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనంటే పార్టీకి అధినేత, సారధి! కల్వకుంట్ల పరిస్థితి అది కాదు. తన పార్టీకి తన స్టార్ క్యాంపెయినర్ అని ఆమె చెప్పుకున్నప్పటికీ.. ఆ కారణం చేత బెయిల్ ఇస్తారనుకోవడం భ్రమ. పైగా తెలంగాణలో మరో రెండు రోజుల్లో ప్రచార పర్వం ముగిసిపోతుంది కూడా. ఇలాంటి నేపథ్యంలో బెయిల్ పొందాలంటే కల్వకుంట్ల కవిత మరో కారణాన్ని వెతుక్కోవాలి. ఇప్పటికే కొడుకు పరీక్షలకు సిద్ధం కావడానికి తను దగ్గరుండి చదివించాలని, ఎన్నికలలో ప్రచారం చేయాలని.. రకరకాల కారణాలు చూపించిన ఆమె బెయిల్ పొందలేకపోయారు.

Readmore!

ఇన్ని ప్రయత్నాలు తర్వాత మరొకవైపు కేసులు వారి మీద చార్జిషీట్ కూడా సిద్ధమైపోతున్న సమయంలో.. కవితకు బెయిలు రావడం కష్టమే అని నిపుణులు అంటున్నారు. కవిత కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారి అని.. ఆమె పూనిక తోనే అసలు ఈ స్కాం మొత్తం జరిగిందని దర్యాప్తు సంస్థలు నివేదిస్తున్న నేపథ్యంలో కవితకు బెయిలు రావడం అంత ఈజీ కాదని తెలుస్తోంది.

Show comments