గెలుపు ఎటువైపు?

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన కార్యదక్షతను, చిత్తశుద్ధిని మాత్రమే నమ్ముకున్నారు. ఇంటింటికీ పంచిపెట్టిన అభివృద్ధి ఫలాలను మాత్రమే నమ్ముకున్నారు. ఈ అయిదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబమూ లబ్ధి పొందేలాగా తాను చేసిచూపెట్టిన సంక్షేమాన్ని నమ్ముకుని తనను మరోమారు ప్రజలు దీవిస్తారని ఆశిస్తున్నారు.

ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు.. తాను రాష్ట్రప్రజలకు అరచేతిలో చూపిస్తున్న వైకుంఠాన్ని నమ్ముకున్నారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లను పెంచి ఇవ్వడాన్ని, ఇంకా రకరకాలుగా ప్రకటించిన అలవిమాలిన తాయిలాల్ని నమ్ముకున్నారు. లాజిక్ కు అందనంత సంక్షేమాన్ని ప్రజల నెత్తిన గుమ్మరించేస్తే.. తనకు ‘సీఎంగా లాస్ట్ చాన్స్’ ఇస్తారని ఆశపడుతున్నారు.

చంద్రబాబు హామీలను ఎవరూ నమ్మరు.. అనేది వైఎస్సార్ కాంగ్రెస్ వారి ధీమా! జగన్ పట్ల ప్రజల్లో ఉండే విశ్వాసాన్ని వారిలోని ఆశ అధిగమిస్తుందనేది చంద్రబాబు ధీమా!!చంద్రబాబు పట్ల ‘నమ్మకం- ఆశ’ జగన్‌మోహన్ రెడ్డి  పట్ల  ‘విశ్వాసం- భరోసా’ ఈ రెండు పోకడల మధ్యనే ఇప్పుడు యుద్ధం జరగబోతోంది. ఈ సమరాంగణంలోని విలక్షణ కోణాలమీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘‘గెలుపు ఎటువైపు?’’

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణం ఇంకా నోటిఫికేషన్ రాకముందే.. యుద్ధం మొదలై చాలా కాలం అయిందనిపించేలా ఉంది. ఒక పార్టీ వెర్సస్ ఒక కూటమి గా సాగుతున్న సమరం ఇది. నన్ను ఒక్కడిని ఓడించడానికి, ఒంటరిగా వచ్చే ధైర్యం ఏ ఒక్కరికీ లేక, మూడు జెండాలు కలిసి వచ్చాయని జగన్మోహన్ రెడ్డి అంటూ వస్తున్నారు. తమాషా ఏంటంటే.. చంద్రబాబునాయుడు కూడా అదే మాట అంటున్నారు.

జగన్ ను ఓడించడానికి జెండాలు వేరైనా ముగ్గురం కలిసి పోటీచేస్తున్నాం అని! ఒకే వ్యవహారాన్ని ఒకే మాటలతో ప్రస్తావిస్తూ జగన్ ఒక రీతిగా ధ్వనిస్తోంటే, చంద్రబాబు అదేదో అద్భుతం అన్నట్టుగా చాటుకుంటున్నారు. మరో కోణంలోంచి చూసినప్పుడు.. ఒకవైపు తొలిసారి ముఖ్యమంత్రి అయి తన ముద్రను పదిలంగా మార్చుకోవాలని అనుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

రెండో వైపున- అపరిమిత అనన్యమైన రాజకీయానుభవం నా సొంతం అని చెప్పుకునే చంద్రబాబు, యూత్ లో నాకున్నంతటి క్రేజ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మరెవ్వరికీ లేదు అని చెప్పుకునే పవన్ కల్యాణ్, దేశానికి ప్రధానిగా ఉంటున్నప్పటికీ నిజానికి నాది ప్రపంచనేతల స్థాయి అని చెప్పుకునే మోడీ! ఈ రెండు వర్గాల మధ్య యుద్ధమే ఇప్పటి ఏపీ ఎన్నికలు. 2014లో కూడా ఇదే కాంబినేషన్ కదా అనిపించవచ్చు. కానీ.. వ్యక్తులు మాత్రమే అవును- అప్పటికీ ఇప్పటికీ ఆయా నాయకుల స్థాయి, తాహతు మారిపోయింది. 

