ఇక అప్పులు.. క్రెడిబులిటీ మధ్యనే యుద్దం

ఆంధ్ర ఎన్నికలు రెండు వారాల్లో వున్నాయి. తెలుగుదేశం- జనసేన కూటమి ఆకర్షణీయమైన మేనిఫెస్టో ప్రకటించింది. నిజానికి ఇది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ ఎన్నికల్లో వాడిన మేనిఫెస్టోకి కాపీ. ఆ రెండు రాష్ట్రాల్లో సక్సెస్ ఫుల్ గా జనాలను ఆకట్టుకుంది కనుక, ఇక్కడ చంద్రబాబు అదే వాడేసారు. జనాలకు కచ్చితంగా నచ్చుతుంది. అందులో సందేహం లేదు.

కానీ ఇక్కడ సమస్య మేనిఫెస్టో కాదు. తెలంగాణలో ఏ మేరకు అమలు చేయగలిగారు అన్నది ఫస్ట్ పాయింట్. ఆంధ్ర అడుక్కుతినే పరిస్థితికి వచ్చేసింది, అప్పుల్లో మునిగిపోతోంది, శ్రీలంక, సోమాలియా అయిపోతుంది అన్న మాటలు విసిరిన వారంతా ఇప్పుడు ఏమంటారు అన్నది తెలియదు. ఎందుకంటే ఆ నోళ్లు ఏవీ ఇప్పుడు లేవవు కనుక. ఆ రాతలు ఏవీ ఇప్పుడు రాయరు కనుక. కవరింగ్ కోసం సంపద సృష్టిస్తాం అనే పడికట్టు పదం వాడతారు. అభివృద్ధి, సంక్షేమం రెండూ సాధిస్తాం అంటూ కబుర్లు చెబుతారు.

ఇప్పుడు జనం ముందు రెండు మేనిఫెస్టోలు వున్నాయి. ఇద్దరు సీఎం అభ్యర్ధులు వున్నారు. జనం దేనికి ఎంచుకుంటారు. ఎవరికి ఓటేస్తారు. ఇదే పాయింట్.

జగన్ గతంలో ఇచ్చిన మేనిఫెస్టో ను చాలా వరకు అమలు చేసారు. మాట చాలా వరకు నిలబెట్టుకున్నారు. మరి చంద్రబాబుకు ఆ క్రెడిబులిటీ వుందా? ట్రాక్ రికార్డ్ వెరీ బ్యాడ్ కదా. పైగా మేనిఫెస్టో సందర్భంగా చంద్రబాబు మాటలు గమనించండి. ఇంటి పన్ను సమీక్షించి, హేతుబద్దత వుండేలా చూస్తాం. అంతే కానీ ఇప్పటి ధరలను తగ్గిస్తాం అని కాదు. కరెంట్ చార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలు నియంత్రిస్తాం.. అంతే తప్ప ఇప్పటి తగ్గిస్తాం అని కాదు.

Readmore!

సరే ప్రస్తుతం చంద్రబాబు అండ్ కో టార్గెట్ ఒకటే. ఎలాగో అలా, అందరూ కలిసి, జగన్ ను గద్దె దింపేయాలి. వీలైతే జైలులో తోసేయాలి. వైకాపాను చిన్నాభిన్నం చేసేయాలి. ఆ తరువాత ఇక తమకు అడ్డు వుండదు. ఏవి అమలు చేసినా, చేయకున్నా అడిగే నాధుడు వుండడు. అయిదేళ్ల తరువాత తామే దిక్కు జనాలకు.

కానీ జనాలు ఇప్పుడు ఆలోచించాల్సింది. క్రెడిబులిటీ గురించి. మాట నిలబెట్టుకునే జగన్ కు ఓటేయాలా? ఎన్నికల కోసం ఏది పడితే అది మాట్లాడి, తరువాత మాట మార్చే చంద్రబాబుకు ఓటేయాలా? ఇన్నాళ్లు అప్పులు అని అరిచిన తెలుగుదేశం జనాలకు ఓటేయాలా? జనం కోసం కిందా మీదా పడి నిధులు తెచ్చిన వైకాపాకు ఓటేయాలా? అన్నదే ఆలోచించాల్సిన సంగతి.

కేవలం ఆకర్షణీయమైన హామీలు అని లొంగితే, ఫలితం కాస్త ఆలస్యమైనా జనాలకు తెలిసిరావడం ఖాయం. ఇప్పటికే ఎన్నికలు జరిగిన మూడు నెలల్లో తెలంగాణ జనాలకు తెలిసి వస్తోంది. అది చూస్తూ కూడా చంద్రబాబు హామీలను నమ్మితే ఎవరూ చేసేది ఏమీ వుండదు. లేదూ, చేతిలో వున్న దాన్ని వదిలేసుకుని, ఆకాశంలో కనిపిస్తున్న చంద్రబాబు హామీల వెంట పరుగెడతారా? అన్నది మరో రెండు వారాల్లో తేలిపోతుంది.

Show comments