టీఆర్పీ రేటింగ్స్ ని బట్టి వైకాపాకి 153

ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో ముందస్తుగా చెప్పడానికి పద్ధతులేవిటి? అందరికీ తెలిసినవి సర్వేలు. అయితే ఈ సర్వేలు 3 రకాలు. 

1. డబ్బు తీసుకుని ఏమీ చేయకుండా చెప్పేవి

2. ఫలానా పార్టీ మీద అభిమానంతో ఆ పార్టీయే గెలుస్తుందని చెప్పేవి 

3. నిజంగా క్షేత్రస్థాయిలో కష్టపడి చేసేవి. 

Readmore!

ఇక్కడ మొదటి రెండూ పక్కన పెట్టేసి మూడో దానిని ప్రామాణికంగా తీసుకోవచ్చా? 

నిజానికి తీసుకోలేము. 

ఎందుకంటే ఏ నియోజకవర్గంలోనైనా ఓట్లేసే ఓటర్లు లక్షల్లో ఉంటారు. సర్వేలు చేయడానికి తీసుకునే శాంపిల్ మహా అయితే 1000 మంది ఉండొచ్చు. ఆ వెయ్యి మంది చెప్పేదానిని లక్షలమందికి ఎలా ఆపదించగలం? 

లాజికల్ గా అయితే ఆపదించలేం. 

ఎందుకంటే మరో వెయ్యి మందిని అడిగితే పూర్తి భిన్నమైన అభిప్రాయాలు వెలువడొచ్చు. 

కనుక ఎలా చూసుకున్నా పక్షపాతం లేకుండా చేసే సర్వేలు కూడా కరెక్టని ఘంటాపథంగా చెప్పడం కష్టం. 

అందుకే ఇరుపక్షాల వైపునుంచీ సానుకూల సర్వే లెక్కలు వినిపిస్తుంటారు. కానీ గెలుపు ఏదో ఒకవైపే ఒరుగుతుంది. ఒక్కోసారి గెలిచిన వారు చెప్పుకున్న దానికంటే ఎక్కువ సీట్లు గెలవచ్చు. 2019లో తెదేపా 122 గెలుస్తామని చెప్పారు. 23 గెలిచారు. 

వైకాపా 122 గెలుస్తామని చెప్పుకున్నారు. వాళ్లే అవాక్కయ్యేలా 151 గెలిచారు. 

కనుక సర్వేలనేవి పూర్తిగా నమ్మలేనివి. 

మరి దేనిని నమ్మాలి? వేరే దారి లేదా? అంటే..కొత్తగా ఒకటి కనిపిస్తోంది. 

అవే, న్యూస్ చానళ్ల టీఆర్పీ రేటింగులు. 

ఈ రోజుల్లో ప్రతి న్యూస్ చానల్ ఏదో ఒక పార్టీకి సానుకూలంగా డప్పు కొడుతున్నవే ఉన్నాయి. అందుకే "పచ్చమీడియా" అని ఒక పక్షం అంటుంటే, "బ్లూ మీడియా" అని మరొక పక్షం అంటుంటుంది. 

ఎన్.టీవి, టీవీ9, సాక్షి..ఈ మూడూ ఏకధాటిగా ఎడతెరిపి లేకుండా జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి గొప్పగా చెబుతూ, ఆ పార్టీ గురించి పాజిటివ్ గా మాట్లాడేవారి బైట్స్ ని ప్రసారం చేస్తూ ఉన్నాయి. 

వీటికి పూర్తి భిన్నంగా టీవీ5, ఏబీయన్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చానల్స్ తెదేపాకి, చంద్రబాబుకి సానుకూలంగా చర్చలు, ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. 

రెండు రకాల చానల్స్ కి ప్రేక్షకులుంటారు. ఎవరి మనోభావాలని చమ్మగా నిమిరే చానల్స్ ని వారు చూస్తారు. 

ఇంకా డైరెక్ట్ గా చెప్పాలంటే వైకాపా అభిమానులు టీవీ5, ఏబీయన్, ఈటీవీలను చూడరు...వాళ్లు సాక్షి, ఎన్.టివి, టీవీ9 లనే అంటిపెట్టుకుని కూర్చుంటారు. 

అలాగే తెదేపా అభిమానులు సాక్షి, ఎన్.టివి, టీవీ9 లను చూడరు. చూసినా చిరాకొచ్చో, మనోభావాలు హర్టయ్యో వెంటనే తమను స్వస్థపరిచే టీవీ5, ఏబీయన్, ఈటీవీలనే చూస్తారు. 

అది మానవసహజం. మనిషి సైకాలజీ. అందులో తప్పేమీ లేదు. 

