ఉత్తరాంధ్రకు ఓట్ల కోసం రావద్దు!

ఉత్తరాంధ్రకు ఏ మేలు టీడీపీ హయాంలో చేయలేదని వైసీపీ అంటోంది. ఉత్తరాంధ్రకు ఓట్ల కోసం రాబోకు చంద్రబాబూ అని పిలుపు ఇస్తోంది. ముమ్మారు సీఎం అయినా నికరంగా ఉత్తరాంధ్ర కు చంద్రబాబు ఏదీ చేసింది లేదని ఎత్తి చూపుతోంది.

ఎన్నికలు వస్తే ఉత్తరాంధ్ర ఓట్లు కావాలి కానీ ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఎందుకు లేదు బాబూ అని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి నిలదీశారు. జగన్ అయిదేళ్ల సీఎం మాత్రమే. కానీ ఆయన ఉత్తరాంధ్ర కు చేసిన అభివృద్ధి ఏమిటో మేము చెబుతామని ఆమె అన్నారు. అదే టీడీపీ ఏమి చేసిందో చెప్పగలరా అని సవాల్ చేశారు.

శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి మొదలుపెడితే ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావు పేట వరకు అడుగడుగునా అభివృద్ధి ఈ రోజు కనిపిస్తోందని అన్నారు పెద్ద ఎత్తున రూ.740 కోట్లతో వంశధార నీటిని తీసుకొచ్చి ఉద్దానం కిడ్నీవ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతోందని ఆమె గుర్తు చేశారు.

అలాగే, రూ.200 కోట్లతో 200 పడకల కిడ్నీ వ్యాధుల ఆస్పత్రితో పాటు రీసెర్చి సెంటర్‌ను కూడా అక్కడ నెలకొల్పారని అన్నారు  శ్రీకాకుళంలో మూలపేట పోర్టు, భోగాపురంలో అంతర్జాతీయ ఏయిర్‌పోర్టు, ఉత్తరాంధ్రలో 4 మెడికల్‌ కాలేజీలు, కురుపాంలో ఇంజినీరింగ్‌ కాలేజీ, విశాఖలో ఇన్‌ఆర్బిట్‌మాల్, ఇన్ఫోసిస్, అదానీ డేటాసెంటర్, రూ.6వేల కోట్లతో 6 లైన్ల హైవే ఏర్పాటు, ఎన్నో టూరిజం ప్రాజెక్టులు ఇలా అడుగడుగునా అభివృద్ధి చూపించిన ముఖ్యమంత్రి జగన్ అని ఆమె పెద్ద లిస్టుని ముందుంచారు.

ఈ విధంగా అతి తక్కువ సమయంలోనే ఉత్తరాంధ్రకు ఎంతో మేలు చేసిన ఘనత ముఖ్యమంత్రిగా  జగన్ దే అని ఆమె స్పష్టం చేసారు. అందువల్ల ఉత్తరాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టే హక్కు గానీ అక్కడి ప్రజలను ఓట్లు అడిగే హక్కు గానీ ఒక్క జగన్ కే ఉందని ఆమె అన్నారు. కానీ ఉత్తరాంధ్రలో ఓట్ల కోసం ఎన్నికల సభలు పెడుతున్న బాబు తాను ఏమి చేశానో చెప్పుకోగలరా అని ఆమె ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు ఓట్ల కోసం రావద్దు అని ఆమె టీడీపీ అధినాయకత్వానికి స్పష్టంగానే చెప్పేశారు. 

Show comments