జగన్ పై దాడి- అభాసుపాలౌతున్న కూటమి

చెబితే నిజమే చెప్పాలి. లేదా అబద్ధం చెప్పాల్సొస్తే అతికేటట్టు ఉండాలి. ఒకవేళ అతకని అబద్ధం చెప్పినా ఊరికే మాట మార్చేయకుండా దానికి కట్టుబడి ఉండాలి. లేకపోతే అభాసుపాలు కావడం ఖాయం. ఇప్పుడు తెదేపా- జనసేన కూటమి అభాసుపాలవుతోంది. 

కొన్ని రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డిపై రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. 

రాయి తగులుతున్నప్పటి వీడియో బైట్ బయటికొచ్చి వైరల్ అయినా కూడా పవన్ కళ్యాణ్ ఏమన్నాడో గుర్తుందా? 

జగన్ మోహన్ రెడ్డి తనకు తానే మైకుకేసి తల కొట్టేసుకుని రాయి తగిలిందని డ్రామా ఆడుతున్నాడని చెప్పాడు. 

మరొక తెదేపా వ్యక్తి .. "బంతైతే బౌన్స్ అవుతుంది కానీ రాయెందుకు బౌన్స్ అయ్యి జగన్ మీదుగా వెల్లంపల్లికి కూడా తగిలిందట? అసలది రాయే కాదు.. కావాలని ఎవరికి వారు కొట్టేసుకున్నారు" అని చెప్పాడు. 

ఇంకొకడైతే దండలు మార్చే టైములో ఆ దండలో ఉన్న పుల్లేదో గీసుకుంటే దానికి ఎవరో రాయేసారని చెబుతున్నారని అన్నాడు.

చంద్రబాబైతే జగనే సింపతీ కోసం లైట్లార్పేసి, సొంత మనిషి చేత రాయి వేయించుకున్నాడని చెప్పాడు. 

వీళ్లంతా ఇలా అంటుంటే తాజాగా అనుమానాలు బోండా ఉమ మీదకు వెళ్లడంతో అతను అప్రమత్తమయ్యి ఏదేదో మాట్లాడబోయి ఏదో మాట్లాడాడు. 

రాయి వేసిన వ్యక్తి అన్నా-క్యాంటీన్ ఎత్తేసినందుకు జగన్ పై కోపంగా ఉండి రాయేసాడని చెప్పాడు. అలా చెప్పాడంటే ఆ వ్యక్తి ఉమకి తెల్సినవాడే అనుకోవాలా? తెలియకపోతే అతను ఏ ఉద్దేశ్యంతో రాయేసాడో ఇతనికెలా తెలిసినట్టు?

మళ్లీ మాట మార్చి..రాయేసిన వ్యక్తి వైకాపా వాడేనని.. ఆ సభకి వచ్చినందుకు డబ్బు, మందు అందక కోపంతో రాయేసాడని చెప్పాడు.

ఇలా ముందొక మాట, తర్వాతొకమాట. 

కాసేపు జగనే మైకుకి కొట్టేసుకున్నాడని, కొంత సేపు దండలో ఉన్న మేకేదో గుచ్చుకుందని,  ఇంకోసారి సొంత మనిషే కొట్టాడని, మరోసారి అన్నా క్యాంటీన్ ఎత్తేసినందుకు ఎవడో కోపంతో కొట్టాడని చెప్పుకొస్తున్నారు. దీనివల్ల ఏమయ్యింది? బూం ర్యాంగ్ అయ్యింది!! 

జనం నవ్వుకుంటున్నారు. ఒక సంఘటన చుట్టూ ఇన్ని వెర్షన్స్ కూటమి వర్గం వాళ్లే మాట్లాడడం వింతగా అనిపించి నవ్వుకుంటున్నారు. చేయించింది తామే కనుక డైవర్ట్ చేయడానికి ఇష్టమొచ్చినట్టుగా ఎవడికి తోచింది వాళ్లు మాట్లాడుతున్నారని అర్ధమౌతోంది. 

ఇలాంటి లింక్ లేని, కామన్ సెన్స్ లేని, తూకం లేని మాటల వల్లే ముందు నుంచీ ఈ వర్గం ప్రతిసారి బ్యాక్-ఫైర్ చవిచూస్తోంది. 

అబద్ధం ఆడినప్పుడు మెమరీ బలంగా ఉండాలి. ముందు ఏం చెప్పామో గుర్తు పెట్టుకోవాలి. కానీ అబద్ధంలో ఉన్న గొప్పతనమేంటంటే గుర్తుండదు. అందుకే పవన్ కూడా గతంలో తన చదువు గురించి చెబుతూ ఒకసారి ఎంపీసీ అని, ఒకసారి ఎం.ఈ.సీ అని, మరోసారి ఇంకోటేదో అని రకరకాలుగా చెప్పాడు.

ఈ విషయం మీద స్పందిస్తూ ఒక విజయవాడ వాసి ఇలా అన్నాడు- "నిజం చెప్పాకూడదు, నిజాన్ని పక్కదారి పట్టించాలి, పైకి ఫార్మల్ గా "ఖండిస్తున్నాం" అని ట్వీట్లు పెట్టడం ప్రత్యక్షంగా జగన్ పై రాయి దాడిని వెక్కిరించడం..ఇదే తెదేపా-జనసేన కూటమి క్యారెక్టర్. ఇంతకంటే చెప్పడానికేమీ లేదు".  

ఇక అచ్చెన్నాయుడైతే ఈ సంఘటనకి "కోడికత్తి 2.0" అని టైటిల్ పెట్టి, ఈ డ్రామా అంతా సింపతీ కోసం జగన్ మోహన్ రెడ్డి, డీజీపీ, ఇంటిలిజెన్స్ చీఫ్ కలిసి చేసారని చెప్పుకొచ్చాడు. 

ఇదంతా ఒకెత్తయితే బొండా ఉమ మరొక యాంగిల్లో తన అమాయకత్వాన్ని బయటపెట్టుకున్నాడు. ఆ రాయి వేసిన వాడు బీసీ కులస్తుడట. అతనిని అరెస్ట్ చేయడం బీసీలపై ప్రభుత్వం దాడి అట!! తమ పార్టీ పదవిలోకొచ్చాక పోలీసుల అంతు చూస్తానని వార్నింగ్ కూడా ఇచ్చాడు! 

ఇంతకంటే తెలివిమాలిన స్టేట్మెంట్ ఉంటుందా? ఈ రోజుల్లో ఇలాంటి స్టేట్మెంట్లకి కనెక్ట్ అయ్యే వాళ్లుంటారా? బీసీలే "ఛీ అవతలికి పో" అంటారు ఇలాంటి స్టేట్మెంట్లిస్తే. 

ఇలాంటి ఔట్ డేటెడ్ రాజకీయాల వల్లే తెదేపా పరిస్థితి ఇలా ఉందని అర్ధం చేసుకోవాలేమో. 

- హరగోపాల్ సూరపనేని

Show comments