అదును చూసి చావు దెబ్బ కొట్టిన జ‌గ‌న్‌!

స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు వారం గ‌డువు చూసుకుని కూట‌మిని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చావు దెబ్బ కొట్టారు. ముస్లింల రిజ‌ర్వేష‌న్ల‌పై జ‌గ‌న్ మొద‌టిసారిగా ఘాటుగా స్పందించారు. నెల్లూరు ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ముస్లిం మైనార్టీ నాయ‌కుడు ఖ‌లీల్ అహ్మ‌ద్‌ను నిల‌బెట్టిన సంగ‌తి తెలిసిందే. నెల్లూరులో నిర్వ‌హించిన ప్ర‌చార స‌భ‌లో సీఎం జ‌గ‌న్ ముస్లిం రిజ‌ర్వేష‌న్ల తొల‌గింపు ప్ర‌క‌ట‌న‌పై నిప్పులు చెరిగారు.

ముస్లింల‌కు నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను మ‌తం ప్రాతిప‌దిక‌న ఇచ్చిన‌వి కాదని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ముస్లింల‌లో కూడా ఉన్న‌త వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్ వ‌ర్తించ‌డం లేదన్నారు. ఇవి రాజ్యాంగానికి లోబ‌డి ఆర్థికంగా వెనుక‌బాటు ప్రాతిప‌దిక‌గా ఇచ్చిన రిజ‌ర్వేష‌న్లని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ఇలాంటి రిజ‌ర్వేష‌న్ల‌పై రాజ‌కీయం చేస్తూ వారి జీవితాల‌తో చెల‌గాటం ఆడ‌డం ధ‌ర్మ‌మేనా? స‌రైందేనా? అని బీజేపీని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ప్ర‌తి మైనార్టీ సోద‌రుడికి, అక్క‌చెల్లెమ్మ‌ల‌కు చెబుతున్నా... నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్ విష‌య‌మే కానివ్వండి, ఎన్ఆర్‌సీ, సీఏఏ, ఇంకా ఏ మైనార్టీ అంశ‌మైనా వారికి అండ‌గా నిలుస్తాన‌ని జ‌గ‌న్ భ‌రోసా ఇచ్చారు. మైనార్టీల‌ మ‌నోభావాల‌ను అనుగుణంగా ఎప్ప‌టికీ వారి బిడ్డ జ‌గ‌న్ అండ‌గా నిలుస్తాడ‌ని హామీ ఇచ్చారు. ముస్లింల‌కు నాలుగు శాతం రాజ‌కీయ‌ రిజ‌ర్వేష‌న్ క‌ల్పించిన పార్టీ కూడా వైసీపీనే అని ఆయ‌న అన్నారు. 175 అసెంబ్లీ స్థానాల్లో 7 సీట్ల‌ను ముస్లిం మైనార్టీల‌కు ఇచ్చాన‌న్నారు.

ముస్లిం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తామ‌ని శ‌ప‌థం చేసిన బీజేపీతో చంద్ర‌బాబు జ‌త క‌ట్టాడని ధ్వ‌జ‌మెత్తారు. మ‌ళ్లీ ముస్లింల కోసం చంద్ర‌బాబు డ్రామాలు ఆడుతున్నాడ‌ని విమ‌ర్శించారు. మైనార్టీల‌కు ఎప్ప‌టికీ అండ‌గా వుంటాన‌న్నారు. చంద్ర‌బాబుది ఊస‌ర‌వెల్లి రాజ‌కీయం అన్నారు. ఇంత వ‌ర‌కూ జ‌గ‌న్ ముస్లింల రిజ‌ర్వేష‌న్ల‌పై నోరు మెద‌ప‌లేదు. మొద‌టిసారి మైనార్టీ అభ్య‌ర్థి నిలిచిన నియోజ‌క వ‌ర్గానికి వెళ్లి ఇటు బీజేపీ, అటు టీడీపీని ఏకిపారేశారు.

Readmore!

ఎన్నిక‌ల‌కు కేవ‌లం వారం రోజులు మాత్ర‌మే స‌మ‌యం ఉండ‌గా, మైనార్టీల రిజ‌ర్వేష‌న్ల‌పై జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో స్పందించ‌డం కూట‌మిలో వ‌ణుకు పుట్టిస్తోంది. ముస్లింల రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తామ‌ని చెబుతున్న బీజేపీతో అంట‌కాగ‌డం టీడీపీ, జ‌న‌సేన‌కు రాజ‌కీయంగా తీవ్ర న‌ష్టం జ‌ర‌గ‌నుందనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

Show comments