తెదేపా మేనిఫెస్టో- వైకాపా గెలుపుకి శుభలేఖ

మేనిఫెస్టో అనేది ప్రజలకి, నాయకులకి మధ్య నమ్మకానికి సంబంధించిన అంశం. మేమివి చేస్తానని చెప్పడం నాయకుల పని. అవి చేస్తారా చెయ్యరా అనేది వేరే విషయం. అసలు కొన్ని విషయాలు ప్రస్తావనే తేకపోతే ఏమనుకోవాలి?

చంద్రబాబు-పవన్ లు వదిలిన మేనిఫెస్టోలో కీలకమైన రెండు అంశాలు మిస్సింగ్. అవేమిటో గుర్తించారా?

1. విద్య

2. వైద్యం

Readmore!

ఈ రెండు జగన్ మోహన్ రెడ్డి పాలనలో విప్లవాత్మకంగా జరుగుతున్నాయని అందరికీ తెలుసు.

ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ, మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఇంటివద్దకే వైద్యం, 104, 108 సేవలు...ఇలాంటివి ప్రజలకి విపరీతమైన భరోసానిచ్చాయి. జగన్ పాలనపట్ల సానుకూల దృక్పథాన్ని పెంచాయి. 

కానీ ఈ రెండూ తెదేపా మేనిఫెస్టోలో లేవు. అంటే పదవిలోకొస్తే వాటికి మంగళం పలుకుతానని చెప్పకనే చెప్పినట్టా?

తెదేపా ప్రభుత్వమొస్తే ప్రభుత్వ బడులకి మళ్లీ పాత గతినే పట్టించి చైతన్య, నారాయణ పాఠశాలలకే వెళ్లి చదువుకోమంటారా? 

అదే పరిస్థితి వస్తే ఇప్పటికిప్పుడు ప్రభుత్వబడుల విద్యార్థులు ఏమైపోవాలి?

ఉచిత విద్య, మధ్యాహ్న భోజన వసతి, స్కూల్ బ్యాగులు, యూనిఫాం... ఇవన్నీ ప్రశ్నార్ధకంలో పడతాయా? 

ఇవే ఇప్పుడు ప్రజల మననుల్లో మెదులుతున్న ప్రశ్నలు. 

అలాగే ఎక్కడా జగన్ ప్రతిపాదించిన, అమలు పరుస్తున్న మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని కొనసాగిస్తానని తెదేపా మేనిఫెస్టోలో పేర్కొనలేదు. అంటే ఇక్కడ కూడా అయినవాళ్ల ప్రైవేట్ ఆసుపత్రులకి వెన్నుదన్ను ఇచ్చే క్రమంలో మెడికల్ కాలేజీల విషయాన్ని మూలకు నెడతాడా చంద్రబాబు? 

ఇది ఓటర్లని భయపెడుతున్న మరొక ప్రశ్న. 

పోనీ ఉన్న ప్రభుత్వ బడుల్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాననో, క్లాస్ రూముల్ని ఏసీ చేస్తాననో, ప్రతి మెడికల్ కాలేజీని అపోలో ఆసుపత్రి అంత పెద్దగా కడతాననో మేనిఫెస్టోలో గ్రాఫిక్స్ వేసి చూపించొచ్చుకదా! అమరావతిని అలాగే చూపించారు కదా గతంలో. అలవాటే కనుక, కనీసం అలా చూపించినా నమ్మిన వాళ్లు నమ్ముతారు. వెయ్యాలనుకునే వాళ్లు భయం లేకుండా ఓటేస్తారు. 

కానీ అసలు విద్య, వైద్యం గురించి ప్రస్తావనే లేనందువల్ల తెదేపాకే ఓటేయడానికి సిద్ధపడినవాళ్లు కూడా ఆలోచనలో పడుతున్నారు. 

మేనిఫెస్టో అంటే తమ ఓటర్లు కానివాళ్లని కూడా తమ వైపుకి తిప్పుకునేలా ఉండాలి. కానీ ఇక్కడ ఉన్న ఓటర్లు కూడా వెయ్యాలా వద్దా అని ఆలోచించేలా ఉంది మేనిఫెస్టో. అందుకే తెదేపా-జనసేన మేనిఫెస్టో ఘోరాతిఘోరమైన అట్టర్ ఫైల్యూర్. 

