వైసీపీ ఎమ్మెల్యేలో మంత్రి ఆశలు

ఈసారి గెలిస్తే తప్పనిసరిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్యాబినెట్ లో మంత్రి పదవి వస్తుందని ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన ఒక వైసీపీ ఎమ్మెల్యే పెద్ద ఆశలే పెట్టుకున్నారు అని అంటున్నారు. ఆయన అనుచరులు ఆ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు.

ఇంతకీ ఆయన ఎవరు అంటే నర్శీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే 2024 ఎమ్మెల్యే అభ్యర్ధి పెట్ల ఉమా శంకర్ గణేష్. ఆయన 2019లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుని ఓడించారు. అది పాతిక వేల ఓట్ల తేడాతో జరిగింది.

ఈసారి మరో అయిదు వేలు పెంచేశారు. అయ్యన్నను ముప్పై వేల ఓట్ల తేడాతో ఓడిస్తాను అని పెట్ల శపధం చేస్తున్నారు. అయ్యన్నకు వ్యతిరేకంగా ఉన్న వారిని అందరినీ తెచ్చి కలిపేసుకుంటున్నారు. గతంలో టీడీపీలో అయ్యన్న కూటమిలో కనిపించిన వారిని వైసీపీ వైపు లాగేశారు. ఆయన ప్రచారం జోరు మీద చేస్తున్నారు. ఇప్పుడు మంత్రి పదవి కన్ ఫర్మ్ అన్న వార్త వైసీపీ శ్రేణులలో కొత్త ఉత్సాహం ఇస్తోంది. ఇది కావాలని చేశారా లేక ఊహాగానాలే నిజం అవుతాయా అన్నది ఎవరికీ తెలియదు.

అయితే నర్శీపట్నంలో చూస్తే అయ్యన్న దశాబ్దాల పాటు మంత్రిగా ఉన్నారు. ఆయన ముందు ఎవరు చేసినారో లేదో తెలియదు కానీ అయ్యన్న తరువాత మాత్రం వేరే వారికి ఆ పదవి దక్కలేదు. ఇప్పుడు పెట్ల కనుక రెండవ మారు భారీ మెజారిటీతో గెలిచి అయ్యన్నను ఓడిస్తే తప్పకుండా జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కుతుందన్న ప్రచారానికి ప్రాతిపదిక అయితే ఉంది అని అంటున్నారు.

అయ్యన్న బలమైన వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన ఐకాన్ గా వెలిగారు. ఇప్పుడు ఆయన సీనియర్ అయిపోయారు. జిల్లా రాజకీయాల్లో పెట్ల కనుక కుదురుకుంటే తప్పనిసరిగా మంత్రి పదవితో ఆ ప్లేస్ లోకి వెళ్తారు అని ఆయన అనుచరులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Show comments