చంద్రబాబు తరువాత తెలుగుదేశం!

ఈ రోజుతో 75వ ఏట అడుగుపెడుతున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన పుట్టిన రోజు నేడు. ఎన్టీఆర్ స్ధాపించిన తెలుగుదేశం పార్టీని 80 వ దశకంలోనే అనధికారికంగా తన చేతుల్లోకి తీసుకున్నారు. పార్టీ వ్యవహారాలను తెరవెనుక వుండి నడిపిస్తూ, తన వర్గాన్ని పెంచుకుంటూ వెళ్లారు. అడ్డం పడిన వారు, పడతారని అనుకున్నవారు అందరినీ మెల్లగా పొగపెట్టి తప్పిస్తూ వచ్చారు.

రాష్ట్ర స్థాయిలో పార్టీని నడిపించేది తను తప్ప మరెవరు లేరు, ఉండకూడదు అనే దిశగా ప్రణాళిక వేసుకుంటూ వెళ్లారు. నందమూరి కుటుంబం నుంచి ఇబ్బంది ఎదురు కాకూడదని బాలకృష్ణను వియ్యంకుడిని చేసుకున్నారు. తోడల్లుడు దగ్గుబాటిని కూడా పార్టీలో లేకుండా చూసుకున్నారు. పెద్ద అడ్డంకి అనుకున్న లక్ష్మీ పార్వతిని పెద్ద బూచిగా చూపించి, ఏకంగా పార్టీనే తన స్వంతం చేసేసుకున్నారు.

ఆ తరువాత ఇక తన కొడుకు సంగతి చూడడం ప్రారంభించారు. కొడుకుకు పోటీ అవుతారు అనుకున్న జూనియర్ ఎన్టీఆర్ మెల్లగా తనంతట తాను దూరం అయ్యేలా చేసారు. లోకేష్ తోడల్లుడును ఎంపీకి పోటీ పెట్టారు. బాలకృష్ణ ను కేవలం హిందూపురానికే పరిమితం చేసారు. ఇలా అన్ని విధాలా తెలుగుదేశం అంటే తాను, తన కొడుకు అనే విధంగా డిజైన్ చేసారు.

బాగానే వుంది. ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు. పార్టీని నిలబెట్టేందుకు శతథా ప్రయత్నిస్తున్నారు. కానీ ఏ వ్యాపారం అయినా, ఏ సంస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా భవిష్యత్ గురించి ఆలోచించాలి. వారసులను తయారు చేస్తే సరిపోదు. పునాదులను కూడా బలంగా వుండేలా చూసుకోవాలి. రామోజీ లాంటి మీడియా టైకూన్ అండ, చంద్రబాబు లాంటి చాణక్యం వున్నన్నాళ్లు తెలుగుదేశం పార్టీకి సమస్య వుండదు. కానీ ఆ తరువాత.

2029 ఎన్నిక నాటికి చంద్రబాబుకు 80 ఏళ్లు వస్తాయి. అప్పుడు కూడా ఇప్పుడున్నంత బలంగా పోరాటపటిమ వుంటుందని ఊహించడం కష్టం. అయిదేళ్ల తరువాత ఇదే విధమైన పోరాటం పార్టీ చూపించాల్సి వుంటుంది. పార్టీకి మీడియా అండ‌ అంతకు అంతా అందాల్సి వుంటుంది. ఇప్పటికే సోషల్ మీడియా వల్ల చాలా వరకు మీడియా ప్రభావం తగ్గింది. ఈ మార్పులను చూసుకుంటూ పార్టీని నడపాలి.

పైగా తెలుగుదేశంలో పాపులర్ గా వున్నది అంతా సీనియర్లే.  వారు కాక యాక్టివ్ గా వున్న వారి సగటు వయసు యాభై ఆ పైనే. వచ్చే ఎన్నిక నాటికి చాలా మంది వృద్ధ తరంగా మారిపోతారు. ఇప్పటికే అశోక్, యనమల, మురళీ మోహన్, రాఘవేంద్రరావు లాంటి తెలుగుదేశం జనాలు కుర్చీలకు, అజమాయషీకి పరిమితం అయ్యారు. మొత్తం కొత్త యువతతో లోకేష్ పార్టీని ముందుకు నడపాల్సి వుంటుంది.

చిరకాలంగా అజమాయషీకి లోబడి పని చేస్తూ వచ్చిన వృద్ధతరం సంగతి వేరు. వాళ్ల దగ్గర కాస్తయినా లాయల్టీ వుంటుంది. కానీ యువత లెక్క వేరు. ఇట్టే కంపెనీలు మారే తరం ఇది. ఇలాంటి వారిని కంట్రోలులో వుంచుకుంటూ పని చేయించడం అంటే అంత సులువు కాదు. కానీ చంద్రబాబు ఆ దిశగా చూడడం లేదు. ముందు అధికారం చేతిలోకి వచ్చేస్తే వైకాపాను, జగన్ ను అణిచేయచ్చు అనుకుంటున్నారు.

కానీ పరిస్థితులు అలాగే వుండవు. వాక్యూమ్ వుంటే ఎవరో ఒకరు పుట్టుకువస్తారు. అది వ్యాపారమైనా, మరే వ్యవస్థ అయినా. ఆ వాక్యూమ్ రాకుండా చూడాలి. పోటీ వస్తే తట్టుకునేలా చూడాలి. ఈ ఒక్కసారికి మాత్రం చంద్రబాబు కావాలని లోకేష్ ను కేవలం మంగళగిరికే పరిమితం చేసారు. ఎందుకంటే తనను యాక్సెప్ట్ చేసిన జనం లోకేష్ ను అంగీకరించరు అనే భయం. తొలిసారి దొడ్డి దోవన మంత్రిని చేసారు. ప్రజల్లోకి పంపితే తిరస్కరించారు. అందువల్ల ఇప్పుడు లోకేష్ ను ఫ్యూచర్ లీడర్ గా ప్రమోట్ చేస్తే సమస్య అవుతుందని, తెలివిగా తానే తెరముందు వుంటూ, లోకేష్ ను పార్టీ పగ్గాలు అప్పగించారు.

కానీ ఎప్పటికైనా లోకేష్ ను సీఎం సీటులో కూర్చో పెట్టాలన్నది చంద్రబాబు ఆలోచన. అదృష్టం బాగుండి ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే, తను కాస్త ఆరోగ్యంగా వున్నపుడే ఏదో ఒక వంకతో లోకేష్ కు ప్రభుత్వ పగ్గాలు అప్పగించే అవకాశం వుంది. ఇక అప్పటి నుంచి పార్టీ ఎలా ముందుకు వెళ్తుందన్నది చూడాలి.

చంద్రబాబు యాక్టివ్ గా వున్నంత వరకు దేశానికి ఢోకా లేదు. లోకేష్ కు ఎదురు వుండదు. భగవంతుడు చంద్రబాబుకు ఆ మేరకు సదా ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుందాం. హ్యాపీ బర్త్ డే చంద్రబాబు.

Show comments