చంద్రబాబు తనచుట్టూ తవ్వుకున్న గొయ్యి

ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు అని అంటుంటారు. కొందరు పక్కవాళ్ల కోసం గొయ్యి తవ్వుతున్నామనుకుంటారు కానీ తమకి తెలియకుండా తామే ఆ గోతిలో పడతామని అనుకోరు. అలాంటి వాళ్లని అమాయకులనే అంటారు. కానీ ఒక్క ఎల్లో మీడియా మాత్రమే అలాంటి వ్యక్తిని అపర చాణక్యుడు, మేథావి అని కొనియాడుతుంది. 

ఇంత చెప్పాక ఈ మేటర్ ఎవరి గురించో మీకు అర్ధమయ్యే ఉంటుంది.. అవును, చంద్రబాబు...! 

ఎన్.టి.ఆర్ ని వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్న దగ్గర్నుంచీ తనకి ఒక్కటే భయం. తన నుంచి ఆ పార్టీని ఎవరు లాక్కుపోతారో అని. ఎన్.టి.ఆర్ కొడుకుల్లో ఆ తెలివున్నవాళ్లు ఎవ్వరూ లేరని తన ధీమా. కానీ ఒకసారి హరికృష్ణ కాస్త కదలిక చూపిస్తే బాబు అప్రమత్తమైపోయాడు. తర్వాత హరికృష్ణని దువ్వుకుని పక్కకు తీసుకున్నాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి జంట తనకు పోటీ కాకుండా వాళ్లని పక్కనపెట్టాడు. ఇదంతా తన హయాములో. 

ఇప్పుడు తరం మారింది. తాను వృద్ధుడైపోయాడు. తెదేపా వారసుడిగా తన కొడుకుని చూడాలన్నదొక్కటే తన కోరిక. తన కొడుక్కి చెక్ పెట్టే సత్తా ఉన్న ఎవర్నీ దగ్గరికి రానీయడు. అందుకే జూనియర్ ఎన్.టి.ఆర్ ని కూడా వాడుకుని వదిలేయడం తప్ప పార్టీలో స్థానం కలిపించలేదు. ఇస్తే తన కొడుకుని మింగేస్తాడని భయం. 

ఆ మాటకొస్తే లోకేష్ ట్యాలెంట్ కి బిలో ఆవరేజ్ యువనాయకుడైనా చెక్ పెట్టే ప్రమాదముంది. అందుకే అసలు పార్టీలో యువకులే లేకుండా చూసుకుని జాగ్రత్త పడ్డాడు చంద్రబాబు.  ఉన్నంతలో ఒకే ఒక్కడు ఎర్రన్నాయుడు కొడుకు రాం మోహన్ నాయుడు. మంచి వక్త, భాషల్లో దిట్ట.. కానీ పార్టీలో ఎక్కడా కనపడనీయడు. సెకండ్ హీరో పాత్ర కూడా ఇవ్వకుండా కేవలం కేరక్టర్ ఆర్టిస్ట్ రోల్ ఇచ్చి అతనిని అడపాదడపా అవసరానికి పిలిచి వాడుకుంటూ ఉంటాడంతే చంద్రబాబు. 

ఇలా యువ నాయకత్వాన్ని పార్టీలో కనపడనీయకుండా చేసి అదేదో తన కొడుకు సింహాసనానికి అడ్డు లేకుండా చేసినట్టు చంద్రబాబు భ్రమలో ఉండొచ్చు. కానీ నిజానికి అది తాను తన పార్టీకి, కొడుకు రాజకీయ భవిష్యత్తుకి తీసిన అతి పెద్ద గొయ్యి. 

అదలా ఉంచితే పోనీ సీనియర్ నాయకులకైనా నాయకత్వ బాధ్యతలు ఏవైనా అప్పజెప్తాడా అంటే అదీ లేదు. 

సభల ప్లానింగ్ నుంచి, అభ్యర్థుల ఎంపిక వరకు అన్నీ తండ్రీకొడుకులిద్దరే!!!

దీంతో ప్రతిభ ఉన్న సీనియర్లకు పని లేక, సొంతంగా బుర్ర వాడే అవసరం లేక, పిలిచినప్పుడు వచ్చి అక్షంతలు వేసే పెళ్లి వేడుకకొచ్చిన అతిథుల్లా ఉన్నారు తెదేపాలో అధికశాతం మంది నాయకులు.

దీనివల్ల పార్టీలో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తెదేపాకి ఓటేయాలంటే చంద్రబాబు వృద్ధాప్యం, లోకేష్ అసమర్ధత తప్ప మరొక నాయకత్వం, ధీమా కనిపించట్లేదు న్యూట్రల్ ఓటర్స్ కి. 

చంద్రబాబు తన భయానుసారం పొత్తులు పెట్టుకోవడం, లోకేష్ తన ఇష్టానుసారం అభ్యర్థులని సెలెక్ట్ చేయడం.. సీనియర్ లీడర్లకు, లోకేష్ కు మధ్య సయోధ్య లేకపోవడం, క్షేత్ర స్థాయి నాయకులకి, కేడర్ కి ప్రాధాన్యత ఇవ్వకపోవడం.. ఇలా అనేకమైన కారణాల వల్ల తెదేపా రెక్కలు విరిగిన పక్షిలా ఉంది. 

