ఎమ్బీయస్‍ కథ: ప్రవాసి మరణం

నేను రాసిన ఆంగ్లకథ ‘‘డెత్ ఆఫ్ ఎ ఫ్యూజిటివ్’’కు స్వీయానువాదం యిది. ఒరిజినల్ కథ ‘అలైవ్‍’లో ఫిబ్రవరి, 1997లో ప్రచురితమైంది. దానికి నేను చేసిన యీ అనువాదం విపుల లో ప్రచురితమైంది. హిట్లర్ నాజీ పాలనలో అత్యంత క్రూరంగా వ్యవహరించిన దళం ఎస్‌ఎస్. యూదుల సామూహిక మరణకాండకు బాధ్యులు వారే. యుద్ధంలో పరాజయం తప్పదని తెలిశాక వాళ్లు దొరికినంత బంగారం పట్టుకుని దక్షిణ అమెరికా వంటి దేశాలకు పారిపోయి ప్రవాసంలో ఉండసాగారు. అక్కడి పాలకులకు బంగారమిచ్చి మారుపేర్లతో స్థిరపడి పోయారు. కొందరు ధైర్యం చేసి మారు పేర్లతో జర్మనీ వచ్చి చేరారు కూడా. అయితే ఇజ్రాయేల్ ఏర్పడిన తర్వాత దాని గూఢచారి సంస్థ మొసాద్ యిలాటివాళ్లను వేటాడి పట్టుకుని ఇజ్రాయేల్ తీసుకుని వచ్చి శిక్షించసాగింది. దాని కళ్లు కప్పడానికి కొందరు తాము మరణించినట్లుగా నాటకాలాడసాగారు. ఏదో ఒక శవానికి తమ ఐడెంటిటీ కార్డులు తగిలించి, మరణించామని మొసాద్‌ను నమ్మించారు.

ఆస్విజ్ కాన్సన్ట్రేషన్ క్యాంప్‌లో అతి దారుణంగా ప్రవర్తించిన డా. జోసెఫ్ మెనగెల్ (1911-1979) అనే ఎస్‌ఎస్ వ్యక్తి యిలాగే అర్జెంటీనాలో దాక్కున్నాడు. అనేక సార్లు ఫేక్ మరణాలు నటించాడు. చివరకు 1979లో  బ్రెజిల్‌లో ఈత కొడుతూండగా గుండెపోటు వచ్చి మరణించాడు. మారుపేరుతో సమాధి చేశారు. 1985లో అతని శవాన్ని తవ్వి తీసి ఫలానా అని తేల్చారు. ఇతనికి ఏంజిల్ ఆఫ్ డెత్ అని పేరు. ఇతని కథ 1985లో పత్రికల్లో వచ్చింది. ఇది నన్ను ఆకర్షించింది. తర్వాత నేను ఫ్రెడరిక్ ఫోర్సిత్ రాసిన ‘‘ఒడెసా ఫైల్’’ చదివాను. వాటి ఆధారంగా యీ కథ కల్పించాను. దీనిని కథగా మలిచినప్పుడు నా మలయాళీ మిత్రుడు సివి కృష్ణకుమార్ సహకరించాడు. దానివలన కథ చాలా స్టయిలిష్‌గా వచ్చింది. అతనికి కృతజ్ఞతలు.

‘‘మైడియర్‍ క్లాడ్‍,

నాకు మహా ఆనందంగా ఉంది. ఎట్టకేలకు నా ‘డూప్‍’ దొరికాడు. నా ‘చావు’ను అతి త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాను. వచ్చే నెల 5వ తేదీన మెండోజాకు కొద్దిదూరంలో ఒక కారులో పోలీసులు ఒక శవాన్ని కనుగొంటారు. దాని తలలో ఒక బుల్లెట్‍ ఉంటుంది. కోటు జేబులో నీ అడ్రసు ఉంటుంది. పోలీసులు నిన్ను అడిగినప్పుడు నువ్వు దాన్ని ‘నా’ శవంగా గుర్తించాలి. యుద్ధకాలం రికార్డులు ధ్వంసమైపోయి చాలాకాలమైంది. నువ్వు చెప్పినదాన్ని ‘క్రాస్‍చెక్‍’ చేయడం ఎవడితరం కాదు. నా డూప్‍ స్థానంలో నేనీ దేశం నుండి బయటపడతాను. జర్మనీలో ఏదో ఒకచోట అజ్ఞాతంగా కొంతకాలం గడిపి, కొన్నాళ్లకు మీ ఇంట్లో పనివాడిగా చేరతాను. క్రమక్రమంగా, పరిస్థితులు చక్కబడ్డాక నా అసలు రూపుతో బయటకొస్తాను. బహుశా క్రిస్మస్‍ నాటికి అది జరగవచ్చు. మనమంతా కలిసి ఆనందంగా క్రిస్మస్‍ జరుపుకోవచ్చు.