ఎన్నికల్లో నెగ్గడం కోసం ప్రజలను ఆకట్టుకోవడానికి పార్టీలు రకరకాల ప్రకటనలు చేయడం చాలా సాధారణమైన సంగతి. రాబోయే రోజుల్లో పరిపాలించడానికి ప్రజల్లో ఒక ఆశ పుట్టించాలని పార్టీలు అనుకుంటాయి. అందుకే వరాలను ప్రకటిస్తూ ఉంటాయి. నిజానికి ఇలాంటి కొత్త వరాలను, హామీలను ప్రకటించడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతగా ఆత్రుతపడడం లేదు.

‘మీ బిడ్డ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ఫలితాలు మీ ఇంటి వరకు అంది ఉంటే మాత్రమే మీరు నాకు ఓటు వేయండి.. మీ ఇంటికి అంది ఉండకపోతే నాకు ఓటు వేయనే వద్దు’ అని జగన్ చెబుతున్నారు. బహుశా వర్తమాన రాజకీయ చరిత్రలో మన దేశంలోనే ప్రజలను ఇలా ఓట్లు అడిగే మరొక నాయకుడు మనకు కనిపించకపోవచ్చు. ‘నన్ను నమ్మండి.. గెలిపించండి.. మీ జీవితాల రూపురేఖలు మార్చేస్తా’ అని చెప్పేవాళ్లు కొల్లలుగా దొరకుతారు. కానీ ‘మీ జీవితాల రూపురేఖలు ఆల్రెడీ మారిపోయిఉంటే మాత్రమే నాకు ఓటు వేయండి’ అనే వాళ్లు దొరకరు. జగన్ తాను చేపట్టిన పథకాల మీద అంతటి నమ్మకంతో ఉన్నారు.

చంద్రబాబునాయుడు పరిస్థితి వేరు. ఇలాంటి మాటలు చెప్పడానికి ఆయనకు ధైర్యం చాలదు. అందుకే సరికొత్త వరాలను పుంఖాను పుంఖాలుగా ప్రకటిస్తూ వస్తున్నారు. గతంలో సీఎంగా ఉండగానే తెలుగుదేశంలోని సీనియర్ నాయకులే.. చంద్రబాబు తీరు గురించి ఒక మాట అంటూ ఉండేవారు.  ‘ప్రతిరోజూ పేపర్లో కనిపిస్తూనే ఉండాలని చంద్రబాబు అనుకుంటారు. ఒక్కరోజు పేపర్లో తను కనపడకపోయినా ప్రజలు మర్చిపోతారని ఆయన భయం’ అనేవారు. ఆ తరహాలో ఇప్పుడు ప్రతిరోజూ ఒక కొత్త హామీ ఇస్తూ ఉంటే తప్ప, వరం ప్రకటిస్తూ ఉంటే తప్ప ప్రజలు తనను మరచిపోతారని చంద్రబాబునాయుడు ఆందోళన చెందుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆయన ఏక బిగిన ఏదో ఒక కొత్త వరంతో ప్రజల ముందుకు వస్తూనే ఉన్నారు. ఆ హామీలన్నీ ఎలాంటివి? అని సూత్రీకరించదలచుకుంటే.. ‘జగన్ కంటె నేను ఎక్కువ ఇస్తా’ అనేది ఒక్కటే అన్నింటికీ కలిపి ఏకసూత్రంగా ఉన్న అంశం అని మనకు బోధపడుతుంది.

