బాబుకే డెడ్ లైన్ పెట్టిన తమ్ముడు!

తనకు మొదట టికెట్ ఇచ్చి నెల రోజుల తరువాత ఉత్త చేతులు చూపించడం పట్ల రగిలిపోతున్న మాడుగుల టీడీపీ నాయకుడు పైలా ప్రసాదరావు రెబెల్ గా పోటీకి తయారుగా ఉన్నారు. తనకు ఈ నెల 27వ తేదీలోగా మాడుగుల సీటు కేటాయించకపోతే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తాను అని హెచ్చరించారు.

ఇప్పటికే నామినేషన్ వేసిన పైలా ప్రసాద్ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆయన నెల రోజుల బట్టి జనంలో ఉన్నారు. ఆయన పోటీ చేస్తే టీడీపీ ఓట్లు భారీ ఎత్తున చీలడం ఖాయం. పెందుర్తి సీటు ఆశించి భంగపడిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి సర్దిచెప్పే ప్రయత్నంలో భాగంగా ఆయనకు మాడుగుల దారి చూపించారు.

ఇపుడు పైలా ప్రసాదరావు హై కమాండ్ కే డెడ్ లైన్ పెట్టారు. తనకు టికెట్ రాకుండా ఇద్దరు నాయకులు చేశారు అని ఆయన మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు, టీడీపీ ఇంచార్జ్ పీవీజీ కుమార్ ల వల్లనే ఇలా జరిగింది అని అన్నారు.

తనను నాన్ లోకల్ అని ప్రచారం చేశారు . ఇప్పుడు బండారు వంటి నాన్ లోకల్ ని తీసుకుని వచ్చి పోటీ చేయించడం బాగుందా అని నిలదీశారు. తాను గత అయిదేళ్లుగా నియోజకవర్గం ప్రజలతో మమేకం అవుతూ వస్తున్నానని తనకు పార్టీ క్యాడర్ మద్దతు నిండుగా ఉందని పైలా చెబుతున్నారు.

చంద్రబాబుకు పైలా ఇప్పుడు డెడ్ లైన్ పెట్టేశారు. టికెట్ ఆయనకు కేటాయించడం కుదరని పని. దాంతో పైలా పోటీ చేయడం ఖాయంగా ఉంది. ఈ పరిణామాలు అన్నీ నిశితంగా పరిశీలిస్తున్న వైసీపీ తమకు ఇది అనుకూలించే అంశంగానే చూస్తోంది. మరో వైపు పైలా వైసీపీ వైపు వెళ్తారు అన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

Show comments