పథకాల ప్రభావం లేకపోతే…!

ఆంధ్రలో యాంటీ జగన్ లేదా పాజిటివ్ కూటమి వేవ్ అన్ని వైపుల నుంచి కమ్ముకు వచ్చేసిందని బలంగా నమ్ముతున్నారు తెలుగుదేశం, జనసేన జనాలు. దానికి తగినట్లే వుంది తెలుగుదేశం అభిమాన సామాజిక బంధాలు పెనవేసుకున్న ప్రింట్, వెబ్, సోషల్ మీడియా అందిస్తున్న వార్తలు, పోస్ట్ లు కూడా. వైకాపా జస్ట్ 20 సీట్లకు పరిమితం అయిపోతుందనే సర్వే కార్డులు కూడా ఫొటో షాప్‌లో అందంగా తయారుచేసి అందించేస్తున్నారు. ఇదంతా న్యూట్రన్ ఓటర్ ను ఎలాగోలా ఇటు లాగేయడం కోసం కావచ్చు. సరే, కాస్సేపు అదే నిజం అనుకుందాం. మరి వైకాపా వైపు ఓటింగ్ అన్నదే లేదా?

ఇన్ని లక్షల ఇళ్లకు, ఇలా నేరుగా డబ్బులు అక్కౌంట్ లో వేసినా, ఇన్ని లక్షల మందికి ఇళ్ల స్ధలాలు పంచినా, వైకాపాకు ఓట్లు పడకపోతే… అది ఒక విధమైన ఆలోచనలకు దారితీసే అవకాశం వుంది. ఇక్కడ కాస్త వెనక్కు వెళ్తే 2019 ఎన్నికల టైమ్ లో అర్జంట్ గా వివిధ కార్పొరేషన్ల చేత అప్పులకు దరఖాస్తు చేయించి, ఆ డబ్బును పసుపు కుంకుమ అనే పథక పేరుతో నేరుగా ప్రజల అక్కౌంట్లలోకి పంపారు చంద్రబాబు. వివిధ పట్టణ కార్పొరేషన్ల చేత అప్పులు చేయించిన సంగతిని ఎల్లో మీడియా చెప్పమన్నా చెప్పదు. అది అప్పుల కిందే రాదు దాని దృష్టికి. జగన్ చేస్తేనే అప్పు. చంద్రబాబు చేస్తే అది లోక కళ్యాణం. సరే, ఆ సంగతి కూడా పక్కన పెడదాం కాస్సేపు.

చంద్రబాబు పదివేల వంతున అక్కౌంట్లో వేసినా 23 సీట్లకు పరిమితం చేసారు ఓటర్లు అప్పటి ఎన్నికల్లో. ఇప్పుడు జగన్ ను 20 సీట్ల లోపుకే పరిమితం చేస్తారని నానా ప్రచారం సాగిస్తున్నారు. అదే నిజమైతే, ఇక చంద్రబాబు అధికారంలోకి వస్తే, జనాలకు పథకాలు ఇవ్వడం అనవసరం. ఇచ్చినా, ఇవ్వకున్నా జనం కేవలం మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్రచారం మేరకే ఓటు వేయడం అనే విషయంలో డిసైడ్ అవుతారని క్లారిటీ వచ్చినపుడు నానా బాధ పడి అప్పులు చేసి, అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు అనే మాట పడుతూ డబ్బులు ఇవ్వడం ఎందుకు?

చంద్రబాబు అండ్ కో పదే పదే చెబుతున్న అభివృద్ది అనే దాని మీదే దృష్టి పెట్టవచ్చు. అలాగే ఉద్యోగులకు ఇబ్బడి ముబ్బడిగా జీతాలు, డిఎలు ఇస్తూ, అవసరం అయితే ఇంకా పెంచుకుంటూ పోతే శభాష్ అనేస్తారు కదా. అది బెటర్ కదా.

ఇప్పుడు రాష్ట్రం ఎలాగూ డబ్బుల బాధలో వుంది. తెలంగాణలో చూడండి. కేసీఆర్ తరువాత అధికారంలోకి వచ్చిన రేవంత్, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు. అప్పుడే జనం రివర్స్ అవుతున్నారు. అందుకే ప్రతి దేవుడి మీద ఒట్టు వేసి చెబుతున్నారు. హామీలు నిలబెట్టుకుంటా అని. కానీ అసలు ఆలోచిస్తే ఇలా చేయక్కరలేదు. స్కీములు ఇవ్వకపోతే ప్రజలు ఏం చేస్తారు. వాళ్లు నమ్మేది కేవలం మీడియా, డిజిటల్, సోషల్ మీడియా ప్రచారాలే కదా. వాటి మీద దృష్టి పెడితే చాలు.

అందువల్ల చంద్రబాబు కనుక అధికారంలోకి వస్తే, జగన్ మాదిరిగా చేయద్దు. పథకాలు పక్కన పెట్టి, ఉద్యోగుల సంగతి ముందు చూడండి. వాళ్లకు ఏం అన్యాయం జరిగిపోయింది అంటున్నారో, అవన్నీ సరి చేసేయండి. తలా పదివేలు జీతాలు పెంచేయండి. ఆ తరువాత అభివృద్ది మీద దృష్టి పెట్టండి. పనిలో పనిగా తెలుగుదేశం కోసం అన్ని విధాలా పని చేసిన ప్రింట్, డిజిటల్, వెబ్, సోషల్ మీడియాకు అన్ని విధాలా చేయూత ఇవ్వండి.

మరోసారి అధికారం ఎందుకు రాదో చూద్దాం. ఎందుకంటే జనాలు లొంగేది పథకాలకు కాదు, ప్రచారానికి అని క్లారిటీ వస్తుంది కదా. అలా వచ్చిన తరువాత కూడా లక్షల కోట్లు అప్పులు చేసి ఇవ్వడం ఎందుకు?

అయినా మనం చెప్పాలా? ఆ మాత్రం ఐడియా బాబుగారికీ వుంటుంది. ఆయనకు తను ఏం చేసినా, రావాల్సిందే బయటకు వస్తుంది. రాకూడనిది తమ మీడియా రానివ్వదు అనే ధైర్యం వుందిగా. అందువల్ల జగన్ చెప్పిందే నిజమవుతుందేమో? ఎందుకంటే సంక్షేమం.. అభివృద్ది.. సంపద సృష్టి లాంటివి అన్నీ గాలి మాటలు అని తెలిసిందే. అవ్వా కావాలి..బువ్వా కావాలి అంటే జరిగేది కాదు కదా.

Show comments