డిసెంబర్ అంతా ఉత్తరాంధ్రాలోనే....

డిసెంబర్ నెల వస్తోంది. ఏపీ సీఎం జగన్ తాడేపల్లి టూ ఉత్తరాంధ్రా అన్నట్లుగా వరస టూర్లకు ఈ నెల వేదిక అవుతోంది అంటున్నారు. డిసెంబర్ 4న తూర్పు నావికాదళం నిర్వహించే నేవీ డేకి సీఎం జగన్ హాజరవుతున్నారు. నావికాదళం నాడు ప్రదర్శించే విన్యాసాలను ఆయన తిలకిస్తారు. అది మొదటి పర్యటన అనుకుంటే ఆ తరువాత డిసెంబర్ మొదటి వారంలోనే నర్శీపట్నంలోని మాకవరపాలేంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు సీఎం శంకుస్థాపన చేస్తారు.

కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ప్రారంభిస్తారు. ఆ మీదట విజయనగరం జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు మరో దఫా ఆయన టూర్ వేస్తారు. ఈ సందర్భంగానే భోగాపురం ఎయిర్ పోర్టుకు శంకుస్థాపనతో పాటు విజయనగరంలో గిరిజన విశ్వ విద్యాలయం భనన నిర్మాణం పనులను కూడా ప్రారంభిస్తారు అని తెలుసోంది.

శ్రీకాకుళం జిల్లాకు మరోసారి డిసెంబర్ నెలలో సీఎం రాబోతున్నారు. ఇప్పటికే భూసేకరణ ఒక కొలిక్కి వచ్చి అన్నీ సిద్ధం అయిన భావనపాడు పోర్టుకి జగన్ శంకుస్థాపన చేస్తారు అని అధికార వర్గాలు తెలిపాయి. 

వీటితో పాటు మరిన్ని కార్యక్రమాలను కూడా ఉత్తరాంధ్రాలో ప్రారంభించేందుకు సీఎం ఉత్తరాంధ్రా టూర్లు ఉంటాయని అంటున్నారు. ఇదే నెల ఆఖరులో విశాఖ ఉత్సవ్ లో సీఎం జగన్ పాలు పంచుకోవడం ద్వారా 2022 కి అందమైన ముగింపుని ఇస్తారని అంటున్నారు.

Show comments