క్లేరానూ, పిల్లలనూ అడిగానని చెప్పు. మీ అందరికీ నా దీవెనలు.

మిమ్మల్నందర్నీ చూడాలని తపిస్తున్న తండ్రి

కార్ల్ క్రేంజ్‍

ఉత్తరాన్ని మడిచి కవర్లో పెట్టి ఉత్తరాన్ని పట్టుకెళ్లాల్సిన ‘కొరియర్‍’ కోసం క్రేంజ్‍ అసహనంగా తిరగసాగాడు. అనుకొన్న టైముకి పని జరక్కపోతే క్రేంజ్‍కి ఎప్పుడూ చిరాకే. అతని కోపిష్టి స్వభావం ఈనాటిది కాదు. అతను అనాథగా పెరిగినప్పటినుంచీ, అనాథాశ్రమంనుండి పారిపోయినప్పటినుంచీ, గూండాగా మారినప్పటినుంచీ, ఆపైన ‘నాజీ’గా పైకి ఎగబాకినప్పటినుంచీ, అది అతనితోబాటు ఎదుగుతూ వస్తోంది. ఏడేళ్ల వయసులో 1921లో ఓస్నాబ్రుక్‍ అనాథాశ్రమం నుండి అతను పారిపోయిన తర్వాత అతని కోపాన్ని ప్రదర్శించడానికి దొరికిన ఓ మార్గం నాజీయిజం. కార్ల్ లూగర్‍ రాతలూ, హిట్లర్‍ ఉపన్యాసాలు అతనికి ఓ ‘సత్యాన్ని’ చాటిచెప్పాయి. మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీ ఓటమికీ, మ్యూనిక్‍ ఒప్పందానికీ కారణం యూదుల వెన్నుపోటు. దాని కారణంగానే తన లాటి ప్రజలు లక్షల సంఖ్యలో అనాథలయ్యారు. అందువల్ల యూదులపై ప్రతీకారం తీర్చుకోవాలని క్రేంజ్‍ ప్రతినబూనాడు.

1933లో హిట్లర్‍ ఛాన్సలర్‍ పదవిని అలంకరించేటప్పటికి క్రేంజ్‍ కూడా నాజీ పార్టీలో ఓ ఉన్నత పదవిని చేజిక్కించుకోగలిగాడు. అతనికి చదువు పెద్దగా రాదు. మొరటు మనిషి కూడా. అయినా యూదులంటే అతనికున్న పరమద్వేషం, అతని స్వభావంలోనే ఉన్న ఒక శాడిజమ్‍ అతన్ని గెస్టపో ప్రత్యేక విభాగమైన ఎస్‍.ఎస్‍.లో చేర్చుకొనేందుకు దోహదం చేశాయి. వివిధ ‘కాన్సన్‍ట్రేషన్‍ కాంప్స్’, ‘గాస్‍ ఛాంబర్స్’ల పనిని సమన్వయం చేయడం అతనికి అప్పగించబడింది. ‘నీచమానవులైన యూదుల సమస్యకు అంతిమ పరిష్కారం వారిని కడతేర్చటమే’ అన్న హిట్లర్‍ సిద్ధాంతాన్ని తూచ తప్పకుండా అమలు పరచి కనీసం పది లక్షల మంది యూదుల చావుకు కారకుడయ్యాడు క్రేంజ్‍.