చంద్రబాబునాయుడు తొలుత సూపర్ సిక్స్ అనే హామీలను ప్రకటించి వాటి గురించి ఊదరగొడుతూ చాలా కాలం సాగదీశారు. వాటిలో కొన్ని కొత్త ఆలోచనలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి మహిళకు నెలకు రూ.1500, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితప్రయాణం, నిరుద్యోగులకు నెలకు రూ.3000 భృతి, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, రైతుకు ఏడాదికి రూ.20వేలు వంటివి అందులో ఉన్నాయి. కాలక్రమంలో.. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాల కల్పన చేయడం లేదనే విమర్శలను తిప్పికొట్టేలాగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఈలోగా ఎన్నికల ప్రకటన రావడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. అది ఆగిపోవడాన్ని చంద్రబాబునాయుడు చాలా తెలివిగా తన రాజకీయ ఎత్తుగడకు వాడుకున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడితే వెంటనే మెగాడీఎస్సీని ప్రకటిస్తానని అన్నారు. ఇది ఒక్కటే ఆయన హామీల్లో సరైన రాజకీయ వ్యూహం. ఆరకంగా ఆయన జగన్ మీద పైచేయి సాధించారు.

కానీ ఈ హామీలు సరిపోతాయో లేదోననే భయం పట్టుకుంది. అందుకే ‘జగన్ కంటె ఎక్కువ ఇస్తా’ అనే ప్రాతిపదికగా బోలెడు వరాలు కురిపిస్తున్నారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లు 3వేల నుంచి 4వేలు ఇస్తారట, అదికూడా ఏప్రిల్ నుంచి అరియర్స్ తో సహా! రెండు నెలలు తీసుకోకపోయినా.. మూడో నెలలో మొత్తం పింఛన్లూ ఇస్తారట. వికలాంగులకు 4వేల నుంచి 6వేలు ఇస్తారట, వాలంటీర్లకు జీతాలు 5వేల నుంచి 10వేలు ఇస్తారట, బీసీలకు 50 ఏళ్లు వస్తే చాలు వృద్ధాప్య పింఛను జాబితాలో చేర్చేస్తారట. ఇలా ఆయన ఒకదానిని మించి మరొకటి హామీలు చెప్పుకుంటూ పోతున్నారు. ఇవన్నీ ఖచ్చితంగా లబ్ధిదారులను ఊరించే విషయాలే.

అదే సమయంలో- చంద్రబాబు వరాలకు కౌంటర్ గా వైఎస్సార్ కాంగ్రెస్ చెబుతున్న మాట ఒకే ఒక్కటి. చంద్రబాబునాయుడుకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు అనేది. ఆయన మాటలను ప్రజలు నమ్మరు అని మాత్రమే వారు చెబుతున్నారు. ఒకవేళ ప్రజలు ఆయన మాటను నమ్మితే పరిస్థితి ఏమిటి? ప్రజలు బాబు మాటలను నమ్మితే రాగల పరిణామాలకు వైసీపీ వద్ద ఎలాంటి ప్లాన్ బి ఉన్నదో తెలియదు. 

నమ్మకం- ఆశ

చంద్రబాబునాయుడు ప్రస్తుత రాజకీయం మొత్తం ‘నమ్మకం- ఆశ’ అనే పదాల మధ్యనే దోబూచులాడుతోంది. చంద్రబాబు నాయుడు ఏ రకంగా నమ్మజాలని నాయకుడు అనే విషయాన్ని ప్రజల ఎదుట నిరూపించడానికి జగన్మోహన్ రెడ్డి, పాపం.. తన పాట్లు తాను పడుతున్నారు. ప్రతి బహింరగ సభలోనూ కొన్ని నిమిషాల సమయాన్ని తెలుగుదేశం 2014 మేనిఫెస్టో మీద చర్చకే కేటాయిస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు ఏమేం వరాలు ప్రకటించారో ఏకరవు పెట్టి.. అవన్నీ చేయలేదు కదా.. ఎలా నమ్మడం? అని ప్రశ్నిస్తున్నారు. మేనిఫెస్టోను ప్రకటించి.. గెలిచిన తర్వాత.. కనీసం  దానిని తమ పార్టీ వెబ్ సైట్లోంచి తొలగించిన మోసగాడు చంద్రబాబు అని కూడా విమర్శిస్తున్నారు. ఏ రకంగానూ చంద్రబాబును ఎందుకు నమ్మకూడదో పదేపదే చెబుతూ ఉన్నారు.

