షర్మిలకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ నేత

విశాఖ పర్యటనకు వచ్చిన కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలకు విశాఖ గుమ్మంలోనే భారీ షాక్ తగిలింది. విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చాలా కాలం నుంచి పనిచేస్తూ వస్తున్న గొంప గోవిందరాజు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.

ఆయన రాజీనామా విషయం పక్కన పెడితే ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలే సంచలనంగా మారాయి. కాంగ్రెస్ టికెట్లను ఎవరిని ఇచ్చారు అని ఆయన ప్రశ్నించారు. అసలు పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని వారికి ఇచ్చారని ఇలాగైతే ఎలా అని షర్మిల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్న వారిని పక్కన పెట్టేశారని ఫైర్ అయ్యారు. చెక్కులు ఇచ్చిన వారికే పార్టీ టికెట్లు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఇదంతా బ్రోకర్ల ద్వారా జరిగిందని అలా డబ్బులు తీసుకునే టికెట్లను కేటాయించారని ఆయన చేసిన ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి.

విశాఖలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన షర్మిలకు ఇది ఊహించని ఉపద్రవంగా చెబుతున్నారు. గొంప గోవిందరాజు పార్టీని అట్టేపెట్టుకుని ఉన్నారు. విశాఖ లాంటి చోట కాంగ్రెస్ జెండా ఉనికిని కాపాడుతున్నారు. పెద్ద సిటీలోనే ఇలా ఒక నాయకుడు పీసీసీ మీద ఆరోపణలు చేయడం చెక్కులు ఇచ్చి టికెట్లు తీసుకున్నారు అని మండిపడడం నిజంగా తలకాయ నొప్పిగానే ఉన్న వ్యవ్వహారం అంటున్నారు. 

తాను భవిష్యత్తులో ఏ పార్టీలో చేరేది నిర్ణయించుకుంటాను అని చెప్పేశారు ఆయన. ఈ తరహా ఆరోపణలు ఇటీవల కాలంలో అనేక చోట్ల నుంచి రావడంతో కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలోనూ పారదర్శకత లేదా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

Show comments