ఇప్పటికైనా వారికి బుద్ధి వస్తుందా!?

అబద్ధాలు మాట్లాడడంలో హద్దులు దాటి వారు సాగిస్తూ వచ్చిన దుర్మార్గపు తప్పుడు ప్రచారాలను న్యాయస్థానం అభ్యంతర పెట్టినప్పుడే వారు నోరు మూసుకుని ఉండాల్సింది. అలా చేయకుండా న్యాయపరంగా అవకాశం ఉన్నది కదా అని, హైకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. వారి దుర్బుద్ధులకు అక్కడ కూడా భంగపాటు ఎదురయింది! మళ్లీ కింది కోర్టుకే రావాల్సి వచ్చింది. ఆ కోర్టు రెండోసారి మొట్టికాయలు వేయడం మాత్రమే కాదు, ఇలాంటి పనులు చేస్తున్నందుకు జరిమానా కట్టి వెళ్లాలంటూ తీవ్రంగానే మందలించింది.

ఇలా కోర్టు ఎదుట పరువు పోగొట్టుకున్న నాయకులు మరెవరో కాదు షర్మిల, సునీత, తెలుగుదేశం పార్టీకి చెందిన బీటెక్ రవి! కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో తమ తమ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ అదే పనిగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి అనుచితమైన రీతిలో మాట్లాడడం, తద్వారా వక్ర రాజకీయ ప్రయోజనాలు పొందాలని చూడడం వారు చేసిన నేరం !

తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సారధ్యం స్వీకరించిన తర్వాత మాత్రమే చిన్నాన్న హత్య కేసు గుర్తు వచ్చినట్లుగా చెలరేగిపోవడం ప్రారంభించిన వైఎస్ షర్మిల, ఎంపీ అభ్యర్థిగా మరింత దూకుడు ప్రదర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉన్న సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని పదేపదే ‘హంతకుడు’గా అభివర్ణిస్తూ, ఆమె తన ఎన్నికల ప్రచారంలో డోసు పెంచారు.

అదేమని అభ్యంతర పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కౌంటర్లు ఇస్తూ.. తాను సిబిఐ ఛార్జ్ షీటులో ప్రస్తావించిన అంశాలను మాట్లాడుతున్నానే తప్ప, అవినాష్ రెడ్డి మీద కొత్తగా ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని బుకాయించే ప్రయత్నం చేశారు.

Readmore!

సిబిఐ అయినా సరే అవినాష్ రెడ్డిని నిందితులలో ఒకరుగా చేర్చిందే తప్ప హంతకుడిగా ధ్రువీకరించలేదు. ఆ విషయాన్ని న్యాయస్థానం తేల్చాల్సి ఉంది. అయితే షర్మిల మాత్రం అవినాష్ రెడ్డి హంతకుడని, హంతకులను మళ్లీ పార్లమెంటుకు పంపేందుకు జగన్మోహన్ రెడ్డి తవన పడుతున్నాడని పదేపదే ఆరోపిస్తూ అనుచితమైన మార్గంలో రాజకీయ ప్రయోజనం పొందాలని అనుకున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ఈ పోకడలపై జిల్లా కోర్టును ఆశ్రయించినప్పుడు వైయస్ షర్మిల గాని, సునీత రెడ్డి గాని, బీటెక్ రవి గాని ఎవ్వరూ కూడా తమ ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్య విషయాన్నీ ప్రస్తావించడానికి వీలు లేదని న్యాయస్థానం తీర్పు చెప్పింది. అయితే ఈ ముగ్గురు అక్కడితో ఆగకుండా హైకోర్టును ఆశ్రయించారు. ఆ కోర్టు కూడా జిల్లా కోర్టులోనే తేల్చుకోవాలని వారి పిటిషన్ను తిప్పి కొట్టింది. జిల్లా కోర్టు తమ పాత తీర్పునే పునరుద్ఘాటిస్తూ ఇలాంటి పిటిషన్ తో మళ్ళీ వచ్చినందుకు ఈ ముగ్గురికి తలో పదివేల రూపాయలు వంతున జరిమానా కూడా విధించింది.

వారు చేస్తూ వచ్చినదే తప్పుడు ప్రచారం. దానికి తోడు హైకోర్టులు అప్పీలు చేయడం కూడా అదనం. ఇప్పుడు జరిమానాలు పడిన తర్వాతనైనా ఈ ముగ్గురికి కనీసం బుద్ధి వస్తుందా? లేకపోతే ఇంకా వివేకా హత్య కేసును పట్టుకుని ఊగులాడుతూ రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారంతోనే బతుకుతూ ఉంటారా అనేది వేచి చూడాలి!

Show comments