సుఖజీవి..పవన్ కళ్యాణ్

చూస్తుంటే పవన్ కళ్యాణ్ అంత సుఖ జీవి మరొకరు లేరేమో? ఎందుకంటే ఇప్పటి వరకు సాగుతున్న పవన్ జీవనాన్ని చూస్తే ఇలాగే అనిపిస్తోంది. పెద్దగా చదువుకోలేదు..చదువు అబ్బలేదు..మొత్తానికి ఏదో జ‌రిగింది. కానీ అప్పటికే అన్న మెగాస్టార్ చాలా కష్టాలు పడి మెట్టు మెట్టు ఎక్కి ఓ స్థాయికి చేరుకున్నారు. దాంతో సినిమా ఎంట్రీ డామ్ ఈజీ అయిపోయింది. చిరు తమ్ముడిగా గుర్తింపు వచ్చింది. మొత్తం మీద పవర్ స్టార్ అయిపోయారు. అంతా దర్శకుల పుణ్యం. ఎందుకంటే తను స్వంతంగా ప్లాన్ చేసుకున్న సినిమాలు అన్నీ బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేసాయి కదా?

వైవాహిక జీవితం సంగతి తెలిసిందే. ఓ బంధం విఫలమై సెటిల్ మెంట్ దారిలో వుండగానే మరో అమ్మాయిని ప్రేమించారు..పెళ్లి చేసుకోకుండానే కాపురం చేసారు. ఈ బంధం ఇలా కొనసాగుతుండగానే మరో బంధం పెంచుకున్నారు. ఇంతటి సుఖం ఎవరికి వస్తుంది చెప్పండి?

సరే..రాజ‌కీయాల్లోకి వచ్చారు. అటు మోడీ..ఇటు బాబు అండతో హడావుడి చేసారు. బాబు హయాంలో వున్న అయిదేళ్లు ఏ సినిమా చేయకుండా, ఏ పనీ చేయకుండా హాయిగా సుఖంగా గడిపేసారు. కావాలనుకున్నపుడల్లా బాబు గారు అరేంజ్ చేసే రెడ్ కార్పెట్ స్వాగతాలు..స్పెషల్ ఫ్లయిట్ లు. అలా అయిపోయాయి అయిదేళ్లు.

ఆ తరువాత ప్లేట్ తిరగబడింది. రాజ‌కీయాల్లో ఓడి పోయారు. జ‌గన్ పవర్ లోకి రావడం వల్లనో, చంద్రబాబు పవర్ లో లేకపోవడం వల్లనో మరి సినిమాలు అవసరం పడినట్లున్నాయి. నాకు డబ్బులు ఎలా వస్తాయి అని ప్రశ్నించడం ప్రారంభించారు. మరి తనంతట తాను సినిమాలు మానేసినపుడు డబ్బులు ఎలా వచ్చాయి అని అడగలేదు ఎవరూ?

సరే మళ్లీ సినిమాల్లోకి వచ్చారు. కోట్లకు కోట్లు అడ్వాన్స్ లు తీసుకున్నారు. సినిమాలు మాత్రం ఇదిగో అదిగో అంటూ వెనక్కు నెడుతూ వస్తున్నారు. ఈ లోగా స్పెషల్ ఫ్లయిట్లు, తిరుగుడు మామూలే. వారాహి వాహనం కావాల్సి వచ్చింది. టీ టైమ్ ఉదయ్ సై అంటూ అన్నీ చూసుకున్నారు. పార్టీ వ్యవహారాలు అన్నీ పవన్ కు ఇబ్బంది లేకుండా నాదెండ్ల మనోహర్ చూసుకుంటున్నారు. సినిమాల డేట్ లు, సినిమా ల కథలు వినడం, సినిమాల వ్యవహారాలు అన్నీ చూసుకోవడానికి త్రివిక్రమ్ వుండనే వున్నారు.

హరిహర వీరమల్లులో భారీ ఫైట్లు..రోప్ స్టంట్ లు అంటే గయ్ మన్నారని బోగట్టా. దాంతో అన్నీ మార్చి, సినిమాను పవన్ కు అనుకూలంగా చేసారు. పీపుల్స్ మీడియా సినిమాలో ఓ పాటా లేదు..ఫైటూ లేదు..అలా అలా నడిచి డైలాగులు చెబితే చాలు. సుజిత్ డైరక్షన్ సినిమాలొ కూడా ఓ పాట కూడా లేదు. ఫైట్లు అంటే గన్ లు పట్టుకుని కాల్చుకుంటూ పోవడం తప్ప, వళ్లు అలిసే ఫైట్లు లేవని టాక్.  అంటే అక్కడా సుఖమే..పెద్దగా కష్టపడకుండానే 50 కోట్లు సినిమాకు జేబులో వేసుకోవచ్చు.

లోకేష్ వళ్లు అలిసేలా పాదయాత్ర చేస్తున్నారు. కానీ పవన్ వారాహిని, ఇతర రవాణా సదుపాయాలను వాడుతూ అప్పుడప్పుడు గుళ్లు గోపురాలు సందర్ళించే పని పెట్టుకున్నారు. పెద్దగా అలసట లేకుండా. రేపు జ‌గన్ గెలిస్తే ఇలాంటి అలసట లేని సినిమాలు చేసుకుంటారు. లేదూ చంద్రబాబు గెలిస్తే ఇక పవన్ కు అంతకన్నా కావాల్సింది ఏముంది?

ఇప్పుడు చెప్పండి..పవన్ కన్నా సుఖ జీవి ఎవరుంటారు?

Show comments