1944లో బెర్లిన్‍ పతనానికి ముందే ఆ విషయాన్ని పసిగట్టి బోల్డంత బంగారాన్నీ, వజ్రాలూ, ఇతర విలువైన వస్తువుల్నీ చేజిక్కించుకుని జర్మనీ వదిలి పారిపోయాడతను. తక్కిన నాజీలలాగానే తనూ దక్షిణ అమెరికాకు వెళ్లి అక్కడ దేశాధినేతలకు బంగారం ఇవ్వజూపాడు. నాజీలు చేసిన యుద్ధ నేరాల గురించి పట్టించుకోకుండా ఆ నియంతలు క్రేంజ్‍ పెట్టుకున్న మారుపేరు మీద దేశ పౌరసత్వం యిచ్చేశారు. కానీ యూదులు నాజీలను విడిచిపెట్టదలచుకోలేదు. ఇజ్రాయెలు ఏర్పడ్డాక వాళ్ల గూఢచారి సంస్థ ‘మొసాద్‍’ ఇటువంటి వాళ్లనందరినీ బోనెక్కించదలచింది. ప్రపంచం నలుమూలలా గాలించి ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా వంటి ప్రదేశాలలో దొంగపేర్లతో దాగున్న నాజీలను వెతికి పట్టుకొని ఇజ్రాయేలుకు రహస్యంగానైనా ఎత్తుకుపోయి అక్కడ కోర్టుల్లో విచారణ జరిపించి శిక్ష పడేటట్లు చేసేది.

అందువల్ల మొసాద్‍కి కావలసినవాళ్ల జాబితాలో తన పేరు అందరికంటె ముందుంటుందని తెలిసిన క్రేంజ్‍, మొసాద్‍ వాళ్లకంటే ఓ అడుగు ముందుగానే ఒక దేశం నుండి మరొక దేశానికి పారిపోసాగాడు. ఇలా పెరూ, పెరుగ్వే, బ్రెజిల్‍, బొలీవియా, చిలీ దేశాలన్నీ క్రేంజ్‍, అతని వెనకాల మొసాద్‍ చుట్టబెట్టడం అయింది. చివరికి అర్జెంటీనాలోని ఈ ‘అకాన్‍కాగువా’ అనే చిన్న ఊరికి వచ్చి రెండేళ్లుగా అజ్ఞాతంగా ఉంటున్నాడు. మొసాద్‍ ఎప్పుడు వచ్చి పడుతుందో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. ఒక్కడూ ఉండేవాడు, ఇంటివాళ్లతో, పొరుగువాళ్లతో అతి తక్కువగా మాట్లాడేవాడు. అందరికీ తనొక ఆస్ట్రియా దేశవాసిననీ, కుటుంబంలో ఎవరితోనూ పడకపోవడంవలన విడిగా వచ్చేశాననీ చెప్పేవాడు.

దాచుకున్న డబ్బు ప్రవాసజీవితంలో ఉపయోగించుకొనే అవకాశం లేదు. అందువల్ల ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి చిన్న చిన్న దుకాణాలు నడిపో, చిన్నపాటి ఉద్యోగాలు చేసో దరిద్రంలోనే బతుకుతూండేవాడు. యుద్ధానంతరం జర్మనీలో ఉండిపోయిన అతని కుటుంబానికి కూడా ఆర్థికంగా ఏ సహాయం అందించలేకపోయాడు - ఎవరి దృష్టిలోనైనా పడతానేమోనన్న భయంచేత.  అతని పెద్దకొడుకు క్లాడ్‍ కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకొని కష్టపడి పైకొచ్చి లాయర్‌గా బాగానే సంపాదిస్తున్నాడు. అతను పైకొచ్చిన విధానం అందరికీ తెలుసు కాబట్టి క్రేంజ్‍ ఏ మూలో బతికుండి డబ్బు పంపించి ఉండవచ్చని ఎవరికీ అనిపించలేదు. పదేళ్ల క్రితం భార్య పోయినప్పుడు క్రేంజ్‍ అంత్యక్రియలకు హాజరు కాలేదు. కాకపోవడం మంచిదయింది. మొసాద్‍ వాళ్లు సంతాప సందేశాలపై కూడా నిఘా వేశారు. క్రేంజ్‍ ఉనికి తెలుస్తుందేమోనని.

