ఢిల్లీ పెద్దలు ఏపీ మొహం చూడడం లేదే!

ఏపీ కాంగ్రెస్ అనాథలా మారిందా? షర్మిల చేతిలో పగ్గాలు పెట్టేసి మీ చావు మీరు చావండి.. సాయం కోసం మధ్యమధ్యలో మా వద్దకు రావొద్దు.. అని ఢిల్లీ పెద్దలు ముందుగానే హుకుం జారీ చేసేసారా? ఎన్నికల ప్రచార పర్వం ఒక కొలిక్కి వచేస్తుండగా.. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం నిమిత్తం.. ఒక్క కాంగ్రెస్ సెలబ్రిటీకూడా రాకపోవడం వెనుక మర్మం ఇదేనా? అనే రకరకాల సందేహాలు ఇప్పుడు ప్రజల్లో రేకెత్తుతున్నాయి.

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి నామమాత్రంగా కూడా టికానా లేదనే సంగతి అందరికీ తెలుసు. విభజన తర్వాత ఆ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా శవాసనం వేసింది. ఇప్పటిదాకా లేవనే లేదు. వైఎస్ షర్మిల చేతిలో పగ్గాలు పెట్టినంత మాత్రాన అద్భుతాలు జరిగిపోతాయనే ఆలోచన కాంగ్రెస్ పెద్దలకు లేదు.

తెలంగాణలో సొంత పార్టీ స్థాపించి, కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల త్యాగానికి అక్కడ ఆమెకు ఏ దారీ చూపించలేక పోయిన కాంగ్రెస్ పెద్దలు ఏపీసీసీ పదవి కట్టబెట్టి చేతులు దులుపుకున్నారేమో అనిపిస్తోంది.

పదవి అప్పగించిన నాటి నుంచి.. నేను వైఎస్ఆర్ బిడ్డను అని చెప్పుకుంటూ.. ఏపీలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్నారు. నా తండ్రి వైఎస్ఆర్ ఆశయం రాహుల్ ను ప్రధాని చేయడానికి పాటు పడుతున్నా అని ఆమె పదేపదే అంటున్నారు గానీ.. అందుకోసం ఆమె చేయగలిగింది సున్నా అనే సంగతి వారికి తెలుసు. దానికి తగ్గట్టుగానే ఆమెకు మద్దతు ఇవ్వడం గురించి అధిష్టానం పెద్దలు పట్టించుకోవడం లేదు.

Readmore!

రాయ్ బరెలి బరిలో దిగిన తరువాత రాహుల్ ఇక్కడ ఏపీలో ప్రచారానికి వస్తాడని అనుకోవడం భ్రమ. కనీసం ఖాళీగా ఉన్న ప్రియాంక కూడా వచ్చేలా కనిపించడం లేదు. చూడబోతే షర్మిల కనీసం కడప లోనైనా ఒక మోస్తరు పోటీ ఇవ్వగలదనే నమ్మకం కూడా వారికి లేదని తెలుస్తోంది. ఆర్థిక వనరుల పరంగా పార్టీ సపోర్ట్ చేయడం సంగతి సరే సరి.

షర్మిల ఊహించింది వేరు.. జరుగుతున్నది వేరు అని అంతా అంటున్నారు. కర్ణాటక డిప్యూటీ సిఎం కీలకం గనుక షర్మిల ఆయనను కూడా సంప్రదించారు గానీ పెద్ద ఫలితం లేదు. మొత్తానికి షర్మిల ఒంటరి అయిపోయారు. అధిష్టానం ఆమె గురించి కనీసం పట్టించుకోకపోవడాన్ని గమనిస్తూ ఉంటే.. రేపు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఏ చిన్న పదవినైనా అప్పగిస్తుందా లేదా కూరలో కరివేపాకులా అక్కడితో తీసిపారేస్తుందా అనేది చర్చనీయాంశంగా ఉంది.

Show comments