షర్మిలను పెద్ద నాయకురాలిని చేస్తున్న గులాబీ పార్టీ!

ఏ రాజకీయ నాయకుడికైనా పొలిటికల్ మైలేజ్ రావాలంటే వివాదాలు ఉండాలి. సబ్జెక్ట్ లో కాన్ఫ్లిక్ట్  ఉంటేనే తాను సినిమా తీస్తానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అంటుంటారు. అలాగే వివాదాలు, ఘర్షణలు, విమర్శలు, వాద ప్రతివాదాలు లేకుంటే రాజకీయాల్లో మజా ఏముంటుంది. ఇలాంటివాటి కారణంగానే కొందరు నాయకులు పెద్ద లీడర్లు అయిపోతారు. కొంతకాలం కిందట వైఎస్ షర్మిల తెలంగాణా రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఆమెను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోలేదు. తెలంగాణలో ఆమెకేం పని అని, ఏపీలో రాజకీయాలు చేసుకోవాలని అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్రంగా దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నాయకులైతే  తెలంగాణను దోచుకోవడానికి ఆంధ్రా నాయకులు మళ్ళీ వస్తున్నారని విమర్శించారు. కానీ షర్మిల మాత్రం తాను ఇక్కడే రాజకీయాలు చేస్తానని, తాను తెలంగాణా కోడలినని చెప్పారు. 

వాస్తవానికి ఆమె పార్టీ పెట్టి చాలాకాలమైనా పేరున్న నాయకులెవరూ ఆమె పార్టీలో చేరలేదు. పైగా ఉన్నవాళ్లు కొందరు వెళ్లిపోయారు కూడా. అయితే కాలక్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు షర్మిలకు అనవసరమైన ప్రాధాన్యం ఇచ్చి ఆమెను పెద్ద నాయకురాలిగా చేస్తున్నారని చెప్పుకోవాలి. ఆమె పార్టీ పెట్టిన కొత్తలో నిరుద్యోగ సమస్య మీద ఆందోళన చేశారు. అందులో భాగంగా మూడు రోజులు ఇందిరా పార్కు దగ్గర నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. రెండురోజులు దీక్ష చేశాక మూడో రోజు బలవంతంగా అక్కడి నుంచి తరలించి ఇంటికి పంపారు. దీంతో ఆమె ఈ ఎపిసోడ్ ను తన రాజకీయానికి వాడుకున్నారు. కొన్నాళ్లుగా షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ మూడువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర సాగింది.

ఈ పాదయాత్ర సందర్భంగానే వచ్చే ఎన్నికల్లో అధికారం తనదే అని చెప్పుకుంటున్నారు.  ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు. కొందరు నాయకుల మీద కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో వరంగల్ జిల్లాలో ఆమె పాదయాత్రను టీఆర్ఎస్ నాయకులు అడ్డుకొని కాస్త హింసాత్మకంగా వ్యవహరించారు. దీంతో ఈ టాపిక్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో షర్మిల యాత్రకు ప్రతిష్టంభన నెలకొంది. సీఎం చంద్రశేఖర్ రావు తో పాటు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని ఆమె ఘాటుగా విమర్శించారు. అనేక ఆరోపణలు ఎక్కుపెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన గులాబీ శ్రేణులు నర్సంపేట సమీనంలో షర్మిల ఫ్లెక్సీలకు నిప్పంటించడంతో పాటు ఆమె సేదతీరే వాహనాన్ని (కారవాన్) కూడా తగలబెట్టే ప్రయత్నం చేసారు.

దీంతో పరిస్ధితి అదుపుతప్పే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు వైయ‌స్ ష‌ర్మిల‌ అదుపులోకి తీసుకుని లోటస్ పాండ్ లోని తన నివాసంలో విడిచిపెట్టారు. దీంతో హోరా హోరీగా సాగుతున్న కమలం-గులాబీ రాజకీయాల్లోకి షర్మిల  ఊహించని ఎంట్రీ ఇచ్చినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరంగల్ ఘటన తరువాత ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన షర్మిలను మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె కారులో కూర్చుని కిందకు దిగేందుకు నిరాకరించడంతో కారుతో సహా క్రేన్ సాయంతో లిఫ్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. పాదయాత్రలో పాల్గొన్న ఓ వాహనానికి నిప్పు పెట్టడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. షర్మిల ఈ రోజు ఆ వాహనాలు తీసుకుని ప్రగతి భవన్‌కు బయలుదేరారు. ధ్వంసమైన కారును స్వయంగా నడుపుకుంటూ షర్మిల ప్రగతి భవన్‌వైపు వచ్చారు.

పంజాగుట్ట వద్ద వాహనాలను అడ్డు పెట్టి పోలీసులు షర్మిల వాహనాలను నిలిపివేశారు. పంజాగుట్ట - సోమాజిగూడ మార్గంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. షర్మిలను కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే కారు అద్దాలను క్లోజ్ చేసి షర్మిల అందులోనే కూర్చోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ కారణంగా ఆ దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు వెంటనే రోడ్డుపైన ఆగిపోయిన వాహనాలను తరలించే క్రేన్‌ను తీసుకు వచ్చి..కారును లిఫ్ట్ చేశారు. అప్పటికీ షర్మిల కిందకు దిగలేదు. కారులో షర్మిల ఉండగానే పోలీసులు కారును తరలించారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించిన వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉదయమే లోటస్ పాండ్‌లో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 

ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలు పిలుపునివ్వడంతో షర్మిల బయటకు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పదకొండు గంటల సమయంలో అనూహ్యంగా పోలీసుల కళ్లు కప్పి లోటస్ పాండ్ నుంచి బయటకు వచ్చిన షర్మిల... స్వయంగా కారు నడుపుకుంటూ పంజాగుట్ట వైపు వచ్చారు. ఆమెతో.. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన కారవాన్‌ను ఆమె ప్రగతి భవన్‌కు తీసుకెళ్లాలనుకున్నారు. ఆదివారం 3,500 కిలోమీటర్లు పాదయాత్ర  పూర్తి చేసుకున్న షర్మిల పాదయాత్రకు వరంగల్​ జిల్లా నర్సంపేట నియోజకవర్గం శంకరమ్మ తండా వద్ద బ్రేక్ పడింది. షర్మిల పట్ల టీఆరెస్ నాయకులు కానీ, ప్రభుత్వంగానీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారేమో అనిపిస్తోంది. ఆమె పాదయాత్రకు ఆటంకం కలిగించకుండా ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు. గులాబీ పార్టీయే ఆమెను పెద్ద నాయకురాలిని చేస్తోందా? 

Show comments