పురందేశ్వ‌రికి బీజేపీ ఇన్‌చార్జ్ చీవాట్లు!

ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి చీవాట్లు పెడుతూ తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గ బీజేపీ ఇన్‌చార్జ్ కోలా ఆనంద్ నేరుగా ఆమెకే లేఖ రాశారు. అలాగే ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో కాపుల‌కు జ‌రిగిన అన్యాయాన్ని బీజేపీ అగ్ర‌నేత‌లు అమిత్‌షా, జె.పి.నడ్డా, కె. లక్ష్మణ్ దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్ల‌డం గ‌మ‌నార్హం. వేర్వేరుగా రాసిన లేఖ‌ల్లో ఏముందో తెలుసుకుందాం.

ఏపీలో కాపు, బ‌లిజ సామాజిక వ‌ర్గానికి ఒక్క సీటు కూడా ఏపీ బీజేపీ కేటాయించ‌లేద‌ని అమిత్‌షా, న‌డ్డా త‌దిత‌ర ముఖ్య నేత‌లకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. కాపు, బ‌లిజ సామాజిక వ‌ర్గానికి ఏపీ బీజేపీ తీవ్ర అన్యాయం చేసింద‌ని త‌న నిర‌స‌న వ్య‌క్తం చేశారు. అంతేకాదు, ఏపీలో  పురందేశ్వ‌రి చ‌ర్య‌ల వ‌ల్ల బీజేపీకి కాపు, బ‌లిజ సామాజిక వ‌ర్గాలు ఊహించ‌ని షాక్ ఇవ్వ‌నున్నాయ‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.  

ఏపీలో కాపు, బలిజ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వ‌కుండా, వారి మనోభావాలను పూర్తిగా దెబ్బతీసి, అవమానించార‌ని వాపోయారు. దీంతో ఏపీ బీజేపీ నాయ‌క‌త్వంపై మనస్తాపం చెందిన కాపు బలిజ ఓటర్లు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధ‌ప‌డ్డార‌ని ప్ర‌స్తావించారు.  

శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో మండ‌ల స్థాయి నుంచి గ్రామ‌, బూత్ లెవెల్ వ‌ర‌కూ అన్ని ర‌కాల క‌మిటీల‌ను ఏర్పాటు చేసుకుని బీజేపీని శ‌క్తివంతంగా నిర్మించుకున్న‌ట్టు పేర్కొన్నారు. ఏపీలో కాపు, బ‌లిజ‌లు 23 శాతం ఉన్నార‌ని, శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో 16 శాతం ఉన్న‌ట్టు ఆయ‌న బీజేపీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లారు. శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ సునాయాసంగా గెలిచే సీటు అని కోలా ఆనంద్ వెల్ల‌డించారు. ఇప్ప‌టికైనా శ్రీ‌కాళ‌హ‌స్తిని బీజేపీకి కేటాయించాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించ‌డం విశేషం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిచి, ఢిల్లీ పెద్ద‌ల‌కు బ‌హుమానంగా ఇస్తాన‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.  

ఇదిలా వుండ‌గా పురందేశ్వ‌రికి రాసిన లేఖ‌లో కాపు, బ‌లిజ సామాజిక వ‌ర్గానికి అన్యాయం చేశార‌ని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కాపు సైనిక సమూహానికి తీరని అన్యాయం చేసిన రాష్ట్ర అధి నాయకులకు నమస్కారాలంటూ పురందేశ్వ‌రిని దెప్పి పొడిచారు. ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌నీసం ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా ఇవ్వ‌క‌పోవ‌డం విచార‌క‌ర‌మ‌ని కోలా ఆనంద్ వాపోయారు.

పొత్తుల్లో భాగంగా రాష్ట్ర నాయకత్వం ఒక్క సీటు కూడా కాపులకు ప్రతిపాదన చేయకపోవడం దేనికి సంకేతం! ఇంతటి దారుణమైన పరిస్థితికి కారణం ఎవ్వరు? అని పురందేశ్వ‌రిని కోలా ఆనంద్ ప్ర‌శ్నించారు. అన్యాయం చేసిన పురందేశ్వ‌రినే ప‌రోక్షంగా ప్ర‌శ్నిస్తూ, ఆమెకే లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. పురందేశ్వ‌రి విధానాల‌పై బీజేపీలో అంత‌ర్గ‌తంగా ఎంత‌గా ర‌గిలిపోతున్నారో కోలా ఆనంద్ లేఖే నిద‌ర్శ‌నం.

Show comments