మ‌రో స్టార్ క్రికెట‌ర్ బ‌యోపిక్ కి గ్రీన్ సిగ్న‌ల్!

బాలీవుడ్ నుంచి మ‌రో క్రికెట్ బ‌యోపిక్ రాబోతోంది. ఇప్ప‌టికే స‌చిన్ జీవితం పై డాక్యుమెంట‌రీ, మ‌హేంద్ర సింగ్ ధోనీ బ‌యోపిక్, అజ‌ర్, ఇంకా 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ విన్ పై ఒక సినిమా వ‌చ్చింది. ఈ పరంప‌ర‌లో మ‌రో భార‌త స్టార్ క్రికెట‌ర్, మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌర‌వ్ గంగూలీ బ‌యోపిక్ రూప‌క‌ల్ప‌న‌కు రంగం సిద్ధం అవుతోంది.

ఇప్ప‌టికే గంగూలీ త‌న బ‌యోపిక్ కు సంబంధించిన స్క్రిప్ట్ ను కూడా ఓకే చేసిన‌ట్టుగా తెలుస్తోంది. ముంబైలో ఒక యూనిట్ తో కూర్చుని గంగూలీ త‌న బ‌యోపిక్ పై చ‌ర్చోప‌చ‌ర్చ‌ల‌ను సాగించిన‌ట్టుగా స‌మాచారం. ఈ క్ర‌మంలో బ‌యోపిక్ కు స్క్రిప్ట్ అంతా ఓకే అయిన‌ట్టుగా స‌మాచారం. 

ఈ సినిమాను భారీ ఎత్తున రూపొందించ‌నున్నార‌ట‌. దీని బ‌డ్జెట్ రెండు వంద‌ల నుంచి 250 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. బాలీవుడ్ న‌టుడు ర‌ణ్ బీర్ క‌పూర్ తో టైటిల్ రోల్ చేయించ‌నున్నార‌ట‌. గంగూలీగా ర‌ణ్ బీర్ ను తెర‌పై చూపించ‌నున్నార‌ని తెలుస్తోంది. 

అయితే క్రికెటింగ్ బ‌యోపిక్ లు ఏమంత ఆక‌ట్టుకోని స‌మ‌యం ఇది. అజ‌ర్ బ‌యోపిక్ ఆడ‌లేదు. ఇక 1983 బ‌యోపిక్ పై చాలా పాజిటివ్ రివ్యూలు వ‌చ్చినా ఆ సినిమా అంచ‌నాల‌కు త‌గిన విజ‌యాన్ని న‌మోదు చేయ‌లేక‌పోయింది. చాలా ప్ర‌శంస‌లు వ‌చ్చినా ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ కాలేదు. మ‌రి ఇలాంటి నేపథ్యంలో గంగూలీ బ‌యోపిక్ వ‌స్తున్న‌ట్టుగా ఉంది.

గంగూలీ లైఫ్ లో అప‌రిమిత‌మైన డ్రామా లేక‌పోయిన‌ప్ప‌టికీ.. మ్యాచ్ ఫిక్సింగ్ కుదుపుల్లో టీమిండియా కెప్టెన్సీని చేప‌ట్టి విజ‌య‌వంత‌మైన కెప్టెన్ గా నిల‌వ‌డం, ఆ త‌ర్వాత కెప్టెన్సీని, జాతీయ జ‌ట్టులో చోటును కూడా కోల్పోవ‌డం, మ‌ళ్లీ జ‌ట్టులోకి రావ‌డంతో స‌హా ఆస‌క్తిదాయ‌క‌మైన విశేషాలు అయితే ఉన్నాయి. మ‌ల‌చాలే కానీ సినిమాకు స‌రిప‌డిన స‌రంజామానే ఇది!

Show comments