అత్యాశ, ఈగో, కృతఘ్నత- ఒక ఛానల్ యాంకర్ కథ

అది ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్. ఇంటర్వ్యూలకి ప్రసిద్ధి. అందులో ఎందరో యాంకర్స్ పనిచేసారు, చేస్తున్నారు. అయితే ఒక మధ్యవయస్కుడైన యాంకర్ ఈ ఛానల్లో వివిధ రాజకీయనాయకులను ఇంటర్వ్యూలు చేయడంతో పేరు సంపాదించాడు. ఈ ఛానల్లో చేరక ముందు అతను అనామకుడే. ఎక్కడో వేరే ఊరిలో ఒక సాధారణ విలేకరిగా ఉన్న ఇతనిని ఈ ఛానల్ యజమాని ప్రోత్సహించి హైదరాబాదులోని తన కంపెనీలో కొలువివ్వడం జరిగింది. అయినప్పటికీ ఆ యజమాని పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, తన టాలెంట్ వల్లనే ఆ ఛానల్ కి పేరొచ్చిందనే ధోరణిలో గర్వాన్ని ప్రదర్శించేవాడట. 

ఇదిలా ఉంటే ఈ ఛానల్ కి ఒక కొత్త సీఈవో రావడం జరిగింది. ఛానల్ యజమాని ఆ సీఈవోకి పూర్తి నిర్వహణాధికారాలు ఇవ్వడం సదరు యాంకర్ కి నచ్చలేదు. దాంతో యజమానితో మరింత దురుసుగా మాట్లాడడం, సీఈవో చెప్పినట్టు చేయడానికి ఇగో అడ్డురావడం మొదలైన కారణాలవల్ల ఆ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. 

ఇదే చానల్లో గత కొన్నేళ్ళుగా పని చేస్తున్న ఒక ఫీమేల్ యాంకర్ కి కూడా ఈ సీఈవో రావడం నచ్చలేదు. మొత్తానికి ఈ మధ్యవయస్కుడైన మేల్ యాంకర్, ఈ ఫీమేల్ యాంకర్ కలిసి వెంటనే మరొక చిన్న యూట్యూబ్ చానల్లో చేరారు. ఛానల్ కి పేరు లేకపోయినా జీతాలు మాత్రం ఎక్కువే కావడంతో రెక్కలు గట్టుకుని అక్కడ వాలారన్నమాట. 

అయితే నెల తిరక్కుండా అక్కడ కూడా ఇద్దరికీ కొలువు పోయింది. కారణమేంటని ఆరా తీస్తే ఆ ఛానల్ యజమానిని సదరు మేల్ యాంకర్ గెస్ట్ హౌస్, కార్ ఏర్పాటు చేయమని డిమాండ్ చేసాడట. అంతే కాకుండా గెస్టుల దగ్గర పెయిడ్ ఇంటర్వ్యూ అని చెప్పి డబ్బులు తీసుకుని జేబులో వేసుకోవడం మొదలుపెట్టాడట. ఈ మొత్తానికి విసుగెత్తి ఛానల్ నుంచి గెంటేసారు. ఇతనితో పాటు లేడీయాంకర్ని కూడా జీతానికి తగ్గ ఫలితం వ్యూవర్షిప్పులో కనిపించడంలేదని సాగనంపారట. 

ఆ వెంటనే ఈ యంకర్ ద్వయం మరొక యూట్యూబ్ ఛానల్ లో రూ3 లక్షలు, రూ 2 లక్షలు జీతాలకు చేరడానికి మధ్యవర్తి ద్వారా ప్రయత్నించారు. ఆ ఛానల్ యజమాని "నో" చెప్పడంతో ఇప్పుడు ఈ మధ్యనే బాగా పేరు పొందుతున్న మరొక ఛానల్లో చేరారట. ఇలా ఉన్నచోట కొలువు పోగొట్టుకుని ప్రతి ఛానల్ గుమ్మం తొక్కుతూ వీళ్లకున్న గుర్తింపుకి మచ్చ తెచ్చుకుంటున్నారని అంటున్నారు చూస్తున్నవారు. 

ఏది ఏమైనా ఎన్నికల సీజన్లో తనకి చాలా డిమాండ్ ఉంటుందని, ఎన్ని లక్షలడిగినా ఛానల్ యజమానులు పే చేస్తారనే ఆలోచనలో మేల్ యాంకర్ ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఇతను తనని తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నాడని మీడియా వర్గాలు నవ్వుకుంటున్నాయి.

Show comments