50 నిమిషాలు...ఊపిరి బిగ‌ప‌ట్టిన టీడీపీ!

కుప్పం కేంద్రంగా టీడీపీలో కొత్త అంకం మొద‌లైంది. చంద్ర‌బాబు వార‌సుడిగా నారా లోకేశ్ దాదాపు అధికారికంగానే పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టారు. కుమారుడి ప‌ట్టాభిషేకాన్ని రిమోట్ కంట్రోల్‌తో హైద‌రాబాద్ నుంచే చంద్ర‌బాబు న‌డిపించారు. యువ‌గ‌ళం పేరుతో లోకేశ్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో చిన్న అప‌శ్రుతి త‌ప్ప‌, మిగిలిందంతా టీడీపీ అనుకున్న‌ట్టే విజ‌య‌వంతంగా జ‌రిగింది. మొద‌టి రోజు పాద‌యాత్ర ముగిసిన త‌ర్వాత జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో లోకేశ్ ప్ర‌సంగంపై అంద‌రి దృష్టి ప‌డింది.

అనుకున్న ప్ర‌కార‌మే స‌భ మూడు గంట‌ల‌కు మొద‌లైంది. మొద‌ట‌గా ప్ర‌సంగించిన ఉర‌వ‌కొండ ఎమ్మెల్యే ప‌య్యావుల కేశవ్ పాద‌యాత్ర‌లో ఎలా న‌డుచుకోవాలో లోకేశ్‌కు హిత‌వ‌చ‌నాలు చెప్పారు. ప్ర‌తిప‌క్షాలు విసిరే విమ‌ర్శ‌ల రాళ్ల‌ను ఉన్న‌తికి వాడుకోవాల‌ని సూచించారు. అలాగే ఉలి దెబ్బ‌కు గురైతేనే శిల శిల్ప‌మ‌వుతుంద‌ని, అలాగే ప్ర‌తిప‌క్షాల నుంచి ఎదుర‌య్యే విమ‌ర్శ‌లు, అడ్డంకుల‌ను ఎదుర్కొని స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కుడిగా తీర్చిదిద్దుకోవాల‌ని పెద్ద‌న్న‌గా మార్గ‌నిర్దేశం చేశారు.

ఆ త‌ర్వాత మాట్లాడిన మాజీ మంత్రి అమ‌ర్నాథ్‌రెడ్డి ప్ర‌సంగంలో కొత్త‌ద‌నం క‌నిపించ‌లేదు.ఇక అచ్చెన్న ప్ర‌సంగం విష‌యానికి వ‌స్తే.... మాట్లాడిన‌ట్టు కాకుండా ఏడ్చిన భావ‌న క‌లిగించింది. ఒక‌ట్రెండు మాట‌లు భ‌లే న‌వ్వు తెప్పించాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌లాంటి సైకో ముఖ్య‌మంత్రిని ఎదుర్కోవాలంటే యువ నాయ‌కుడు లోకేశే స‌రైన మొగ‌డ‌ని అచ్చెన్న చెప్పిన‌ప్పుడు స‌భ‌లో న‌వ్వులు పూయించాయి. అనంత‌రం పాద‌యాత్రికుడు, టీడీపీ ఆశాకిర‌ణం లోకేశ్ ప్ర‌సంగాన్ని మొద‌లు పెట్టారు. దీంతో టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఊపిరి బిగ‌పట్టి ప్ర‌సంగాన్ని విన‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

ఈ స‌మ‌యంలో ఎలా మాట్లాడ్తారో, గ‌తంలో మాదిరిగా త‌ప్పులో కాలేస్తారేమో అన్న ఆలోచ‌న‌లు, భ‌యాలు, అనుమానాలు మ‌న‌సుల్లో చోటు చేసుకున్నాయి. కుప్పం అనేది టీడీపీ కంచుకోట అని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్పారాయ‌న‌. యువ‌గ‌ళం అని ప్ర‌క‌టించ‌గానే వైసీపీ నేత‌ల ప్యాంట్లు త‌డిశాయ‌న్నారు. తాను మంత్రిగా ఉన్న‌ప్పుడు వేలాది ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించానన్నారు. ఒక్క చాన్స్ అంటూ అధికారాన్ని ద‌క్కించుకున్న జ‌గ‌న్ పాల‌న వ‌ల్ల రాష్ట్రం 67 ఏళ్లు వెన‌క్కి వెళ్లింద‌ని విమ‌ర్శించారు.

