నాగబాబు మొహం చూసి ఓటేసే వారున్నారా?

పవన్ కల్యాణ్ ను నమ్ముకుని రాజకీయంగా చాలా పెద్ద పెద్ద ఆశలు పెట్టుకుని, ప్రస్తుత ఎన్నికల పర్వంలో ఎదురైన భంగపాటును జాగ్రత్తగా దాచుకుని బయట తిరుగుతున్న వ్యక్తి సినీ నటుడు నాగబాబు. తమ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి పిఠాపురంలో తమ్ముడు పవన్ కల్యాణ్ ను గెలిపించండి అని సందేశం ఇవ్వడం వరకే పరిమితం అయ్యారు. అయితే తమ్ముడు నాగబాబు.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ ను ఓడించాల్సిన అవసరం గురించి తాను కూడా ఒక వీడియో విడుదల చేశారు.

సొంత యూట్యూబ్ చానెల్ పెట్టుకుని తరచూ వీడియోల ద్వారా వివాదాస్పద సందేశాలు, అభిప్రాయాలు వెలువరించడం ఈ వెటరన్ నటుడికి అలవాటే. అయితే ఎన్నికల సీజను గనుక.. యూట్యూబ్ వ్యూస్ కక్కుర్తి లేకుండా ఫ్రీ బైట్ గా అందరికోసం ఒక వీడియో వదిలారు. ఇందులో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ కు ఓటు వేయవద్దని ప్రజలకు సందేశం ఇచ్చారు. మళ్లీ ఓటు వేస్తే రాష్ట్రం నాశనం అయిపోతుందని, ఇక్కడ ఇంకేం మిగలదని, ఆ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని.. ఇంకా చాలా సంగతులు నాగబాబు ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

తమాషా ఏంటంటే.. గత కొన్ని సంవత్సరాలుగా షూటింగుల మధ్య గ్యాప్ దొరికినప్పుడూ.. అలాగే గత కొన్ని నెలలుగా ప్రతిరోజూ పవన్ కల్యాణ్ చెబుతున్న మాటలే  ఈ వీడియోలో కూడా ఉన్నాయి. కొత్త  సంగతి ఒక్కటైనాలేదు. పవన్, వైసీపీ సర్కారు మీద బోలెడు ఆరోపణలు చేస్తూ వస్తుండగా... వాటిలో తనకు గుర్తున్నంత వరకు నాగబాబు ఈ వీడియోలో వల్లించి.. ప్రజలను ఓటు వేయవద్దని పిలుపు ఇచ్చినట్టుగా ఉంది.

అయినా ఇక్కడ జనాలకు ఒక సందేహం కలుగుతోంది. అసలు జస్ట్ నాగబాబు మొహం చూసి, ఆయన చెప్పిన మాట విని ఓటువేసే ప్రబుద్ధుడు ఈ రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్కడైనా ఉన్నాడా? అని! పవన్ కల్యాణ్ ను ఆదరించే జనం కాకుండా, నాగబాబుకు అదనంగా ఒక్కరి ఆదరణ అయినా ఈ రాష్ట్రంలో ఉన్నదా అనేది ప్రజల సందేహం.

Readmore!

పవన్ తిట్టే తిట్లే తిడుతూ, పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే సందేశం ఇవ్వడానికి ప్రత్యేకంగా నాగబాబు వీడియో చేయడం ఎందుకు దండగ అని కొందరు అంటున్నారు. ఏదో రాష్ట్రవ్యాప్తంగా బలిజ, కాపు ఓటర్లతో మీటింగులు పెట్టుకుంటూ కాలం గడపకుండా ఈ వీడియోల పని ఆయనకెందుకు అని అంటున్నారు.

అయితే తమాషా ఏంటంటే.. నాగబాబు ఎంపీ కావాలని కోరుకున్నారు. ఆయనకు ఎంపీ టికెట్ ఆశపెట్టి, దానిని బిజెపికి త్యాగం చేసి, రాజ్యసభకు పంపేలా ఒప్పించారు పవన్ కల్యాణ్. మరి రాజ్యసభ ఎంపీ పదవికి గేలం వేస్తున్నప్పుడు.. విజయం కోసం ఏదో  ఒకటి చేసినట్టు కనిపించాలి కదా.. అందుకే నాగబాబు ఇలా హడావుడి చేస్తున్నారని అంతా నవ్వుకుంటున్నారు.

Show comments