జ‌న‌సేన‌కు ఈసీ షాక్‌!

జ‌న‌సేన గుర్తుపై వివాదం కొన‌సాగుతూనే వుంది. జ‌న‌సేన గుర్తు గాజుగ్లాసును ఫ్రీ సింబ‌ల్ కింద కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉంచింది. దీంతో ఆ గుర్తును స్వ‌తంత్ర అభ్య‌ర్థులు కోరుకున్నారు. అలా కోరుకున్న వారికి గాజుగ్లాసు గుర్తును ఈసీ కేటాయించింది. ఈ నేప‌థ్యంలో గాజుగ్లాసును ఇత‌రులకు కేటాయిస్తే, పొత్తులో ఉన్న పార్టీల‌కు న‌ష్ట‌మ‌నే ఆందోళ‌న మొదలైంది.

దీంతో గాజుగ్లాసు గుర్తును ఇత‌రుల‌కు కేటాయించొద్దంటూ జ‌న‌సేన ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందించి జ‌న‌సేన పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాల ప‌రిధిలోని పార్ల‌మెంట్ అభ్య‌ర్థుల‌కు, అలాగే ఆ పార్టీ ఎంపీ అభ్య‌ర్థులు పోటీ చేసే అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో స్వ‌తంత్రుల‌కు గాజుగ్లాసు గుర్తు కేటాయించ‌మ‌ని ఈసీ తెలిపింది. దీంతో పిటిష‌న్‌ను ఏపీ హైకోర్టు మూసివేసింది.

అయితే గాజుగ్లాసును ఇత‌రుల‌కు కేటాయిస్తే త‌మ‌కు న‌ష్ట‌మంటూ టీడీపీ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించింది. టీడీపీ పిటిష‌న్‌పై ఇవాళ హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం త‌న వైఖ‌రిని న్యాయ‌స్థానానికి స్ప‌ష్టం చేసింది. ఏపీ వ్యాప్తంగా జ‌న‌సేన‌కు గాజుగ్లాసును రిజ‌ర్వ్ చేయ‌లేమ‌ని ఏపీ హైకోర్టుకు ఎన్నిక‌ల సంఘం తెలిపింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఇప్ప‌టికే మొద‌లైందని, ఈ స‌మ‌యంలో వేరే వారికి ఇచ్చిన గుర్తు మార్చ‌లేమ‌ని న్యాయ‌స్థానానికి తేల్చి చెప్పింది.

అస‌లు ఈ పిటిష‌న్‌కు విచార‌ణ అర్హ‌త లేద‌ని ఈసీ స్ప‌ష్టం చేసింది. ఇలా చేస్తే ఎన్నిక‌లు జ‌రిగే వ‌ర‌కూ పిటిష‌న్లు వ‌స్తూనే వుంటాయ‌ని ఈసీ న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఇప్ప‌టికే జ‌న‌సేన అభ్యంత‌రాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని మార్పుచేర్పులు చేశామ‌ని వివ‌రించింది. ఫ్రీ పోల్ అలయెన్స్‌లో ఇబ్బందుల‌ను గుర్తించాల‌ని ఈసీని టీడీపీ లాయ‌ర్ కోరారు. అయితే వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోడానికి ఈసీ నిరాక‌రించింది.

Readmore!

గాజుగ్లాసు గుర్తును ఎవ‌రెవ‌రికి, ఎన్ని చోట్ల కేటాయించార‌నే వివ‌రాల‌ను కోర్టు ఆదేశాల మేర‌కు గురువారం సాయంత్రానికి స‌మ‌ర్పిస్తామ‌ని ఈసీ తెలిపింది. అనంత‌రం  విచార‌ణ రేప‌టికి వాయిదా ప‌డింది.

Show comments