జ‌గ‌న్‌రెడ్డి అంటే జాదూరెడ్డిగా అభివ‌ర్ణించారు. జ‌గ‌న్ పాల‌న‌లో ప‌రిశ్ర‌మ‌లు ప‌క్క రాష్ట్రాల‌కు త‌ర‌లిపోయాయ‌ని, డీజిల్‌, పెట్రోల్, గ్యాస్ ధ‌ర‌లు పెరిగిపోయాయ‌ని తూర్పార ప‌ట్టారు. జ‌గ‌న్ జాబ్ క్యాలెండ‌ర్‌లో జాబ్‌లు ఉండ‌వ‌ని ఎద్దేవా చేశారు. అభివృద్ధి వికేంద్రీ క‌ర‌ణ అంటే ఏంటో త‌మ పాల‌న‌లో రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్రాంతాలకు తీసుకొచ్చిన ప‌రిశ్ర‌మ‌లు, వివిధ ప‌నుల గురించి వివ‌రించారు.

మూడు రాజ‌ధానులంటున్న జ‌గ‌న్ ఈ మూడేళ్ల ఎనిమిది నెల‌ల కాలంలో క‌నీసం ఒక్క ఇటుక రాయి అయినా వేశారా? అని నిల‌దీశారు. తాను త‌ల్లి, చెల్లిని గెంటేసేవాడిని కాద‌ని ఎద్దేవా చేశారు. అలాగే త‌న‌కు చీర‌, గాజులు పంపిస్తాన‌ని మంత్రి రోజా అనడాన్ని ఆమె పేరు ప్ర‌స్తావించ‌కుండా త‌ప్పు ప‌ట్టారు. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన విమ‌ర్శ‌నే రోజాపై లోకేశ్ రిపీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. డైమండ్ రాణిగా రోజానుద్దేశించి అన్నారు.  

ఈ సంద‌ర్భంగా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మ‌ద్ద‌తుగా లోకేశ్  మాట్లాడారు. ప‌వ‌న్ ప్ర‌చార యాత్ర వారాహిని అడ్డుకుంటామంటున్నార‌ని , అది జ‌ర‌గ‌ని ప‌ని అని ఆయ‌న హెచ్చ‌రించారు. ప‌వ‌న్ వారాహి, అలాగే యువ‌గ‌ళాన్ని అడ్డుకోవ‌డం ఎవ‌రి వ‌ల్ల కాద‌ని ఆయ‌న స‌భావేదిక మీద నుంచి వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌సంగం అనంత‌రం ఆయ‌న స‌మ‌ర‌శంఖాన్ని పూరించారు.

ఇదిలా వుండ‌గా 50 నిమిషాల ప్ర‌సంగంలో లోకేశ్ ఎక్క‌డా త‌డ‌బ‌డ‌లేదు. తాను చెప్ప‌ద‌లుచుకున్న‌ది ధాటిగా, సూటిగా ఆవిష్క‌రించారు. లోకేశ్ ప్ర‌సంగం అసాంతం ఎలాంటి త‌ప్పుల‌కు తావు లేకుండా సాగించ‌డం విశేషం. లోకేశ్ ప్ర‌సంగం పూర్తి అయిన త‌ర్వాత హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకున్నారు. మొద‌టి రోజు సినిమా స‌క్సెస్ అని టీడీపీ శ్రేణులు సంబ‌ర‌ప‌డుతున్నాయి. యువ‌గ‌ళం మొద‌టి రోజు సినిమా ఫ‌ర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంది. లోకేశ్ నుంచి ఈ మాత్రం ఫ‌ర్మామెన్స్ వుంటే, జ‌గ‌న్‌ను ఢీకొట్టామని టీడీపీ ధీమాగా చెబుతోంది.

Show comments