ఇంతకీ మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమ్మఒడి కొనసాగిస్తాను, పెన్షన్లు యథాతథంగా ఇస్తాను, వికలాంగులకి, అర్చకులకి, ఇంకా కొన్ని కులాల వారికి ఆర్ధిక సాయం చేస్తాను..ఇలాంటివే ఉన్నాయి. వీటిల్లో ఒక హైలైట్ ఏంటంటే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తాడట. 

అసలీ రోజుల్లో ప్రజల ఆరోగ్య ప్రమాణం, ఆయుష్షు ఎంత పెరిగింది? 50 ఏళ్లు పెన్షన్ తీసుకునే వయసా? ఖజానా మీద భారమెంత పడుతుంది? అసలిది అమలు పరచగలిగేదేనా? అంటే... ఇలా చెబితే 50-60 మధ్య వయసులో ఉన్న వాళ్లంతా పెన్షన్ కోసం తనకే ఓటేస్తారని చంద్రబాబు ఆలోచన అన్నమాట. ఇంతకంటే దిగజారుడుతనం ఇంకొకటి ఉండదు. 

పసుపుకుంకాల పేరుతో 2019 ఎన్నికల ముందు ప్రభుత్వ ఖజానాలోంచి 10,000 రూపాయలేస్తేనే తెదేపాకి ఓట్లేయలేదు ప్రజలు. ఇప్పుడు తాను పదవిలోకొస్తే 50 కే పెన్షన్ అంటే "ఆలసించిన ఆశాభంగం" అనుకుని జనమంతా పరుగెత్తుకెళ్లి తనకి ఓటేస్తారనుకోవడం ఎంత అవివేకం? 

అపర చాణక్యుడు, విజనరీ అని పచ్చ మీడియా పేర్లు పెడితే అదే నిజమని నమ్మేస్తున్న కొందరు ఎన్నారైలు, విద్యావంతులు ఇప్పుడైనా ఆలోచించాలి. 

50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వడమా విజనరీ ఆలోచన?

ఇలాంటి వాడా జగన్ మోహన్ రెడ్డి అమ్మఒడి స్కీముని ఎద్దేవా చేస్తూ ఐదేళ్లు గడిపాడు?

పైగా ఇప్పుడు అదే అమ్మఒడిని ఒక బిడ్డకి కాదు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానంటాడా? సిగ్గుచేటుగా లేదు! 

ఇక ఇళ్ల విషయం గురించి ఏం చెప్పాడో చూద్దామంటే, 3 సెంట్ల భూమి ఇస్తానని పేర్కొన్నారు మేనిఫెస్టోలో. అల్రెడీ జగనన్న ఇళ్లు పేరుతో స్థలంతో పాటూ వాటిల్లో ఇళ్లు కట్టి ఇవ్వడం జరిగింది.

మరి తెదేపా మేనిఫెస్టోలో స్థలం గురించి ఉంది తప్ప ఇల్లు గురించి లేదంటే... బాబుగారు స్థలం ఇవ్వడం తప్ప ఇల్లు కట్టివ్వరా అనే అనుమానం ఆ లబ్ధి పొందడానికి అర్హులైన ఓటర్లకుంది. 

"జగన్ స్కీముల్ని కొనసాగించడం కోసం చంద్రబాబుని ఎందుకు ఎన్నుకోవాలి?"

"ప్రస్తుతమున్న విద్య, వైద్యం, ఇళ్ల విషయాన్ని ప్రస్తావించకుండా అనుమానాలు రేకెత్తిస్తున్న కూటమికి ఓటెందుకేయాలి?"

"కూటమిలో మూడో పార్టీ అయిన బీజేపీ మేనిఫెస్టోలో కనపడకుండా ఎందుకు దాక్కున్నట్టు? అంటే ఈ వాగ్దానాలన్నీ నీటి మీద రాతలేనా?"

ఇలాంటి ప్రశ్నలతో ఓటు వేసే వాళ్లు కూడా వేయకుండా ఉండే పరిస్థితిని తెచ్చుకున్నారు కూటమి వారు. అసలే పరమ నీరసంగా, అయోమయంగా ఉన్న కూటమి వర్గం ఈ మేనిఫెస్టోతో సెల్ఫ్ ఏక్సిడెంట్ చేసుకున్నట్టయ్యింది. 

తెదేపా మేనిఫెస్టో వైకాపా గెలుపుకి శుభలేఖలా ఉంది. అదీ పరిస్థితి. 

- హరగోపాల్ సూరపనేని

Show comments