ఆ రెడ్డి పోతే ఈ రెడ్డి.. టీడీపీ అత్యుత్సాహ‌మెందుక‌బ్బా!

కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి.. రేపోమాపో ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి .. వీరు నెల్లూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ వైపు మ‌ళ్లే అవ‌కాశాలున్న‌వారు. వీరిలో శ్రీధ‌ర్ రెడ్డికి చంద్ర‌బాబుతో సన్నిహిత సంబంధాలున్నాయ‌నేది ఇప్ప‌టి అంశం ఏమీ కాదు. తెలుగుదేశం పార్టీ బీట్ రిపోర్ట‌ర్ ఎవ‌రిని అడిగినా ఈ విష‌యం చెబుతారు! వైఎస్ జ‌గ‌న్ కు వీర‌భ‌క్తుడిగా క‌నిపించే శ్రీధ‌ర్ రెడ్డి చంద్ర‌బాబుకు అతి స‌న్నిహితుడ‌ని టీడీపీ ఆఫీసు బీట్ చూసిన విలేక‌రులు చెబితే అప్ప‌ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులు నివ్వెర‌పోయేవారు!

అదేంటి.. అలా ఉండ‌దు, కోటంరెడ్డి హార్డ్ కోర్.. అంటూ వాదించేవారు. అయితే చంద్ర‌బాబుకు కోటంరెడ్డి చాలా క్లోజ్ అని చెబితే అప్ప‌ట్లో న‌మ్మే వారు త‌క్కువ‌. అయితే ఇప్పుడు ఈ విష‌యం పై పూర్తి క్లారిటీ వ‌చ్చేసింది. 

నెల్లూరు జిల్లాలో నేత‌ల మ‌ధ్య‌న రాజ‌కీయ వైరాలున్నా సాన్నిహిత్యాల‌కూ, బంధుత్వాల‌కూ లోటు లేదు. బావాబామ్మ‌ర్దులు, మేన‌మామ అల్లుళ్లు, అన్న‌ద‌మ్ములు కూడా వేర్వేరు పార్టీల్లో ఉంటారు. ఆఫ్ ద రికార్డుగా వీరు అంతా స‌న్నిహితులే మ‌ళ్లీ! మేక‌పాటి కుటుంబానికీ, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డికి కూడా స‌న్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఇందులో దాప‌రికం ఏమీ ఉండ‌దు.

సోమిరెడ్డి తెలుగుదేశం నేతే, హార్డ్ కోర్ చంద్ర‌బాబు భ‌క్తుడే. అయితే మేక‌పాటి ఫ్యామిలీలో ప‌ర్స‌నల్ రిలేష‌న్ షిప్ ఎప్పుడూ ఉంది! ఇలాంటి సాన్నిహిత్యాలు నెల్లూరు రాజ‌కీయంలో కొద‌వ‌లేదు. అలాగే ఒకే పార్టీలో ఉంటూ రాజ‌కీయ వైరాన్ని న‌డిపే వ‌ర్గ రాజ‌కీయ‌మూ కొత్త కాదు. అయితే వీట‌న్నింటికీ విడ్డూర‌మైన రీతిలో కోటంరెడ్డి వ్య‌వ‌హారం సాగింది. జ‌గ‌న్ కు వీర‌భ‌క్తుడిగా చెప్పుకుంటూ, త‌న‌కు ప‌ద‌వుల‌న్నీ జ‌గ‌న్ పెట్టిన భిక్ష అంటూ ఎమోష‌న‌ల్ గా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ఆయ‌న బంధం నెర‌ప‌డం, అది కూడా డైరెక్టుగా చంద్ర‌బాబుతోనే బంధాన్ని కొన‌సాగిస్తూ రావ‌డం విడ్డూరం.

ఇక కోటంరెడ్డి ఇంకా తెలుగుదేశంలోకి చేరే ముహూర్తాన్ని ఎంచుకోక‌ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదాల‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించేసింది. నెల్లూరు ఎంపీ సీటుకు అభ్య‌ర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క‌ష్టం కాదు. ఇక ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డికి కూడా ప్ర‌త్యామ్నాయాన్ని సిద్ధం చేసింది. మ‌రి ఈ మాత్రం దానికి తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లాలో త‌మ పార్టీలోకి పెద్ద రెడ్లు చేరిపోతున్నార‌ని మురిసిపోతూ ఉండ‌టం ఎందుకో!

Show comments