ఈశ్వరుని చేరిన విశ్వనాధుడు

ఆయన లేరు..ఆయన ఇక లేరు..ఇలాంటి మాటలు రాయాలంటే మనసు రావడం లేదు. ఎంత ఉన్నతమైన వ్యక్తి. ఎంతటి ఉదాత్తమైన భావజాలం కలిగిన సృజన శీలి. ఎక్కడెక్కడో తిరుగుతున్న సినిమా చేయి పట్టి ఇదీ అసలైన దారి, అంటూ భారతీయ సంస్కృతీ సంప్రదాయాల బాట వెంట తిప్పిన దిగ్దర్శకుడు. కాశీనాధుని విశ్వనాధ్. ఆ ఈశ్వర సన్నిధికి చేరిపోయారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఫిల్మ్ నగర్ లో ఆయన తుదిశ్వాస విడిచారు.

విశ్వనాధ్ వయస్సు 92 సంవత్సరాలు. భార్య, పిల్లలు వున్నారు. 1951 లో సినిమా రంగంలోకి ప్రవేశించిన విశ్వనాధ్ 1965లో దర్శకుడిగా ఎదిగారు. పూర్తిగా మంచి సంసారపక్షమైన సినిమాలు తీస్తూ వచ్చిన విశ్వనాధ్ ప్రయాణం సిరిసిరిమువ్వ సినిమాతో మలుపుతిరిగిింది. అప్పటి వరకు కూడా మాంచి భావోద్వేగ సినిమాలకు ఆయన చిరునామాగా వుండేవారు. సిరిసిరిమువ్వతో సంగీతానికి, సంప్రదాయాలకు అడ్డాగా మారిపోయాయి. శంకరాభరణం సినిమా ఆయనను సమూలంగా మార్చేసింది. స్వాతిముత్యం, సప్తపది, సాగరసంగమం, స్వర్ణకమలం, ఇలా ఆ కోవలో వచ్చిన ప్రతి సినిమా విశ్వనాధ్ ప్రతిష్టను పెంచాయి.

అలనాటి కమర్షియల్ ఆల్ రౌండర్ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఈయనకు గురువు. వేటూరి, సిరివెన్నెలలను తెలుగు తెరకు పరిచయం చేసింది కే విశ్వనాధ్ నే. నటుడిగా కూడా తన స్థాయికి తగిన అనేక సినిమాలు చేసారు విశ్వనాధ్. లెక్కలేనన్ని అవార్డులు, గౌరవాలు విశ్వనాధ్ ను వెదుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు ఆయనే పరమపద సోపానాన్ని అధిరోహించి పరమేశ్వుని వెదుక్కుంటూ వెళ్లిపోయారు.

Show comments