యాంటీ ఓటరు మీద దృష్టి పెట్టాల్సిందే

వై నాట్ 175 నుంచి టఫ్ ఫైట్ లేదా ఎడ్జ్ అనే పరిస్థితికి వచ్చింది వైకాపా వ్యవహారం. వైకాపా ఇప్పుడు కేవలం పథకాలు అందుకున్న మహిళలు ఓట్ల మీద పూర్తిగా ఆధారపడిపోయింది. జగన్ కూడా తన ప్రసంగాల్లో అదే చెబుతున్నారు. మీకు ఏదైనా మేలు చేసాను అనుకుంటే, నాకు ఓటు వేయండి అంటున్నారు తప్ప మరో మాట మాట్లాడడం లేదు. మహా అయితే చంద్రబాబును ఓ మాట, పవన్ మీద రెండు మాటలు పడేస్తున్నారు.

అంతే తప్ప ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడం లేదు. అభివృద్ది లేదు. రాజధాని లేదు. ఉపాధి కల్పన లేదు అనే మాటలను బలంగా తిప్పి కొట్టడం లేదు. అసెంబ్లీలో జగన్ స్పీచ్ లు మామూలుగా వుండవు. అంకెలు, రుజువులు, సాక్ష్యాలతో ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడతారు. కానీ ఎన్నికల ప్రసంగాల్లో మాత్రం ఎందుకో ఆ పది చేయడం లేదు.

వైకాపా అనుకూల ఓటరును ఉద్దేశించి, మీకు మంచి జరిగితేనే అని అడగడం వరకు ఓకె. కానీ రాష్ట్రానికి కూడా మంచి జరగాలి అనే పాయింట్ లాగే వాళ్లకు కూడా జగన్ ఏదో ఒక సమాధానం చెప్పాల్సి వుంది. అలా చెప్పడం వల్ల యాంటీ ఓటరు మారిపోతాడు అని గ్యారంటీ లేదు కానీ న్యూట్రల్ ఓటర్లు కాస్తయినా అనుకూలంగా నిలబడే అవకాశం వుంది.

సంక్షేమం అన్నది జగన్ బలం అని విపక్షాలకు తెలుసు. అందుకే ఆ యాంగిల్ టచ్ చేయడం లేదు. పైగా తాము కూడా సంక్షేమం వదలమని, అమలు చేస్తామని అంటున్నాయి. జగన్ రాష్ట్ర అభివృద్దిని విస్మరిస్తన్నారని విపక్షాలు యాగీ చేస్తన్నాయి. తాము చేస్తామంటున్నాయి. కానీ ఇప్పుడు జగన్ చెప్పాల్సింది విపక్షాలను ఏ మేరకు నమ్మవచ్చు అని. సంక్షేమం తాము వదలమని అంటున్న విపక్షాలు గతంలో ఏం చేసాయి అన్నది జగన్ వివరించాల్సి వుంది.

అభివృద్ధి అంటే తాను చేసిన స్కూళ్లు, పోర్టులు, ఆసుపత్రుల గురించి వివరించి, తరువాత తానేం చేయబోతున్నానో చెప్పాల్సి వుంది. అలాగే చిరకాలంగా పెండింగ్ లో వున్న కొత్త జిల్లాల సంగతి వివరించాల్సి వుంది.

కానీ ఇవేమీ జగన్ కానీ, వైకాపా పార్టీ అభ్యర్ధులు కానీ పట్టించుకోవడం లేదు. ఎంత సేపూ మీకు అవి ఇచ్చాం..ఇవి ఇచ్చాం. మరి ఇవి అందని మధ్య తరగతి, ఎగువ తరగతి వారి సంగతి ఏమిటి? వారి ఓట్ల కోసం చెప్పాల్సిన సంగతులేమిటి? వాటి మీద దృష్టి పెట్టాల్సిందే. లేదంటే యాంటీ ఓటు అలాగే వుండిపోతుంది. న్యూట్రల్ ఓటు యాంటీ ఓటుగా మారే ప్రమాదం వుంది.

Show comments