బెయిల్ కోసం ఆమె చెప్పిన కారణాలు బలమైనవేనా?

కేసుల్లో నిందితులుగా ఉండి కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నవారు తప్పనిసరిగా చేసే పని బెయిల్ అడగడం. రకరకాల కారణాలు చూపించి బెయిల్ అడుగుతుంటారు. పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు విచారణ జరుగుతోంది కాబట్టి బెయిల్ ఇవ్వకూడదని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, ఆధారాలను మాయం చేయడమో, ధ్వంసం చేయడమో చేస్తారని వాదిస్తుంటారు.

కొన్ని కేసుల్లో బెయిల్ దొరుకుతుంది. కొన్ని కేసుల్లో దొరకదు. ఇదంతా కేసు విచారించే జడ్జీల విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. బెయిల్ రావాలంటే బలమైన కారణాలు చూపించాల్సి ఉంటుంది. ఏ కారణాలు చూపిస్తే బెయిల్ వస్తుందో కేసు వాదించే లాయర్లే సలహా ఇస్తారు. సాధారణంగా ఆరోగ్య కారణాలు చూపిస్తుంటారు. 

అసలు ఫస్ట్ జైలుకు వెళ్ళగానే ఆటోమేటిగ్గా అనారోగ్యం కలుగుతుంది. ఎక్కడెక్కడి జబ్బులు ఉన్నాయని చెబుతారు. జైల్లో డాక్టర్లు ఉంటారు కాబట్టి వీరితో పరీక్షలు చేయిస్తారు జైలు అధికారులు. నిందితులు చెప్పే అనారోగ్య కారణాలకు కేసు విచారించే జడ్జి కన్విన్స్ అయితే బెయిల్ దొరుకుతుంది. బెయిల్ ఇచ్చే ముందు అనేక కండీషన్లు పెడతారు. 

సరే... ఇప్పుడు విషయమేమిటంటే లిక్కర్ కుంభకోణంలో తీహార్ జైలులో ఉన్న కవిత ఇంతకూ ముందు ఒకసారి బెయిల్ అడిగింది.  అందుకు ఆమె చెప్పిన కారణం తన పిల్లగాడికి పరీక్షలు ఉన్నాయని. అవి చాలా ముఖ్యమైన పరీక్షలు కాబట్టి తాను దగ్గర ఉండి చదివించుకోవాలని, తాను లేకపోతే పిల్లగాడు మానసికంగా ఆవేదన చెంది, ఆ ప్రభావం పరీక్షలపై పడుతుందని, కాబట్టి తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టును  కోరింది. 

దీనిపై సీబీఐ ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించింది. పిల్లగాడి పరీక్షలు సగం అయిపోయాయని, అయినా పిల్లగాడిని చదివించుకోవడానికి కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పింది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తుందని, సాక్షులను ప్రభావితం చేస్తుందని, ఆమె రాజకీయంగా చాలా పలుకుబడి గల వ్యక్తని, ప్రభావవంతురాలని వాదించింది. ఆమె తమకు సహకరించడంలేదు కాబట్టి ఇంకా విచారించాల్సి ఉందని సీబీఐ వాదించింది. సీబీఐ వాదనకు కన్విన్స్ అయిన కోర్టు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది. ఇది బలమైన కారణం కాదని జడ్జి భావించారు. బెయిల్ ఇవ్వాల్సిన అర్జెన్సీ లేదని అనుకున్నారు. 

దీంతో కవితను మళ్ళీ జైలుకు తరలించారు. కవిత తాజాగా మరోసారి బెయిల్ పిటిషన్ వేసింది. ఈసారి అనారోగ్య కారణాలు చూపించింది . తనకు గర్భకోశ సమస్య ఉందని, హైబీపీ ఉందని, అల్సర్ ఉందని, వీటికి చికిత్స అవసరం కాబట్టి బెయిల్ ఇవ్వాలని కోరింది. అనారోగ్య కారణాలు చెబితే బెయిల్ వస్తుందని అనుకొని ఉండొచ్చు. ఇరవై ఏళ్ళ కిందట తన చేతి మణికట్టు ఎముక విగిందని, అది ఇప్పుడు బాధిస్తోందని చెప్పింది . 2013లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నానని, 2020 నుంచి గర్భ సంచి సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని చెప్పింది. 

2023 లో అల్సర్ మొదలైందని, అది బాధిస్తోందని తెలిపింది. తనకు హై బీపీ ఉందని, కస్టడీలో కూడా హై బీపీ ఉంటే డాక్టర్లు చికిత్స చేశారని చెప్పింది. బెయిల్ కోసం ఇన్ని అనారోగ్య కారణాలు చూపించింది కవిత. ఈ పిటిషన్ పరిశీలించిన స్పెషల్ జడ్జి కావేరీ బవేజా దీనిపై ఈ నెల 20 వరకల్లా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. 22 న విచారణ జరుగుతుంది. మరి సీబీఐ ఏం వాదిస్తుందో, జడ్జి ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఈడీ కేసులోనూ బెయిల్ పిటిషన్ విచారించాల్సి ఉంది.

Show comments