అంజాద్‌బాషా తీరుపై క‌డ‌ప వైసీపీ అసంతృప్తి

క‌డ‌ప అసెంబ్లీ వైసీపీ అభ్య‌ర్థి, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా తీరుపై సొంత పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు తీవ్ర అసంతృఫ్తిగా ఉన్నారు. క‌డ‌ప అసెంబ్లీ అంటే మైనార్టీల సొంత‌మ‌న్న భావ‌న వుంది. క‌డ‌ప‌లో కాంగ్రెస్ త‌ర‌పున శివానంద‌రెడ్డి త‌ర్వాత‌, ముస్లింలే ఎమ్మెల్యేలుగా ఎన్నిక‌వుతూ వ‌స్తున్నారు. ముస్లింల‌కు వైఎస్సార్ నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించ‌డంతో కాంగ్రెస్‌, ఆ త‌ర్వాత వైసీపీకి వారంతా అండ‌గా నిలుస్తున్నారు.

2014 నుంచి వైసీపీ త‌ర‌పున అంజాద్‌బాషా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. 2019లో కూడా ఆయ‌నే గెలుపొందారు. జ‌గ‌న్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా ప‌ద‌వి ద‌క్కించ‌కున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని క‌డ‌ప‌లో గ‌త ఐదేళ్ల‌లో అంజాద్‌బాషా త‌మ్ముడు, ఇత‌ర బంధువులు ఇష్టారీతిలో వ్య‌వ‌హ‌రించార‌నే చెడ్డ‌పేరు తెచ్చుకున్నారు. మ‌రీ ముఖ్యంగా కేవ‌లం త‌మ సామాజిక వ‌ర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నార‌ని, ఇత‌రుల‌ను ఆద‌రించ‌ర‌నే చెడ్డ‌పేరు కూడా వుంది.

దీంతో ఐదేళ్ల క్రితం వైసీపీపై క‌డ‌ప‌లో ఉన్న ఆద‌ర‌ణ ఇప్పుడు లేదు. క‌డ‌ప‌లో వైసీపీ గ్రాఫ్ కొంత వ‌ర‌కు త‌గ్గింది. ఇదే సంద‌ర్భంలో టీడీపీ అభ్య‌ర్థి మాధ‌వీరెడ్డి దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. క‌డ‌ప‌లో డివిజ‌న్ల వారీగా పెద్ద మొత్తంలో డ‌బ్బు ఖ‌ర్చు పెడుతూ వైసీపీ శ్రేణుల్ని త‌న వైపు ఆమె తిప్పుకుంటున్నారు. కానీ అంజాద్ బాషా మాత్రం జేబులో నుంచి ప‌ది రూపాయ‌లు తీసేందుకు స‌సేమిరా అంటున్న‌ట్టు తెలిసింది.

దీంతో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిక‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. మాధ‌వీరెడ్డి నామినేష‌న్ సంద‌ర్భంగా పెద్ద సంఖ్య‌లో టీడీపీ శ్రేణులు క‌నిపించాయి. ఇదే సంద‌ర్భంలో అంజాద్‌బాషా నామినేష‌న్‌కు చెప్పుకోద‌గ్గ స్థాయిలో వైసీపీ శ్రేణులు హాజ‌రు కాలేదు. ఎందుకంటే, నామినేష‌న్‌కు ఖ‌ర్చుల‌న్నీ డివిజ‌న్ నాయ‌కులే పెట్టుకోవాల‌ని చెప్ప‌డంతో, మ‌న‌కెందుకే అని మిన్న‌కుండి పోయార‌ని స‌మాచారం. గ‌త ఐదేళ్ల‌లో దోచుకున్న సొమ్మంతా ఏం చేశార‌ని అంజాద్‌బాషాను సొంత పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌శ్నిస్తున్నారు.

Readmore!

ప్ర‌త్య‌ర్థి దూకుడు చూసైనా, అంజాద్ బాషా జాగ్ర‌త్త‌ప‌డ‌క‌పోతే ఎలా అని నిల‌దీస్తున్నారు. కానీ అంజాద్ బాషా మాత్రం ...జ‌గ‌న్‌ను చూసి, అలాగే సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు , ముస్లిం మైనార్టీలు మ‌న‌కు కాక‌పోతే, మ‌రెవ‌రికి ఓట్లు వేస్తార‌ని అంటున్న‌ట్టు తెలిసింది. దీంతో క‌డ‌ప‌లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు మెజార్టీ భారీగా త‌గ్గొచ్చ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

Show comments