ఏబీవీపై స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌!

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపై ఎట్ట‌కేల‌కు స‌స్పెన్ష‌న్ ఎత్తివేత‌కు ఆదేశాలొచ్చాయి. ఈ మేర‌కు క్యాట్ (సెంట్ర‌ల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యున‌ల్‌) ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. రెండోసారి త‌న‌ను స‌స్పెండ్ చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ ఆయ‌న క్యాట్‌ను ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ప‌లు ద‌ఫాలు విచార‌ణ అనంత‌రం... ఏబీవీకి ఊర‌ట ద‌క్కింది.

చంద్ర‌బాబు హ‌యాంలో నిఘా విభాగం అధికారిగా ఏబీ కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్ల‌ను ట్యాప్ చేసేవార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. త‌మ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీడీపీలో చేర‌డం వెనుక ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు కీల‌క పాత్ర పోషించార‌ని వైసీపీ ముఖ్య నేత‌ల ఆరోప‌ణ‌. అందుకే ఏబీవీపై సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఉన్నారు.

బాబు హ‌యాంలో నిఘా ప‌రిక‌రాల వ్య‌వ‌హారం, ఇత‌ర‌త్రా ఆరోప‌ణ‌ల‌పై ఏబీపై జ‌గ‌న్ స‌ర్కార్ కేసు న‌మోదు చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్య‌త‌ల నుంచి అత‌న్ని త‌ప్పించి కేసు న‌మోదు చేసింది. అత‌నిపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. మొద‌టిసారి క్యాట్‌, కేంద్ర హోంశాఖ నుంచి ఆయ‌న‌కు వ్య‌తిరేక‌త ఎదురైంది. అనంత‌రం కోర్టులో ఆయ‌న‌కు ఊర‌ట ల‌భించింది.

విధుల్లోకి తీసుకోవాల‌ని న్యాయ స్థానం ఆదేశించింది. అనేక ట్విస్ట్‌ల మ‌ధ్య ఆయ‌న‌కు పోస్టింగ్ ఇవ్వ‌లేదు. రెండోసారి ఆయ‌న‌పై సస్పెన్ష‌న్ వేటు వేసింది. మ‌రోసారి ఆయ‌న క్యాట్‌ను ఆశ్ర‌యించారు. ప‌లు ద‌ఫాలు విచార‌ణ జ‌రిగింది. విచార‌ణ పూర్త‌యి తీర్పు రిజ‌ర్వ్‌లో ఉంచింది. ఇవాళ వెలువ‌రించిన తీర్పు ఏబీవీకి అనుకూలంగా వుంది.  
 
ఏబీ వెంకటేశ్వరరావుని వెంట‌నే విధుల్లోకి తీసుకోవాల‌ని, అలాగే ఆయ‌న ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన ఎరియర్స్ మొత్తం ఇవ్వాలంటూ క్యాట్ త‌న ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. 

Readmore!

Show comments