మోడీ మీద ఎర్రన్న ఫైర్

ఈ రోజు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ ఒకనాడు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తొలిసారి సీఎం గా ఉన్నపుడు గోద్రా అల్లర్లు జరిగాయి. అయితే దాని మీద న్యాయ విచారణ జరిగింది. నాటి అల్లర్లకు ప్రభుత్వం బాధ్యత లేదని పేర్కొంది.

ఇదిలా ఉండగా గుజరాత్ అల్లర్ల వెనక అంటూ బీబీసీ ఒక డాక్యుమెంటరీని తీసి రిలీజ్ చేసింది. దానిని భారత లో ప్రసారం కాకుండా మోడీ సర్కార్ నిషేధించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. అది వారి వెర్షన్ గా చూడాలి తప్ప అందులో ఏమీ లేకపోతే నిషేధించడం ఎందుకు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దీని మీద సీపీఎం పోలిట్ బ్యూరో మెంబర్ బీవీ రాఘవులు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం డాక్యుమెంటరీని నిషేదించడం దారుణం అని ఫైర్ అయ్యారు. గుజరాత్ అల్లర్ల మీద ఏమి జరిగింది అన్నది డాక్యుమెంటరీలో ఉందని, దాన్ని ఎవరూ చూడకుండా చేయాలనుకోవడం అన్యాయమని అన్నారు.

ప్రజాస్వామిక విధానానికి ఇది గొడ్డలి పెట్టు అని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విభజన హామీలతో పాటు ప్రత్యేక హోదా మీద కేంద్రం సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు.

తెలుగుదేశం నేత నారా లోకేష్ పాదయాత్ర చేయడం మంచిదే అని ఎవరైనా ప్రజలలోకి వెళ్ళడమే తాము కోరుకుంటున్నామని, ప్రజా సమస్యలు ఆ విధంగా తెలుస్తాయని బీవీ రాఘవులు అభిప్రాయపడ్డారు. ఇప్పటిదాకా సీపీఐ మాత్రమే తెలుగుదేశానికి మద్దతుగా ఉంటూ వస్తోంది. ఇపుడు జీవో నంబర్ వన్ విషయంలో వైసీపీ ప్రభుత్వం మీద సీపీఎం విమర్శలు చేయడం ద్వారా తెలుగుదేశంతో వామపక్షాల పొత్తుకు సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.

Show comments