రోజా ప్ర‌త్య‌ర్థి అట్ట‌హాసంగా నామినేష‌న్‌

రాష్ట్రంలో అంద‌రి దృష్టి ప్ర‌త్యేకంగా కొంత మందిపై ఉంది. చంద్ర‌బాబు, లోకేశ్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఆర్కే రోజా త‌దిత‌ర నేత‌ల భ‌విష్య‌త్ ఈ ఎన్నిక‌ల్లో ఎలా వుంటుందో అనే ఉత్కంఠ నెల‌కుంది. ఎందుకంటే మీడియాలో వీరి భ‌విత‌వ్యంపై ప‌లు ర‌కాల ప్ర‌చారం జ‌ర‌గ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఇవాళ నారా లోకేశ్ నామినేష‌న్ వేశారు. అలాగే మంత్రి ఆర్కే రోజా ప్ర‌త్య‌ర్థి, న‌గ‌రి టీడీపీ ఇన్‌చార్జ్ గాలి భానుప్ర‌కాశ్ గురువారం అట్ట‌హాసంగా నామినేష‌న్ వేశారు.

వేలాది మందితో ర్యాలీగా బ‌య‌ల్దేరి న‌గ‌రి ఆర్డీవో కార్యాలయానికి గాలి భానుప్ర‌కాశ్ చేరుకున్నారు. భానుప్ర‌కాశ్ నామినేష‌న్‌కు హైద‌రాబాద్ నుంచి టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీరెడ్డి హాజ‌రు కావ‌డం విశేషం. ఇద్ద‌రూ మంచి స్నేహితులు కావ‌డంతో ప్ర‌త్యేకంగా నామినేష‌న్‌కు వ‌చ్చార‌ని తెలిసింది.

న‌గ‌రిలో రోజాకు సొంత పార్టీలోనే వ్య‌తిరేకులు ఉన్నారు. ఎలాగైనా ఆమెను ఓడించాల‌నే ప‌ట్టుద‌ల‌తో కొంత మంది నేత‌లు కాచుక్కూచున్నారు. అయితే అస‌మ్మ‌తి వ‌ర్గంగా ముద్రప‌డిన నేత‌లెవ‌రికీ ప‌ట్టుమ‌ని ప‌ది ఓట్లు లేవ‌ని ఆమె అంటున్నారు. మ‌రోవైపు న‌గ‌రిలో "గాలి" బాగా వీస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. వ‌రుస‌గా రెండుసార్లు న‌గ‌రి నుంచి రోజా గెలుపొందారు. తండ్రీత‌న‌యులైన గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడు, భానుప్ర‌కాశ్‌ల‌పై గెలిచిన ఘ‌న‌త‌ను రోజా సంపాదించుకున్నారు.

ఈ ద‌ఫా కూడా గెలుపుపై రోజా ధీమాగా ఉన్నారు. అయితే వైసీపీలోని వ్య‌తిరేక‌త ఆమె గెలుపోట‌ముల‌పై ఎంత వ‌ర‌కు ప్ర‌భావితం చేస్తుందో చూడాలి.

Show comments