వయసు పైనపడుతున్న కొద్దీ క్రేంజ్‍కు ప్రవాస జీవితం దుర్భరమైపోయింది. జీవిత చరమదశలోనైనా కుటుంబ సభ్యులతో గడపాలనే ఆరాటం పెరిగింది. అతని మిత్రులనేకమంది చచ్చిపోయినట్టుగా మొసాద్‍ను నమ్మించి జర్మనీకి పారిపోయి కుటుంబాలతో స్థిరపడ్డారు. తనూ తన కుటుంబాన్ని కలిసి తన దగ్గిర ఉన్న ధనరాశుల్ని వారు అనుభవిస్తూంటే చూడాలనే  క్రేంజ్‍కు ఆశ కలిగింది. అది నెరవేరడానికి బొసాటోని నియమించాడు. బొసాటో పని ఏమిటంటే క్రేంజ్‍ పోలికలున్న మనిషిని వెతికి అప్పగించడం. తన ఎత్తూ, లావూ ఎక్కువ కాబట్టి తనలాటివాడు దొరుకుతాడన్న ఆశ సన్నగిల్లుతున్న సమయంలో బొసాటో క్రితం వారం ఫోన్‍ చేశాడు.

‘‘సార్‍ ఒకడు దొరికాడు. అసలు పేరెందుకుగానీ, వాడిపేరు ఆల్బర్ట్ అని పెట్టాం. జర్మనీలో ఉంటాడు. సాధారణ మనిషి. చుట్టాలూ పక్కాలూ తక్కువ మందే ఉన్నారు. స్నేహితులు కూడా తక్కువే. హఠాత్తుగా మనిషి మటుమాయమై పోయినా ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అర్జెంటీనా నుండి మాదకద్రవ్యాలు తెస్తే బాగా డబ్బు ముట్టచెబుతానని ఆశపెట్టాను. సరేనన్నాడు. ఎందుకైనా మంచిది, కొకైన్‍ పేకెట్లు నాలుగు పార్సెలు చేసి పట్టుకెళ్లండి. ఏదైనా అడ్డం తిరిగి ఈసారి మన ప్లాను దెబ్బతింటే, ఏ అనుమానం పెట్టుకోకుండా మళ్లీ రమ్మంటే మళ్లీ వస్తాడు.’’

‘‘సరే, బాగుంది. కానీ అతన్ని ఎక్కడ కలవడం? నేను హఠాత్తుగా మరణించడానికి ముందు అతనిక్కడికి రావడం అనుమానాన్ని రేకెత్తించదూ?’’

‘‘అందుకే ఓ పథకం వేశాను. గోడేక్రజ్‍లో ఓ రోడ్డు సైడు హోటల్‍ దగ్గర అతను మీకోసం ‘వెయిట్‍ చేస్తాడు’. మీరతన్ని కారెక్కించుకొని మెండోజా ఎయిర్‍పోర్ట్‌కి తీసుకెళుతూ, దార్లో కొండప్రాంతం వచ్చినప్పుడు కార్లోనే కాల్చేసి, మీ అబ్బాయి అడ్రసు కార్డు అతని కోటుజేబులో పెట్టేయండి. అతని టిక్కెట్టుమీద ‘బెర్న్’కు విమానంలో వెళ్లిపోయి అక్కణ్ణుంచి కనెక్టింగ్‍ ఫ్లయిట్‍లో ఫ్రాంక్‍ఫర్ట్ వెళ్లిపోండి. బెర్న్‌కి వెళ్లకండి. అతనికి తెలిసున్న వాళ్లెవరైనా మిమ్మల్ని పలకరించి ఇబ్బంది పెట్టవచ్చు. ఇంకో సంగతి. మీరతన్ని కలిసేటప్పుడు ఓ విగ్గు, నల్ల కళ్లద్దాలు, నకిలీగడ్డం తగిలించుకొని వెళ్లండి. మిమ్మల్ని చూడగానే ‘నాలా ఉన్నాడేమిటీయన’ అని అతను తెల్లబోకూడదు’’

క్రేంజ్‍ చెక్కు అందిస్తూ ‘‘చాల్లేవోయ్‍, అతను నూటికి నూరుపాళ్లూ నాలాగే ఉంటాడన్నట్టు చెప్తావే’’ అన్నాడు.

