నాదెండ్ల మనసులో మాట!

మొన్నటివరకు టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకోవాలని అనుకుంది. కానీ ప్రధాని నరేంద్ర మోడీ విశాఖపట్టణానికి వచ్చి పవన్ కళ్యాణ్ తో చర్చలు జరపడంతో సీన్ మారిపోయింది. విశాఖలో ప్రధాని నరేంద్రమోడీతో అరగంట భేటీ తర్వాత పవన్ కల్యాణ్ స్వరంలో మార్పు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 

భేటీ తర్వాత పాల్గొన్న కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ తనకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పలు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. అంటే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు లేనట్లేనని భావిస్తున్నారు. విజయవాడలో చంద్రబాబుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నప్పుడు, ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో ఓటు చీలనివ్వనని, వైసీపీని గెలవనివ్వనని పదే పదే పవన్ ప్రకటించారు.

కానీ మోడీతో భేటీ తర్వాత స్వరంలో మార్పు వచ్చింది. అయితే పవన్ స్వరంలో మార్పు రావడం జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు నచ్చడం లేదట. ప్రధానమంత్రి చెప్పిన విషయం ఆయనకు నచ్చలేదట. మనోహరే కాకుండా పార్టీలోని మరో ఐదుగురు సీనియర్ నేతలు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకోకపోవడం తమకు నచ్చలేదని పవన్ కల్యాణ్ తో కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారని సమాచారం. 

జనసేనకు గత ఎన్నికల్లో 6 శాతం ఓటింగ్ వచ్చింది. ఎన్నికల వరకు ఇలాగే నిరంతరం పోరాటం చేసుకుంటా వస్తే 12 శాతానికి రావొచ్చనేది మనోహర్ అంచనా. 

రాష్ట్రంలో జనసేన కూడా అధికారంలో పాలుపంచుకోవాలి.. పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపించాలనుకుంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే మంచిదని చెప్పారట. ఎందుకంటే....బీజేపీకి రాష్ట్రంలో కనీసం ఒకశాతం ఓటు బ్యాంకు కూడా లేదని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని వెళ్లడంవల్ల వైసీపీని గెలిపించినట్లవడమే కాకుండా జనసేన కూడా అసెంబ్లీకి అవసరమైన స్థానాలను సాధించడం అనుమానమేనని మనోహర్ అభిప్రాయపడుతున్నారు. 

ప్రస్తుతానికి తెలుగుదేశం, జనసేన విడివిడిగా ప్రచారం చేసుకొని ఎవరికి వారుగా సొంతగా బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరకొచ్చిన తర్వాతే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరబోతోందని జనసేన వర్గాలు అంటున్నాయి. 

రాబోయే ఎన్నికలు వైసీపీకి, టీడీపీకి ఎంత కీలకమో జనసేనకు కూడా అంతే కీలకమని, పది సంవత్సరాలుగా అధికారం లేక శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నారని, బీజేపీతో పొత్తుతో మరో ఐదు సంవత్సరాలు అధికారం లేకుండా ఉండాలంటే పార్టీని నిలబెట్టడం కష్టమని నాదెండ్ల సలహా ఇచ్చినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. దీంతో ఎన్నికల చివరి సమయంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. 

నాదెండ్ల మనసులో టీడీపీతో కలిసి వెళితేనే ప్రయోజనం కలుగుతుందని ఉంది. జనసేనకు ఉన్నంత బలం కూడా బీజేపీకి లేదన్నది వాస్తవమే. మరి పవన్ బీజేపీని కాదని టీడీపీతో వెళ్లగలడా? 

Show comments