కొన్ని నెలలుగా కోటంరెడ్డి కోవర్ట్ ఆపరేషన్!

మొత్తానికి చాలా జాగ్రత్తగా తొడుక్కున్న ముసుగు తొలగిపోయింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టుగా ప్రకటించేశారు. ఆయన ఈ మేరకు 2024 ఎన్నికల్ల అదే చోటనుంచి టీడీపీ తరఫున పోటీచేస్తున్నట్టుగా కార్యకర్తల, అనుచరుల సమావేశంలో చెప్పిన మాటలు ఆడియో బయటకు వచ్చింది.

కోటంరెడ్డి పార్టీ మారే సంగతి క్లారిటీ వచ్చినట్టే. వైఎస్ కుటుంబానికి విధేయుడు కావడంతో.. చాలావరకు ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నించిన వైసీపీ అధిష్ఠానం.. ఆయన మంకుపట్టుతో కుదరకపోవడంతో ఇక ఆ నియోజకవర్గానికి వేరే ఇన్చార్జిని నియమించే ప్రయత్నంలో పడింది. 

అయితే తాజాగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ.. కొన్ని నెలలుగా తెలుగుదేశం తరఫున కోవర్ట్ ఆపరేషన్ నిర్వహిస్తూ వచ్చారు. నెల్లూరు జిల్లా నుంచి తనకు మంత్రి పదవి ఇవ్వలేదన్నదే ఆయనలోని అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కోటంరెడ్డి స్వయంగా మంత్రి పదవికి నేను పనికి రాను సరే.. ప్రభుత్వ చీఫ్ విప్, విప్, కనీసం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి కూడా పనికిరానా అంటూ ఆగ్రహం వ్యక్తంచేసిన వైనం ఈ సందర్బంగా అందరూ గుర్తుచేస్తున్నారు. 

కోటంరెడ్డి మంత్రి పదవి మీద ఆశపడ్డారు. అది కుదర్లేదు. రాజకీయంగా ఎంతో చైతన్యవంతమైన నెల్లూరు జిల్లాలో చాలామంది సీనియర్లుండడం ఆయనకు దెబ్బగా మారింది. కానీ కులాల సమీకరణల్లో జిల్లాకు చెందిన అనిల్ కుమార్ యాదవ్ కు మంత్రి పదవి లభించడాన్ని కూడా కోటంరెడ్డి జీర్ణించుకోలేకపోయారు. 

తాను వైసీపీలో ఉన్నంతవరకు మళ్లీ మళ్లీ ఎన్నిసార్లు గెలిచినా మంత్రి పదవి రాదని ఆయనకు అర్థమైంది. జిల్లాలో ఆ పార్టీలో అంతమంది సీనియర్లు ఉన్నారనేది ఆయనకు తెలియని సంగతి కాదు. ఇక పార్టీ మారదలచుకున్నారు. అప్పటినుంచే కోవర్టులాగా తెలుగుదేశంకు లాభించేలా సొంత పార్టీమీద విమర్శలు చేయడం ప్రారంభించినట్టు కనిపిస్తోంది. 

పెన్షనర్ల జాబితాలో వందల మంది పేర్లను తొలగిస్తున్నారన్నప్పుడే కోటంరెడ్డి.. చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్కరి పేరు తొలగించినా ఊరుకునేది లేదని, ప్రజల వద్దకు ఎలా వెళ్లగలం అని అన్నారు. సీఎం హామీ ఇచ్చిన మసీదు నిర్మాణానికి నిధులు రావడంలేదంటూ చాలా మాటలు అన్నారు. 

సాధారణంగా జగన్ నైజం ప్రకారం.. ఇలాంటి ధిక్కార స్వరం వినిపించిన వారిని ఆయన పూర్తిగా పక్కన పెట్టేస్తారు. కానీ కోటంరెడ్డి అంటే ఉండే ప్రత్యేకమైన అభిమానం, ఆయన ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అనే అభిప్రాయం వలన.. జగన్ స్వయంగా కోటంరెడ్డిని పిలిపించి మాట్లాడారు. 

అయితే అప్పటికే తెలుగుదేశంలో చేరడం గురించి నిర్ణయానికి వచ్చి ఉన్న కోటంరెడ్డి ఆ తర్వాత కూడా తీరు మార్చుకోలేదు. ప్రభుత్వం వాస్తవాలు గ్రహించేలోగా.. చేయదగినంత నష్టంచేసేలా సొంత పార్టీ మీద విమర్శలు చేసేసి.. తాజాగా తాను తెలుగుదేశం తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్టుగా ప్రకటించడం గమనార్హం. ఇదంతా మంత్రి పదవిమీద అనుచితంగా పెంచుకున్న కోరిక వల్లనే జరుగుతోందని ప్రజలు అనుకుంటున్నారు.

Show comments