ఏపీలో ఏక‌ప‌క్షంగా ఎన్నిక‌ల సంఘం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్నిక‌ల సంఘం తీరు తీవ్ర విమ‌ర్శ‌ల‌పాల‌వుతోంది. కేంద్రంలో బీజేపీ పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తోంద‌న్న విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చేలా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఏపీలో అధికార పార్టీ ఫిర్యాదుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం, మ‌రోవైపు కూట‌మి ఫిర్యాదుల‌పై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటోంద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ ఎన్నిక‌ల సంఘం తీరుపై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై తీవ్ర ఒత్తిడి వుంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

తామిచ్చిన ఫిర్యాదుల‌పై ఎలాంటి చ‌ర్య‌లు లేవ‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఫిర్యాదు చేస్తే అక్క‌డి ఎన్నిక‌ల క‌మిష‌న్ చ‌ర్య‌లు తీసుకున్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేశారు.

కేసీఆర్ ప్ర‌చారంపై రెండు రోజుల పాటు నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఏపీలో నిబ‌ద్ధ‌త‌తో ప‌ని చేసే అధికారుల‌పై బ‌దిలీ వేటు వేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఏపీ చీఫ్ సెక్ర‌ట‌రీని బ‌దిలీ చేయాలంటూ ప్ర‌తిప‌క్షాలు ఫిర్యాదు చేయ‌డాన్ని ఆయ‌న గుర్తు చేశారు. మ‌రీ ముఖ్యంగా రైతు భ‌రోసా, అలాగే విద్యార్థుల‌కు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ నిధులు అంద‌కుండా ఎన్నిక‌ల సంఘం నిషేధం విధించ‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు. ప్ర‌తిప‌క్షాల ఫిర్యాదుతో రైతులు, విద్యార్థుల‌కు న‌ష్టం వ‌స్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

Readmore!

Show comments