బుచ్చిబాబు ధైర్యం అందరికీ రావాలి

ఎన్టీఆర్ లాంటి ఓ పెద్ద స్టార్ కు కథ చెప్పి, అతను రావడం లేట్ అవుతోందని తెలిసి, అతని కోసం ఆగకుండా మరో హీరో దగ్గరకు వెళ్లిపోవడం అంటే టాలీవుడ్ కు సంబంధించినంత వరకు చాలా ధైర్యం కావాలి. మరోసారి ఎన్టీఆర్ దగ్గరకు రానిస్తాడా అనే భయం వెన్నాడుతూనే వుంటుంది. కానీ డైరక్టర్ బుచ్చిబాబు ధైర్యం చేసాడు. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ కు దారి తీసాడు. టాలీవుడ్ లో ఈ సమస్య చాలా కాలంగా వుంది.

ఓ డైరక్టర్ ఓ హీరోకి కథ చెప్పి, అది నచ్చి, ‘సరే చేద్దాం..వుండు’ అన్న తరువాత ఇక ఆ డైకర్టర్ కు నరకమే. అక్కడి నుంచి ఇక కదలడానికి వుండదు. హీరోకి వున్న కమిట్ మెంట్లు ఎప్పుడు అయిపోతాయా అని ఎదురుచూస్తూ పడిగాపులు పడడమే. అది చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా ఇదే తంతు. డైరక్టర్ల మీద రుమాలు వేసి కూర్చోపెడతారు. వాళ్లు అలా కూర్చోవాల్సిందే.

పోనీ అలా ఖాళీగా కూర్చోవడమే కదా అనుకుంటే కానే కాదు. ప్రతి దర్శకుడిని నమ్ముకుని ఓ చిన్నదో, పెద్దదో టీమ్ వుంటుంది. ప్రాజెక్టు కు నిర్మాత వుంటే వాళ్ల పోషణ భారం సదరు నిర్మాత మీద పడుతుంది. లేదూ అంటే తన జేబులోంచి పెట్టుకోవాలి. ఆ సంగతి ఎలా వున్నా, హీరో ఏదో సినిమా చేసుకుంటూ రెమ్యూనిరేషన్ అందుకుంటూనే వుంటాడు. కానీ దర్శకుడు మాత్రం రెమ్యూనిరేషన్ లేకుండా వెయిటింగ్ లో వుంటాడు.

హీరో తను సినిమా చేస్తున్నట్లు గానే దర్శకుడిని కూడా ఓ సినిమా చేసుకుని రమ్మంటే అది వేరుగా వుంటుంది. కానీ అలా అనే హీరోలు చాలా తక్కువ. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాను నమ్ముకుని ఏళ్లకు ఏళ్లుగా హరీష్ శంకర్ అలా పడిగాపులు పడుతున్నారు. ఎన్ని కోట్లు నష్టం వ్యక్తిగతంగా ఆయనకు? ఆయన కూడా ఇలా తెగించి వుంటే ఈపాటికి కనీసం రెండు సినిమాలు అందించి వుండేవారు. ఇలా చాలా మంది వున్నారు. కానీ పైకి మాట్లాడలేరు అంతే.

కానీ బుచ్చిబాబు ధైర్యం చేసారు. ఉప్పెన తరవాత ఇన్నేళ్లు ఖాళీగా వున్నారు. కొరటాల శివ సినిమా అయ్యే వరకు ఎన్టీఆర్ రారు. ఇంకెన్నాళ్లు వేచి వుండాలి. గతంలో ఓసారి బుచ్చిబాబు గురువు సుకుమార్ కూడా ఇలాగే మహేష్ కు కథ నచ్చకపోతే బన్నీ దగ్గరకు వెళ్లి పుష్ప తీసారు. ఇప్పుడు అదే ట్రెండ్ ఫాలో అయ్యారు బుచ్చిబాబు. డైరక్టర్ లు తమ కోసం ఆగరు, మరో హీరో దగ్గరకు వెళ్లిపోతారు అనే భయం హీరోలకు రావాలి అప్పుడే పరిస్థితి మారుతుంది. అలా రావాలి అంటే ముందుగా దర్శకులకు తమ సబ్జెక్ట్ మీద నమ్మకం బలంగా వుండాలి.

Show comments