బాబు వ్యతిరేకులు అందరికీ కమలం మొండిచెయ్యి!

ఏపీ భారతీయ జనతాపార్టీలో తొలి నుంచి కూడా రెండు వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం చంద్రబాబునాయుడు కోవర్టుల వర్గం. ఆయన పార్టీలో ఆయనతో కలిసి కీలకంగా పనిచేసి.. ఆయన పురమాయింపు మీద వెళ్లి గుట్టుచప్పుడు కాకుండా భారతీయ జనతా పార్టీలో చేరిన వారన్నమాట.

తొలి నుంచి బిజెపిలో ఉన్నవారే అయినప్పటికీ.. చంద్రభజన చేయడాన్ని అలవాటు చేసుకున్న వారు కూడా ఈ కోవకే చెందుతారు. ఇక రెండోవర్గం విషయానికి వస్తే.. చంద్రబాబుతో మైత్రి ఎప్పటికైనా డేంజరే అని నమ్మే వర్గం. ఏపీలో అచ్చమైన స్వతంత్ర పార్టీగా బిజెపి ఎదగాలని కోరుకునే వర్గం. జగన్, చంద్రబాబులకు సమానదూరం పాటిస్తూ పార్టీకోసమే పనిచేసే వర్గం. అయితే వీరి మీద జగన్ అనుకూలురనే ముద్ర వేసి.. చంద్రబాబు టీమ్ గోబెల్స్ ప్రచారం చేస్తుంటుంది. అది వేరే సంగతి.

ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ టికెట్ల కేటాయింపు వ్యవహారానికి వస్తే.. చంద్రబాబును వ్యతిరేకించే నాయకులు ఎవ్వరికీ కూడా.. అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ దక్కనేలేదు. ఆయన అనుకూలురు, కోవర్టులకు మాత్రమే టికెట్లు దక్కాయి. పాపం.. పార్టీనే నమ్ముకున్న, పురాతనకాలం నుంచి ఉన్న వారికి మొండిచెయ్యే చూపించారు.

ప్రత్యేకించి.. చంద్రబాబునాయుడుతో పొత్ తుపెట్టుకోవడం అనేది భారతీయ జనతా పార్టీకి ఆత్మహత్యా సదృశం అని.. దాని వలన ఏపీలో పార్టీ బాగా దెబ్బతింటుందని.. చంద్రబాబు కేటాయించిన పది సీట్లలో ఒక్క సీటులో కూడా ఆ పార్టీ ఇప్పటిదాకా గెలిచిన చరిత్ర లేదని, కుట్రపూరితంగా ఏపీలో బిజెపిని దెబ్బకొట్టడానికే ఇలా కేటాయించారని ఆరోపిస్తూ అధిష్ఠానానికి సుదీర్ఘమైన లేఖ రాశారు. విష్ణువర్దన్ రెడ్డి, శాంతారెడ్డి తదితరులు లేఖరాసిన వారిలో ఉన్నారు. వారి వినతులను, ఆక్షేపణలను కమల అధిష్ఠానం పట్టించుకోలేదు సరికదా.. వారెవ్వరికీ టికెట్లు కూడా ఇవ్వలేదు.

ముందు నుంచి అనుకుంటున్నట్టే.. చంద్రబాబు కోవర్టులు అందరూ టికెట్లు దక్కించుకున్నారు. ప్రకటించిన పది స్థానాల్లో తెలుగుదేశం నుంచి కమలదళంలోకి వెళ్లిన కోవర్టులు సుజనా చౌదరి, ఆదినారాయణరెడ్డి ఉన్నారు. విష్ణుకుమార్ రాజు, పార్థసారధి, సత్యకుమార్ కూడా బాబుకు అనుకూలురే. చివరికి అనపర్తి టికెట్ సోము వీర్రాజుకు దక్కుతుందని చివరినిమిషం దాకా వినిపించింది. అయితే.. ఆ స్థానం వద్దని వీర్రాజే తిరస్కరించినట్లు తెలుస్తోంది.

అనపర్తిలో బిజెపికి సొంతంగా ఒక్క ఓటు కూడా లేకపోగా.. సోము వీర్రాజును భ్రష్టు పట్టించడానికే ఆ స్థానం కేటాయిస్తున్నారని ఒక ప్రచారం జరిగింది. పరువు పోకుండా ఆయన జాగ్రత్త పడ్డట్టున్నారు.

Show comments