ఇక ఈ పార్టీ కూటమి కట్టిన జనసేన ఏమైనా బాగుందా అంటే. అక్కడా ఇద్దరే... పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్! వాళ్ల లెక్కలేంటో వాళ్లకి తప్ప జనసైనికులకి కూడా తెలీదు. 

175 లో 21 చోట్ల నిలబడుతున్న ఈ జనసేన పార్టీకి చెందిన జనసైనికులు ఎప్పుడో నీరుగారిపోయి కూర్చున్నారు. తమ నాయకుడినన్నా అసెంబ్లీలో చూడగలమా అనే ఏకైక కోరిక తప్ప అతనిని సీఎంగా చూసుకునే కలని ఎప్పుడో వదిలేసుకున్నారు. ఎందుకంటే ఆ కోరిక అతనిలోనే లేదని తేలింది కనుక!!! సరే..జనసైనికుల దీనకథ అటుంచితే.. ప్రస్తుత పరిస్థితి "యథా తెదేపా తథా జనసేన" అన్నట్టుంది. 

కానీ వైకాపాలో మాత్రం కనిపించడానికి జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే కనిపిస్తున్నా.. వెనుక శక్తి, యుక్తి ధారపోస్తున్న ఒక మహాసైన్యమే ఉంది.

ఎవరి ఐడియాలో కానీ "సిద్ధం" సభలు, బస్ యాత్రలు అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. 

ఈ విషయంలో మొత్తం ఐ-పాక్ కే క్రెడిట్ ఇవ్వక్కర్లేదు. ఐ-పాక్ నుంచి, సలహాదారుల నుంచి, కేడర్ నుంచి, స్థానిక నాయకుల నుంచి, లోకల్ ఇన్-చార్జుల నుంచి, ఆఖరికి విలేజ్ వాలంటీర్ల నుంచి కూడా సమాచారాన్ని సేకరించి జగన్ మోహన్ రెడ్డి ఫైనల్ నిర్ణయం తీసుకుంటున్నాడు. అది సభల నిర్వహణ కావొచ్చు, అభ్యర్థుల ఎంపిక కావొచ్చు...! 

తెదేపాకి గ్రౌండ్ వర్క్ చేసి ఇచ్చే నమ్మకస్తులు లేరు. కారణం.. అటువంటి నమ్మకస్తుల్ని ఎంకరేజ్ చేయకపోవడమే.. ఒక గీత గీసి.. ఆ గీత అవతల నిలబెట్టడమే. 

అదీ జగన్ కి, చంద్రబాబుకి తేడా! 

చంద్రబాబు కేవలం మీడియాని మాత్రమే నమ్ముకుని బతికేస్తున్నాడు ఇన్నేళ్ళుగా. తనకి ప్రజల మీద, కేడర్ మీద, నాయకుల మీద, కార్యకర్తల మీదా ఎప్పుడూ నమ్మకముండదు. 

తనకి స్టార్ క్యాంపైనర్లు కేవలం ఆ రెండు పత్రికలు, ఆ నాలుగు ఛానల్సే. తాను కానిది ప్రజలకి చూపించి, వాళ్లని నమ్మించి తనను గతంలో సీఎంని చేసిన ఘనత ఆ పత్రికలది మాత్రమే అని చంద్రబాబు నమ్మకం. అందుకే వాటిని నమ్మినట్టు దేనినీ నమ్మడు. వాటి గోబెల్స్ ప్రచారమే తన ఆయుధం. ఒక అబద్ధాన్ని గట్టిగా మీడియా ద్వారా చెబితే జనం నమ్మక చస్తారా అనే బలమైన నమ్మకం బాబుది. 

జగన్ మోహన్ రెడ్డి లెక్క మాత్రం అది కాదు. అతను రాజకీయాన్ని చాలా జాగ్రత్తగా చేస్తున్నాడు. ఒక ఓటు రావాలంటే ఏం చెయ్యాలి? అనే ప్రశ్నకి సమాధానాన్ని 360 డిగ్రీస్ లో ఆలోచించి క్షేత్రస్థాయి నుంచి పని చేసుకుంటూ వస్తున్నాడు. 

జనం హృదయాల్ని తట్టిన వాడే నాయకుడు. జనంతో పూర్తిగా మామేకమైపోయినవాడే జననేత. అందుకే 2004లో ప్రభంజనంలా గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కిన వై.ఎస్.ఆర్ రెండో సారి 2009లో కూడా మళ్లీ గెలిచి పీఠాన్ని ఎక్కడం జరిగింది. అది ప్రజల నిర్ణయం. మీడియాని కాకుండా జనాన్ని నమ్ముకున్న నాయకులు అలాగే గెలుస్తారు. ఆ లెక్కలో ఈ సారి జగన్ మోహన్ రెడ్డి కూడా పీఠంపై కొనసాగడం గ్యారెంటీ అంటున్నాయి పలు సర్వేలు. 

అయినప్పటికీ ఎన్నికలయ్యి ఫలితాలొచ్చేదాకా ఏదీ కంక్లూడ్ చెయ్యలేం. వేచి చూద్దాం. ఫలితం చూద్దాం. 

- శ్రీనివాసమూర్తి

Show comments