అవతార్-2.. నార్త్-సౌత్ మధ్య ఇంత తేడా ఎందుకు?

జేమ్స్ కామరూన్ అద్భుత సృష్టి అవతార్. ఇప్పుడీ సినిమాకు పార్ట్-2 సిద్ధమైంది. డిసెంబర్ లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగా చాలా ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.

ఇటు ఇండియాలో కూడా అవతార్-2 (ది వే ఆఫ్ వాటర్)పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా, వెంటనే చూసేద్దామనే ఉత్సుకత చాలామందిలో కనిపిస్తోంది. అయితే ఈ ఉత్సుకత ఉత్తరాదిన చాలా తక్కువగా, దక్షిణాన చాలా ఎక్కువగా కనిపించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అవును.. అవతార్-2 సినిమాపై ఉత్తరాది ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. దానికి పూర్తి రివర్స్ లో దక్షిణాదిన ఈ సినిమాపై చాలా క్రేజ్ నడుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి.

అవతార్ లాంటి విజువల్ వండర్ ను త్రీడీ, 4డీఎక్స్ లాంటి ఫార్మాట్స్ లో చూసేందుకు దక్షిణాది ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని 4డీఎక్స్+3డీ స్క్రీన్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే, అన్ని టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ స్క్రీన్స్ లో 6 రోజుల వరకు ఏ షోకు టికెట్లు అందుబాటులో లేవు. సాధారణ స్క్రీన్స్ లో బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు.

ఇదే ఊపు చెన్నైలో కూడా కనిపించింది. త్రీడీ, ఐమ్యాక్స్ త్రీడీ స్క్రీన్స్ బుకింగ్స్ లో 70శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక బెంగళూరులో 4డీఎక్స్, ఐమ్యాక్స్ త్రీడీ స్క్రీన్స్ లో 90 శాతానికి పైగా అడ్వాన్స్ బుకింగ్స్ కనిపించాయి. 2డీ ఫార్మాట్, రెగ్యులర్ ఐమ్యాక్స్ లో ఇంత ట్రెండ్ కనిపించలేదు.

ఇలా సౌత్ లో అవతార్-2పై ఓ రేంజ్ లో హంగామా నడుస్తుంటే, అటు ఉత్తరాదిన మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ముంబయి, ఢిల్లీ, అహ్మదాబాద్, పూణె, కోల్ కతా.. ఇలా ఏ ప్రాంతంలో చూసుకున్నా అవతార్-2కు అడ్వాన్స్ బుకింగ్స్ పేలవంగా ఉన్నాయి. అంకెల్లో చెప్పాలంటే 30-40శాతం మించి అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు. ముంబయిలోని 4డీఎక్స్+3డీ స్క్రీన్స్ లో హిందీ వెర్షన్ కు మాత్రమే హౌజ్ ఫుల్స్ కనిపించాయి. మిగతా అన్ని స్క్రీన్స్ దాదాపు 90శాతం ఖాళీ.

ముంబయి స్క్రీన్స్ లో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే. అవతార్-2 కోసం కనిష్టంగా 500 నుంచి గరిష్టంగా 1300 రూపాయల వరకు టికెట్ ధరలు ఉన్నాయి. అయితే ఇది సరైన కారణం కాదనిపిస్తోంది. ఎందుకంటే, సౌత్ లో బెంగళూరు లాంటి సిటీల్లో గరిష్టంగా 1400 రూపాయల టికెట్లు కూడా ఉన్నాయి. పైగా అవన్నీ ఆల్రెడీ బుక్కయిపోయాయి కూడా.

అయితే ఈ తేడా అవతార్-2 సినిమాకే కాదంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు. కరోనా తర్వాత ఉత్తరాది ప్రేక్షకులు థియేటర్లకు రావడం పూర్తిగా తగ్గించేశారని, ఆ ప్రభావం ఇంకా కొనసాగుతోందని విశ్లేషిస్తున్నారు. సౌత్ లో థియేట్రికల్ సిస్టమ్ గాడిన పడిందని, ఉత్తరాదిన మాత్రం ఇది పట్టాలపైకి రావడానికి మరో 6 నెలల సమయం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే అవతార్-2 విషయానికొస్తే, సినిమా రిలీజైన తర్వాత పరిస్థితిలో కొంత మార్పు ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు.

Show comments