ఏపీ రాజధాని విశాఖే... పక్కా క్లారిటీ ఇచ్చిన జగన్

ఏపీకి రాజధాని ఏది అని ఎగతాళీగా కొందరు మాట్లాడుతూంటారు. అక్కడికి గత ప్రభుత్వం హయాంలో అక్కడికి ఏదో చాలా పెద్ద రాజధాని అని ఒకటి ఉన్నట్లుగా గొప్పలు చెబుతారు. విభజన తరువాత ఏపీకి రాజధాని అంటూ ఈ రోజుకీ  లేదు. ఇది అందరూ నమ్మాల్సిన కఠిన వాస్తవం. పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే ఖరారు చేస్తూ చట్టంలో పెట్టారు. ఏపీ ఈ మధ్యలో రాజధాని కట్టుకుంటే ఓకే. లేకపోతే మరిన్నాళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది అన్నదే చట్టంలో ఉన్న స్ఫూర్తి.

చంద్రబాబు విభజన ఏపీకి తొలి సీఎం అయ్యాక అమరావతి అంటూ హడావుడి చేశారు తప్ప అక్కడ ఈ రోజుకీ రాజధాని స్ట్రక్చర్ అంటూ లేదు. అమరావతి రాజధాని ఇంకా భారీ  కాన్వాసుల మీద డిజైన్లలోనే ఉంది. కాగితాల మెదళ్ళలోనే ఉంది. ఇపుడు అమరావతిలో ఉన్న కొన్ని భవనాలు చూపించి రాజధాని అంటే పెట్టుబడులు రావు. అభివృద్ధి కూడా జరగదు.

అందుకే వైసీపీ ప్రభుత్వం రెడీమేడ్ సిటీగా ఉన్న విశాఖను రాజధానిగా చేసుకుని పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ మీట్ కర్టెన్ రైజర్ ప్రోగ్రాం ఢిల్లీలో ఈ రోజు జరిగింది. దానికి హాజరైన జగన్ ఏపీ రాజధాని విశాఖ అని పక్కా క్లారిటీతో చెప్పారు. ఇన్వెస్టర్లు అంతా విశాఖను  చూసి పెట్టుబడులు పెట్టాలని భారీ ఆహ్వానం పలికారు.

తాను కూడా విశాఖకు తొందరలోనే షిఫ్ట్ అవబోతున్నాను అని జగన్ చెప్పారు. విశాఖ ల్యాండ్ బ్యాంక్ ఉంది, పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంది అంటూ ఆయన విశాఖ రాజధానిని దేశ రాజధాని గడ్డ మీద నుంచే హైలెట్ చేశారు. జగన్ అన్నారని కాదు కానీ ఇపుడున్న పరిస్థితుల్లో ఏపీ రాజధాని పరంగా తీసుకోవాల్సిన తెలివైన నిర్ణయంగానే విశాఖను అంతా చూస్తున్నారు.

అప్పులతో ఇబ్బందులతో సతమతం అవుతున్న ఏపీ లక్షల కోట్లు పెట్టు అమరావతి అనే పేరిట ఒక నగరాన్ని నెత్తికెత్తుకుని నిర్మించలేదు. అది అందరికీ తెలిసిందే. ఒకవేళ లక్షల కోట్లు కుమ్మరించాలనుకున్నా అమరావతి పూర్తి అయ్యేసరికి వందల ఏళ్ళు పడుతుంది. 

అందువల్ల అప్పటిదాకా రాజధాని లేకుండా ఉండడం కంటే విశాఖను రాజధానిగా చేసుకుని ఏపీ ప్రగతి గతిని మార్చుకోవడం మంచి నిర్ణయం. ఆ దిశగా కొన్నాళ్ళుగా కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు తన దృఢ నిర్ణయాన్ని ప్రకటించింది. ఏపీకి రాజధాని ఏదీ అని ఎకసెక్కం చేస్తున్న వారందరికీ ఢిల్లీ నుంచే జాతీయ స్థాయిలోనే కచ్చితమైన జవాబు ముఖ్యమంత్రి హోదాలో జగన్ చెప్పారని అంటున్నారు.

Show comments