జగన్మోహన్ రెడ్డి చెబుతున్న ప్రతి మాటా నిజమే కావొచ్చు. ఆయన రైతురుణమాఫీని అమలు చేసిన తీరు దగ్గరినుంచి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో ఎన్నెన్ని నాటకాలు నడుస్తాయో రాష్ట్రప్రజలకు ఒక క్లారిటీ ఉంది. జగన్ అభివర్ణిస్తున్నట్టుగా  ‘మోసగాడు’ అనే పదాన్ని ప్రతి పౌరుడూ ఫీల్ కాకపోవచ్చు గానీ.. చంద్రబాబు ఇచ్చిన వరం చేతిలో పడేవరకు నమ్మడానికి వీల్లేదనే అభిప్రాయం మాత్రం ఎక్కువమందిలో ఉంటుంది. జగన్ నుంచి సజ్జల వరకు ‘చంద్రబాబు చెప్పే హామీలను ప్రజలు నమ్మరు’ అనే వాక్యంతోనే ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు.

నిజమే అనుకుందాం. ప్రజలకు చంద్రబాబు మీద నమ్మకం లేదు, కలగదు! కానీ ప్రజలకు ‘ఆశ’ ఉంటుంది కదా! సాధారణంగా మనుషుల్ని ముందుకు నడిపించేది ‘ఆశే’ కదా! మరి ఆ ఆశ వారిని ఎలాంటి నిర్ణయాలవైపు పురిగొల్పుతుంది అనేది ఇక్కడ కీలకం.

జగన్ 3వేలు ఇస్తోంటే చంద్రబాబు 4 వేలు ఇస్తానంటున్నాడు. చంద్రబాబునాయుడుది మొత్తం వేలంపాట రాజకీయం లాంటిదే. జగన్ ఇచ్చే ప్రతి పథకానికీ తన పాట పెంచి ప్రకటిస్తున్నాడు. మరి జనంలో ఆయన పట్ల ఉండే అపనమ్మకాన్ని, ఆ పెరిగే సొమ్ము కోసం ఉండే ‘ఆశ’ జయిస్తుందా? లేదా? అనేది ఇక్కడ కీలకం. ఆశ నెగ్గిందంటే.. పరిస్థితి ఏమిటి? ముందే అనుకున్నట్టు- జగన్ వద్ద ఉన్న ప్లాన్ బీ ఏమిటి?

విశ్వాసం- భరోసా

జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రజల్లో తన పట్ల విశ్వాసం ఉంటుందనే భావనతోనే ఇప్పటిదాకా రాజకీయం చేస్తున్నారు. తాను ‘ఫలానా చేస్తానంటూ’ వరాలతో మాయచేయాల్సిన అవసరం లేదు.. తాను చేసిన పనిని ప్రజలు గుర్తిస్తే చాలు అనేది ఆయన కోరిక. 2019 ఎన్నికలకు పూర్వం జగన్ పింఛను 2వేలు చేస్తానని హామీ ఇస్తే చంద్రబాబు అప్పటికప్పుడు 2వేలకు పెంచేశారు. దానికి పోటీగా ‘నేను మూడు వేలు చేస్తా’ అంటూ వేలంపాటలా పెంచేశారు జగన్. దానికి తగ్గట్టుగానే అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పోయి ప్రస్తుతం మూడువేలు అందిస్తున్నారు.

ఇలా చెప్పిన మాట నిలబెట్టుకున్నందుకు.. అయిదేళ్ల ప్రజలు ఎన్నడూ ఊహించని మొత్తాలను ఇవాళ పింఛన్లుగా అందిస్తున్నందుకు ప్రజలు తన పట్ల విశ్వాసంతో ఉంటారనేది జగన్ కోరిక. అలాగే అమ్మఒడి వంటివి, ఆటోడ్రైవర్లకు, టైలర్లకు, న్యాయవాదులకు రకరకాల వృత్తి పనివాళ్లకు అందిస్తున్న ఆర్థికసాయాలు వంటివి కూడా పూర్తిగా తన మీద ప్రజల్లో విశ్వాసం పెంచుతాయనేది ఆయన ఆలోచన. తన ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంటుందనే భరోసా ప్రజల్లో ఈ అయిదేళ్లలో కలిగించగలిగాను అని జగన్ నమ్ముతున్నారు. అందులో సందేహం లేదు. 99 శాతం మేనిఫెస్టో హామీలను అమలు చేశాం అని చేతిలో మేనిఫెస్టో కాపీ పట్టుకుని చెప్పే ధైర్యం కూడా ఈ రోజుల్లో మరో నాయకుడికి ఉండదు.

