షర్మిలని చూసి పవన్ కళ్యాణ్ కి చాకిరేవు

రాజుని చూసి మొగుడ్ని మొత్తబుద్ధయ్యిందని సామెత. అదేంటో గానీ తెలంగాణాలో షర్మిలని చూసి ఆంధ్రాలో పవంకళ్యాణ్ కి చాకిరేవు పెడుతున్నారు నెటిజెన్లు. 

రాజకీయాలకు ప్రాధమికంగా కావాల్సింది తెగువ, పోరాటపటిమ. అంతే తప్ప ప్యాకేజీ పుచ్చుకుని పక్కనోడు ఇచ్చిన స్క్రిప్టు చదవడం కాదు. ఏవన్నా అంటే "తాటతీస్తా" అనే డయలాగు తప్ప మరొకటి రాదు. నాయనా పవన్! నువ్వు పవర్లోకి వస్తే వైసీపీవాళ్ల తాట తీస్తానంటున్నావు. ఇప్పుడు వాళ్లు పవర్లో ఉన్నారు కాబట్టి నీది తీస్తారు..తీయించుకో. తప్పేముంది? 

అదల ఔంచితే గత రెండు రోజులుగా ఏ మీడియా సపోర్ట్ లేకపోయినా షర్మిలకొస్తున్న మైలేజ్ ఇంతా అంతా కాదు. 

ఆమె చేసిన ఒక సాధారణ లంచగొండి ఆరోపణకి ఒక ఎమ్మెల్యే అనుచరులు ఆమెపై దాడి చేసి బెదరగొట్టబోయారు. ముఖంపై గాయాలుకూడా చేసారు. బస్సుని, కారుని ధ్వంసం చేసారు. అయినప్పటికీ ఆమె బెదరకపోగా ఆ దెబ్బతిన్న వాహనాల్ని స్వయంగా తానే ప్రగతిభవన్ కి తీసుకెళ్ళే క్రమంలో మార్గమధ్యంలో అరెస్టయ్యింది. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండుకి పంపడానికి రంగం సిద్ధం చేసారు పోలీసులు. ఆయినా ఆమె కాస్త కూడా బెదరట్లేదు. 

అసలామె పార్టీ విధానాలు కానీ, ఆమె స్పీచులు గానీ జనాన్ని ఇంకా చేరలేదు. ఎందుకంటే తెలంగాణాలో ఉన్న మీడియాలన్నీ అధికారపార్టీకి వ్యతిరేకంగా మరొకరికి మైలేజీ ఇవ్వాలంటే భయపడే పరిస్థితి. ఆ రాష్ట్రంలో ఉన్నది అప్రకటిత రాజరిక పాలన. ప్రజాస్వామ్య ముసుగులో అక్కడ జరుగుతున్నదంతా ఎవరన్నా నోరు లేపితే దాడి చేయడమే. ఆ మధ్యన కె.ఎ.పాల్ మీద కూడా ఒక తెరాసావాది వీడియో సాక్షిగా చేయి చేసుకున్నాడు. 

ఫలానా వ్యక్తి తెలంగాణా రాజకీయాలని ప్రభావితం చేసేదీ లేనిదీ అనవసరం..దాడులు మాత్రం జరిగిపోతాయంతే. 

అటువంటి పరిస్థితుల్లో కూడా వై.ఎస్ షర్మిల చూపిస్తున్న తెగువ ఆశ్చర్యపరుస్తోంది. 

రోజూ సాధన చేసే వ్యక్తి ఎప్పుడో అప్పుడు సిద్ధిని పొందుతాడు... అది ఏ రంగంలో అయినా సరే. పోరాట పటిమని చూపిస్తేనే కేసీయారైనా, జగన్ మోహన్ రెడ్డి అయినా, అరవింద్ కెజ్రీవాల్ అయినా పాలకులు కాగలిగారు. ఆ దిశలో తన యుద్ధం తాను చేస్తున్న మహిళానాయకురాలు షర్మిల. రెండ్రోజులుగా అమెకొస్తున్న పొలిటికల్ మైలేజ్ ఆమెకు మంచి పునాది వేసిందని చెప్పాలి. ఈ పునాదిపై ఆమె తన రాజకీయ భవిష్యత్తుని నిర్మించుకోవాలి. గెలుపోటములు పక్కన పెట్టి జనం ఆమె వైపుకు తిప్పుకునేలా చేయగలుగుతోంది షర్మిల. 

