రాజుగారికి కూతురు బెంగ!

ఒకనాడు విజయనగరం జిల్లా అంతటా చక్రం తిప్పిన నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజుకు తాజా ఎన్నికలలో కూతురు బెంగ ఎక్కువైపోయింది అని అంటున్నారు. 

తన రాజకీయ వారసురాలిగా మూడవతరంలో పూసపాటి వారి ఇంటి నుంచి చట్టసభలకు వెళ్లే నేతగా అదితి గజపతిరాజును చూసుకోవాలని అశోక్‌ ముచ్చటపడుతున్నారు. అది 2019లోనే జరగాలని కలలు కన్నా నాడు జగన్‌ ప్రభంజనం అడ్డుకట్ట వేసింది. ఏకంగా అశోక్‌ గజపతిరాజేనే జగన్‌ వేవ్‌ ఓడిచేసింది. ఇక కుమార్తె సైతం పరాజయం పాలు అయ్యారు. 

ఇక 2024లో చూస్తే తన కూతురును కచ్చితంగా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని అశోక్‌ గట్టి పట్టుదల మీద ఉన్నారు. అది ఎంత స్ధాయిలో ఉందంటే తనకు ఎంపీ సీటు కూడా వద్దని చెప్పి మరీ కూతురుకు టిక్కెట్‌ సాధించారు. 

సరే టిక్కెట్‌ దక్కింది గెలుపు అన్నది జనం చేతులలో ఉంది. అక్కడే ఇపుడు రాజావారు చేయాల్సిన కసరత్తులు అన్నీ చేస్తున్నారు. కానీ సొంత పార్టీలోనే చిచ్చు రాజుకుంది. 

మాజీ ఎమ్మెల్యే మీసాల గీత ఇండిపెండెంట్‌గా పోటీ చేయబోతున్నారని టాక్‌. ఆమె కనుక బరిలో ఉంటే కచ్చితంగా అదితి గజపతిరాజుకు ఓటమి ఖాయం అని అంటున్నారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో డెబ్బయి వేల దాకా తూర్పు కాపులు ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి చెందిన గీత పూసపాటివారి కోటకు వ్యతిరేకంగా రాజకీయాన్ని గత కొన్నేళ్లుగా నడుపుతున్నారు. దాంతో ఆమె పోటీ చేస్తే వైసీపీ నెత్తిన పాలు పోసినట్లే అన్నది రాజకీయ అంచనాగా ఉంది. 

ఇప్పటికే వైసీపీ విజయనగరంలో బలంగా ఉంది. అభ్యర్ధి కోలగట్ల వీరభద్రస్వామి మరోసారి తన విజయం తధ్యమని అంటున్నారు. దీంతో అశోక్‌కు అసలైన సవాల్‌ కూతురును గెలిపించుకోవడమే అని అంటున్నారు.

Show comments