‘పెంచను’ అని చెప్పగలవా చంద్రబాబూ!

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను ఒక వేలం పాట లాగా మార్చేశారు. ఎలాగైనా సరే అధికారంలోకి వచ్చి తీరాలనే కక్కుర్తి తో.. అడ్డగోలు మాటలు వల్లించడం ప్రారంభించిన చంద్రబాబు నాయుడు.. జగన్మోహన్ రెడ్డి తన ముద్రతో ప్రారంభించిన సంక్షేమ పథకాలు అన్నింటి మీద, వేలంపాట పెంచి తాను ప్రజలకు అందిస్తానని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇదే రకమైన దుర్మార్గపు మాటలతో జగన్మోహన్ రెడ్డి విద్యుత్తు చార్జీలు పెంచారంటూ.. ఆయన పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇక్కడ చంద్రబాబుకు పరిశీల సందిస్తున్న ప్రశ్న ఒక్కటే. తమరిని మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే.. వచ్చే ఐదు ఏళ్లలో విద్యుత్ చార్జీలు గాని, ఆర్టీసీ చార్జీలు గాని, భూ రిజిస్ట్రేషన్లు తదితర వ్యవహారాలకు సంబంధించిన పన్నులు గాని, మద్యం ధరలు గాని పెంచకుండా ఉంటాను అని సూటిగా, స్పష్టంగా హామీ ఇవ్వగలరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుకు వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో చాలా బాగా తెలుసు. విద్యుత్తు చార్జీలను పెంచకుండా ఉండడం అసాధ్యం అని, పెట్రోలు చార్జీలు పెరుగుతున్న సమయాల్లో ఆర్టీసీ చార్జీలు పెంచకుండా నడపడం కుదరదని కూడా ఆయనకు తెలుసు. అయితే.. ఇప్పుడు ఎన్నికలు గనుక.. అవకాశ వైఖరికి నిలువెత్తు రూపం అయిన చంద్రబాబు, జగన్ హయాంలో పెరిగిన వాటి గురించి పదేపదే నిందలు వేస్తున్నారు.

జగన్ తన సొంత ముద్రతో తీసుకువచ్చిన సంక్షేమ పథకాల విషయంలో కూడా.. వేలం పాటలాగా ధర పెంచేసి అమలు చేస్తానని అంటున్నా ఆయన- ఈ విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలు, పన్నుల విషయంలో టెండరు పాటలాగా తన ప్రభుత్వం వస్తే తగ్గిస్తానని చెప్పగలరా? కనీసం అయిదేళ్ల పాటు పెంచకుండా ఉంటానని మాట ఇవ్వగలరా? అనేది ప్రజల సందేహం. అందుకు ఆయనకు ధైర్యముందా?

Readmore!

లక్షన్నర కోట్ల రూపాయలు కేవలం పథకాలకోసం చంద్రబాబు తేవడం అసాధ్యం అని జగన్ అంటోంటే.. నాకు సంపద సృష్టించడం తెలుసు, సంపద సృష్టించి పంచి పెడతా అని కల్లబొల్లి కబుర్లు చెబుతున్న చంద్రబాబు.. అదే సంపద సృష్టి ద్వారా.. చార్జీలు పన్నులు పెంచకుండా రాష్ట్రప్రజలను ఆదుకోవచ్చు కదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Show comments