వారసత్వ పాదయాత్రలట...!

ఏపీలో ఆ రెండు పార్టీలకు తాము దూరమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. వైసీపీని టీడీపీని అధికారంలో లేకుండా చేయడమే తమ లక్ష్యమని ఆయన ప్రకటించారు. ఆ రెండు పార్టీలు ఏపీని ఏలాయి కాబట్టే ఇక చాలు అని తాము అంటున్నామని అన్నారు.

ఏపీలో తమ పార్టీ వైసీపీ టీడీపీలకు అసలైన ప్రత్యామ్యాయం అని ఆయన ప్రకటించారు. వారసత్వ రాజకీయాలకు కుటుంబ పార్టీలకు బీజేపీ బహు దూరమని జీవీఎల్ పేర్కొనడం విశేషం. ఏపీలో ప్రస్తుతం పాదయాత్రలు కూడా వారసత్వ రాజకీయాలో భాగంగా సాగుతున్నాయని ఇండైరెక్ట్ గా లోకేష్ ని విమర్శించారు.

తమ పార్టీ జనసేనతో కలసి ఏపీలో మూడవ రాజకీయ పక్షంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. అటు జనసేన ఇటు తామూ క్లారిటీగా ఉన్నామని, మధ్యలో కొందరు మాత్రం అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్నారు అని ఆయన చెప్పడమే విశేషం. రెండు పార్టీలు మంచి మిత్రులుగా ఉంటున్నారని జీవీఎల్ అంటున్నారు.

ఏపీలో కుటుంబ అవినీతి పాలనకు దూరంగా ఉంటూ కొత్త రాజకీయాన్ని అందించాలన్నదే బీజేపీ ఆలోచనగా వివరించారు. భీమవరంలో జరిగిన పార్టీ రాష్ట్ర స్థాయి కార్య‌వ‌ర్గ‌ సమావేశాలలో ఈ విషయాన్ని స్పష్టం చేశామని జీవీఎల్ అంటున్నారు. బీజేపీతో పొత్తుతో ఏపీలో అడుగులు వేద్దామనుకుంటున్న తెలుగుదేశానికి ఈ వ్యాఖ్యలు అయితే ఇబ్బందిగానే మారుతున్నాయి.

తెలుగుదేశం మళ్ళీ ఎందుకు అని బీజేపీ నేతలు అంటున్నారు. జనసేన తమ మిత్ర పక్షం అని వాదిస్తున్నారు. జనసేన నుంచి కూడా ఆ రెండు పార్టీలకు తాము వ్యతిరేకం అని వచ్చినపుడే బీజేపీ ఆశలు నెరవేరుతాయి. కానీ జనసేన ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు. జీవీఎల్ మాత్రం ఇరు పార్టీల‌ మధ్య ఎవరో చిచ్చు పెడుతున్నారు అన్నట్లుగా మాట్లాడడమే విశేషం.

Show comments