ప్రజల్లో ఉండే విశ్వాసమే గెలిపిస్తుంది అని ఆయన ఆశిస్తున్నారు. జగన్ పట్ల ప్రజలకు విశ్వాసం లేదనడానికి వీల్లేదు. అది టన్నుల్లోనే ఉంది. భరోసా కూడా టన్నుల్లోనే ఉంది. కానీ.. ఆ విశ్వాసంతోనే వారు ప్రవర్తిస్తారా.. చంద్రబాబు ప్రకటించిన ఊరించే తాయిలాలు, వేలంపాట లబ్ధి మీది ఆశ- జగన్ మీద విశ్వాసాన్ని కూడా కబళించేయకుండా ఉంటుందా? అనేది కీలకమైన సందేహం. 

ఇప్పుడు రాజకీయాలు చాలా సంక్లిష్ట దశలో ఉన్నాయి. ఎందుకంటే.. చంద్రబాబు ప్రకటించిన హామీలను జగన్ ‘ఓకే నేను కూడా అలాగే ఇస్తా’ అని అనలేరు. ఒకవేళ అలా అన్నప్పటికీకూడా, నన్ను చూసి కాపీ కొట్టి జగన్ ఇలాంటి ప్రకటన చేశారని చంద్రబాబు ఎడ్వాంటేజీ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. అలాగని జగన్ వాటిని ఇగ్నోర్ చేయలేరు. ఎందుకంటే.. అవి ప్రజలకు ఆశ చూపెడుతున్నాయి.

ఇలాంటి దశలో ప్రజలను మరింత సమ్మోహితుల్ని చేయగల సరికొత్త హామీలను జగన్ తయారు చేసుకోవాలి. అలాంటి వాటి మీద పార్టీ కసరత్తు చేస్తూ ఉంటుంది. కొత్త హామీలు ఎలా ఉండాలంటే.. ఇప్పుడు చంద్రబాబు ప్రజలను ఊరించేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని మైమరపించేలా ఉండాలి. మరి జగన్ ఎలాంటి మేనిఫెస్టో అంశాలతో సిద్ధం అవుతున్నారో తెలియదు.

చాలా సందర్భాల్లో కొన్ని అనివార్యతలు రాజకీయ నాయకుల నిర్ణయాలను శాసిస్తుంటాయి. వారు తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.  గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్తు హామీ ఇచ్చినప్పుడు.. చంద్రబాబు అనుకూలవర్గాలు అదేహామీ మనం కూడా ఇవ్వాలని ఆయనకు ఉపదేశం చేశాయి. ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకుని ఉంటే రాజకీయం ఎలా మారి ఉండేదో మనకు తెలియదు. అలాగే.. చంద్రబాబు రైతు రుణమాఫీ అన్నప్పుడు.. జగన్ అనుకూల దళాలు ఆయనకు కూడా అదే సలహా ఇచ్చాయి. ‘అలాంటి ఫాల్స్ హామీలు మనం ఇవ్వకూడదు’ అని జగన్ తిరస్కరించారు. 2014 ఫలితం మనకు తెలుసు.

ఇప్పుడు కూడా అలాంటి ఒత్తిడి నాయకుల మీద ఉంది. అనివార్యంగా కొన్ని వరాలను ప్రకటించాల్సి ఉంటుంది. కాపీ వరాలు కాకపోయినా, వాటిని తలదన్నే వరాలను తయారుచేసుకోవాల్సి ఉంటుంది. ఈ విడత ఎన్నికలు పూర్తిగా వరాల ఎన్నికలుగా మన రాష్ట్రంలో మారబోతున్నాయి.

.. ఎల్. విజయలక్ష్మి

Show comments