వంద రోజులు పూర్తిచేసుకున్న ఆర్ఆర్ఆర్

ఆర్ఆర్ఆర్ సినిమా మరో రికార్డ్ సృష్టించింది. జపాన్ లో ఈ సినిమా వంద రోజులాడింది. జపాన్ లో శతదినోత్సవం జరుపుకున్న తొలి భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించింది ఆర్ఆర్ఆర్.

జపాన్ లో డైరక్ట్ గా 42 కేంద్రాల్లో, షిఫ్టులతో 114 కేంద్రాల్లో ఈ సినిమా వంద రోజులాడింది. ఈ మేరకు థియేటర్ల లిస్ట్ లో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

"ఆ రోజుల్లో ఒక సినిమా వంద రోజులు, 175 రోజులు ఆడడం అనేది చాలా పెద్ద విషయం. రోజులు గడిచేకొద్దీ బిజినెస్ స్ట్రక్చర్ మారిపోయింది. ఆ మధురమైన జ్ఞాపకాలు పోయాయి. కానీ జపనీస్ అభిమానులు ఆ ఆనందాన్ని తిరిగి తెచ్చారు. లవ్ యు జపాన్."

ఇలా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు దర్శకుడు రాజమౌళి. వందరోజుల పండగల్లాంటి పాత జ్ఞాపకాల్ని తిరిగి కళ్లముందు తీసుకొచ్చిన జపాన్ ప్రేక్షకులకు, జపనీస్ భాషలోనే కృతజ్ఞతలు తెలిపాడు.

జపాన్ రిలీజ్ ను ఆర్ఆర్ఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీని కోసం ప్రత్యేకంగా ప్రమోషన్లు ప్లాన్ చేసి మరీ సినిమాను జపనీస్ లో విడుదల చేశారు. అంతేకాదు, స్వయంగా రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ జపాన్ వెళ్లి ప్రచారం చేశారు. స్థానిక మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ తర్వాత వీడియో కాల్ లో రాజమౌళి కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు.

ఇలా భారీగా ప్రచారం చేసి రిలీజ్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా, జపనీయుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచిన సంగతి తెలిసిందే.

Show comments