ఇదంతా పవన్ కళ్యాణ్ కి పాఠం. అతను కనీసం ఒక్క పోరాటం కూడా సరిగ్గా చేయలేదు. ఒక్క దెబ్బ తినలేదు. కనీసం జైలు మొహం చూడలేదు. రాజకీయాల్లో ఇవి జరక్కుండా జనం దృష్టిని ఆకర్షించడం కాని పని. ప్రత్యర్ధి దాడి చేసినప్పుడే అసలు సత్తా బయటపడేది. జైలుకెళితేనే నాయకుడి చిత్తశుద్ధి జనానికి అర్ధమయ్యేది. 

ఈ విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ మధ్యన ఒక ఉదంతం తెలిపారు. పీవీ నరసింహారావు తనపై ఉన్న కేసుల విషయంలో విచారంగా ఉండేవారట. బైలు వస్తుందో రాదో అని నిద్రకూడా పట్టేది కాదట. ఆ సమయంలో ఉండవల్లి ఆయనకు "బెయిల్ రిజెక్ట్ చేసి జైలుకెళ్లిపోండి" అని సలహా ఇచ్చారట. పీవీ ప్రశ్నార్ధకంగా చూస్తే ఇందిరాగాంధి జైలుకెళ్ళి వచ్చాక ఆమెకు ఎలా కలిసొచ్చిందో చెప్పారట. 

ఇవన్నీ చరిత్ర పాఠాలు. జనమెప్పుడూ విక్టిం కి సానుభూతి చూపిస్తారు. 

ఇక్కడ నిజానికి షర్మిల చేసిన పెద్ద నేరమేమీ లేదు. కేవలం లంచగొండి ఆరోపణ మాత్రమే చేసింది. అది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. అంత మాత్రానికే ఒక మహిళా పార్టీ అధినేత్రి మీద ఈ రేంజులో హింసకి పాల్పడడం తెరాసాకి తలవొంపే. 

ఇక్కడ గమనించదగ్గ అంశం మరొకటి ఉంది. షర్మిల కులం కార్డ్ ఎక్కడా వాడట్లేదు. పవన్ కళ్యాణ్ ఆంధ్రలో రెడ్ల పాలన అని ఏడుస్తున్నట్టు షర్మిల కేసీయార్ వెలమదొరల పాలన అంటూ ఎద్దేవా చేయట్లేదు. పవన్ కళ్యాణ్ ది కులం ప్రస్తావన లేని ప్రస్థానం కానే కాదు. కాసేపు తనని తాను కాపునాయకుడిగా అభివర్ణించుకుంటాడు, ఇంకాసేపు ఫూలే... అంబేద్కర్ పేర్లు చెబుతూ ఏదో దళితజనోద్ధారకుడిలాగ బిల్డప్ ఇస్తాడు. ఏమీ తోచకపోతే రెడ్లను ఎత్తి చూపుతాడు. 

చేసేది వారాంతరాజకీయాలు...కూసేవి పిట్టలదొర కూతలు..ఇదే పవన్ కళ్యాణ్ తంతు. షర్మిలని చూసైనా రాజకీయాల్లో ఓనమాలు దిద్దుకుంటాడేమో చూడాలి. తెదేపా అనుకూల మీడియా ఉంది కాబట్టి అతనొకడు రాజకీయాల్లో ఉన్నాడని జనానికి తెలుస్తోంది కానీ లేకపోతే ఎప్పుడో దిక్కులేని చిన్నబడ్జెట్ సినిమాలాగ అనామకంగా మిగిలిపోయేవాడు ఆంధ్ర రాజకీయాల్లో. 

హరగోపాల్ సూరపనేని

Show comments