కేవలం జర్నలిస్టులు, సోషల్ మీడియాలో ట్రోలింగులు చేసేవాళ్లు తమ ఆపోజిట్ చానల్స్ ని యూట్యూబులో చూస్తారేమో తప్ప, క్షేత్ర స్థాయిలోని అసలు సిసలు ఓటర్స్ మాత్రం కేబుల్ నెట్వర్క్ ద్వరా వారికి నచ్చిన ఛానల్ నే తమ టీవీలో రన్ చేస్తూ ఉంటారు. 

ఇంతకీ మేటరుకొస్తే తాజాగా టీఆర్పీ రేటింగులు వెలుగు చూసాయి. 

ఈ రేటింగులు ఎవరూ మాయా మర్మం చేసి చెప్పేవి కావు. ఆటోమేటిక్ గా ప్రజలు ఎక్కువసేపు ఏ చానల్స్ ని చూస్తున్నారో రికార్డవుతుంది. 

ఆ లెక్క ప్రకారం ఎన్.టివి ప్రధమస్థానంలో 71.5 రేటింగ్ లో ఉంటే, టీవీ9 ద్వితీయ స్థానంలో 70.5 వద్ద ఉంది. ఇక మూడవ స్థానంలో సాక్షి 45.8 దగ్గర ఉంది. ఈ మూడు చానల్స్ పైన చెప్పుకున్నట్టు వైకాపా సానుకూల మీడియాలే. 

ఇక 4.5,6 స్థానాల్లో వరుసగా టీవీ5, ఏబీయన్, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ చానల్స్ ఉన్నాయి. వీటి అంకెలు వరుసగా 34.5, 26.2, 22.7 గా ఉన్నాయి. ఈ మూడూ తెదేపా సానుకూల చానల్స్.

రెండింటికీ ఎంత తేడానో చూడండి. ఏకంగా మూడు రెట్లు తేడా. 

అంటే రాష్ట్రవ్యాప్తంగా వైకాపా సానుకూల చానల్స్ మాత్రమే ఎక్కువ సేపు చూసే ప్రజానీకం చాలా ఎక్కువగా ఉన్నారన్నమాట. దీనిని బట్టి "మూడ్ ఆఫ్ ద స్టేట్" ఊహించొచ్చు కదా. 

ఈ విషయం మీద టాప్ మేనెజ్మెంటులో ఉన్న ఒక సీనియర్ చానల్ ఉద్యోగి చెప్పిన విషయం ఏంటంటే- "ఈ టీఆర్పీ రేటింగులు చాలా కీలకం. అన్ని సర్వేలకీ అమ్మ లాంటివి. లక్షలమంది మనోభావాల్ని సూచించేవి. ఈ రేటింగుల్ని బట్టి చూస్తుంటే ఈ సారి వైకాపా 153 గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు," అని అన్నారు. 

ఇంతకీ ఈ సీనియర్ ఉద్యోగి ఇక్కడ చెప్పునున్న 6 చానల్స్ లో దేనికీ సంబంధమున్న వ్యక్తి కాదు. 

టాప్ 6 స్థానాల్లో జంబ్లింగ్ జరిగి ఉన్నా, అటా-ఇటా అనే డిస్కషన్ ఉండేది. కానీ మొదటి మూడు స్థానాల్లో ఒక పార్టీకి చెందిన చానల్స్, తర్వాతి మూడింట్లో మరొక పార్టీకి చెందినవి భారీ తేడాతో ఉండడంతో... మళ్లీ వైకాపాకి ఆ పార్టీ వాళ్లు కూడా ఊహించని బలమైన గెలుపు పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. 

ఒకవేళ ఇదే నిజమైతే రానున్న ఎన్నికల్లో ఏ సర్వేల మీదా టైం వేస్ట్ చేసుకోకుండా నేరుగా టీఆర్పీ రేటింగులు గమనిస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ అంచనా తప్పితే, అప్పుడు వీటిని ప్రామాణికంగా తీసుకోనక్కర్లేదని కూడా తేలుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో!

ఇదిలా ఉంటే...ఒక వైకాపా సానుకూల చానల్లో సర్వేలను యూట్యూబులో చూసిన ఒక వ్యక్తి, "వీళ్లేదో చెబుతున్నారు కానీ, క్షేత్రస్థాయిలో ఇలా లేదు" అని కామెంట్ పెట్టాడు. 

దానికి మరొక వ్యక్తి, "అవును నిజమే. ఓటులేని కొందరు ఎన్నారైలు, పక్క రాష్ట్రంలో కూర్చున్న బాబుగారి అభిమాన సంఘం ప్రతినిథులు, పచ్చ చానళ్లు..ఇవే మీరు చెప్పే ఆ క్షేత్ర స్థాయి" అని బదులిచ్చాడు.

ఈ గందరగోళమంతా సద్దుమణగాలంటే అసలు విజేత ఎవరో తేలాల్సిందే. దానికోసం జూన్ 4 వరకు ఆగాల్సిందే.  

హరగోపాల్ సూరపనేని

Show comments