జగన్ అనే బూచిని చూపించి…!

ఏ ఎన్నికల్లోను లేని చిత్రమైన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. పార్టీల కలయిక అంటే అంత సలువు కాదు. పైన నేతలు కలిసినా మిడ్ రేంజ్ నాయకులు కలవరు. ఒక వేళ కలిసినా ఒకరికి ఒకరు సహకరించుకోరు. పైగా తనకు టికెట్ చేజారితే, అవతలివాడు ఎక్కడ పాతుకుపోతాడో అని ఓడించడానికి తెర వెనుక ప్రయత్నాలు అనేకం సాగిస్తారు. అందుకే ఏ అలయన్స్ అయినా ఓట్ల బదిలీ అన్నది అంత సులువు కాదు. పైగా భిన్న ధృవాలుగా వున్న నాయకులు కలిసి పని చేయడం మరీ కష్టం.

కానీ నలుగురు బద్ద శతృవులు అడవిలో చిక్కుకుంటే, తప్పని సరై ఒకరిని ఒకరు తోడు తీసుకుంటారు. ఎందుకంటే తాము ఎవరి మానాన వాళ్లు వుంటే అడవి మింగేస్తుందో, అడవి మృగమే మింగేస్తుందో అన్న భయం. ఇప్పుడు అలాంటి భయం వైకాపా మినహా మిగిలిన రాజకీయ పక్షాలు అన్నింటిలో అలుముకుంది. ఈసారి కనుక తాము గెలవకుండా, జగన్ గెలిస్తే తమ పరిస్థితి ఏమవుతుందో అన్న భయం. ఇలాంటి భయం అటు జనసేన నాయకుల్లో, ఇటు తేదేపా, భాజపా నాయకుల్లో, వామ పక్షాల్లో ఇలా అందరిలో వుంది.

ఇలాంటి భయాన్ని తెలుగుదేశం పార్టీ అందరిలో అంతర్గతంగా రగల్చడంలో సక్సెస్ అయింది. నాకోసం ఏడవకండి, నా గెలుపు కోసం పాటు పడకండి. మీ కోసం ఏడవండి. మీ గెలుపుకోసం పాటు పడండి.. ఆ పై మీ ఇష్టం అనే సందేశాన్ని చంద్రబాబు బలంగా విపక్షాల్లోకి పంపగలిగారు. అందుకే బద్ద శతృవు అయినా కొణతాల విజయం కోసం దాడి వీరభద్రరావు పని చేస్తున్నారు. తన సీటు పోతోందని తెలిసినా పవన్ కళ్యాణ్ కోసం వర్మ కష్టపడుతున్నారు.

తమలో తాము కొట్టుకుంటే మరో టెర్మ్ జగన్ వచ్చిన నెత్తిన కూర్చుంటాడు. ఇక విపక్షాలైన తెలుగుదేశం, జనసేన అంతేె సంగతులు, వాటిని నమ్ముకున్న తమ పరిస్థితి దారుణమైపోతుంది. కనీసం చంద్రబాబు ప్రభుత్వం వుంటే,, తాము నేరుగా పవర్ లో లేకున్నా కనీసం పనులన్నా చేయించుకోవచ్చు అనే భావన అలుముకుంది. ఓటు బదిలీకి ఇదే పాజిటివ్ పాయింట్ గా మారుతోంది. 

Show comments