పదిహేను రోజుల తర్వాత గోడేక్రజ్‍లో కార్లో కూర్చుని ఉన్న కార్ల్ క్రేంజ్‍కి తన మాటలు గుర్తొచ్చి తన ఊహ తప్పని తెలుసుకొన్నాడు. ఆ అపరిచితుడు అచ్చు తనలాగే ఉన్నాడు. కారు దగ్గరికి వచ్చి ముందు అనుకొన్న ప్రకారం సిగ్నల్‍ ఇచ్చాడు. క్రేంజ్‍ యాంత్రికంగా కారు తలుపు తీసి అతన్ని లోపలికి రానిచ్చాడు. మెండోజా పర్వత ప్రాంతంవైపుకు కారు దూసుకుపోతూండగా, ఆ కొత్తవ్యక్తి తన నెర్వస్‍నెస్‍ కప్పిపుచ్చుకోడానికి ఏదో ఒకటి వాగడం మొదలెట్టాడు. ‘‘నాకు ఆల్బర్ట్ అని పేరెట్టారండి మీ ఏజంట్‍. తమాషాగా ఉంది కదా. ఇది నాకు మొదటిసారే ననుకోండి... ఇలాటి మారుపేరు పెట్టుకోవడం, ఇలాటి పనిచెయ్యడం. అయినా మీకేమీ భయం వద్దండి. మీరు చెప్పిన ప్రకారమే బెర్న్‌లో...’’

‘‘సరే, సరేలే.. మననెవరూ వెంటాడటంలేదని రూఢి చేసుకొన్న తర్వాత నేను నీకు పాకెట్‍ ఇస్తాను. టాక్సీ దొరికేచోట ఆపుతాను. నువ్వు టాక్సీ పట్టుకొని మెండోజా ఎయిర్‍పోర్టుకి వెళ్లి అయిదు గంటల విమానం ఎక్కేయ్‍. పనయిపోగానే నీకక్కడ బెర్న్‌లో డబ్బులిస్తారు’’ అన్నాడు క్రేంజ్‍. ఆల్బర్ట్ కృతజ్ఞతా భారంతో మెలికలు తిరిగాడు. ‘‘థాంక్యూ సార్‍, మీరేం భయపడక్కర్లేదు. ఫస్టుక్లాసుగా పనిచేస్తాను. చూస్తూ ఉండండి. మళ్లీసారి కూడా నన్నే పిలుస్తారు మీరు. ఇలా ఓ నాలుగు డబ్బులు చేరితే నా గరాజ్‍ మళ్లీ తెరవచ్చు.’’

‘‘నువ్వేమిటి? కార్‍ మెకానిక్‍వా?’’

‘‘అవును సార్‍, పాత కార్లు రిపేరు చేయడం నా స్పెషాలిటీ అండి. యుద్ధం అయిపోయిన తర్వాత, సైన్యంలోంచి బయటకొచ్చిన తర్వాత అమెరికను సోల్జర్ల పాతజీపులూ అవీ రిపేరు చేసి మళ్లీ వాటిని నడిచేటట్టు చేసేవాణ్ణి. వాళ్లు నా పట్ల చాలా ఉదారంగానే ఉండేవారు. బాగా డబ్బు కూడా ముట్టచెప్పేవారు. తమాషా చూడండి. అంతకు కొద్దికాలం క్రితమే అమెరికన్లతో యుద్ధం చేశాను. యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్లవల్ల లాభం పొందాను! అదీ జీవితమంటే’’

క్రేంజ్‍ కళ్లు ఆ పర్వతప్రాంతంలో జనసంచారంలేని చోటుకోసం వెతుకుతున్నాయి. వీణ్ణి ఎక్కడ చంపితే ఎవరికీ తెలియకుండా ఉంటుందాని. కానీ అతని మాటలు అతనిలో ఉత్సుకతను రేకెత్తించాయి. ‘‘నువ్వు యుద్ధంలో పనిచేశావా?’’ అనడిగాడు. ‘‘చేశా సార్‍. వెస్ట్‌లో చేశా. ఈస్టులో చేశా కొన్నాళ్లు.. రోమెల్‍నార్త్ ఆఫ్రికా యుద్ధంలో కూడా చేశా. మీకో వింతయిన విషయం చెప్పనా? నేను హిట్లర్‍ కోసం పనిచేశానా? తర్వాత కనుక్కొంటే తెలిసిందేమిటంటే నేనే ఒక యూదుణ్ణి! అదీ తమాషా! యూదుల్ని నిర్మూలించడమే జీవితధ్యేయంగా పెట్టుకొన్న హిట్లర్‍ సైన్యంలో నేను పనిచేశాను. అదీ జీవితం చేసే చమక్కులంటే!’’

‘‘నువ్వు యూదుడివా?’’ కార్ల్ క్రేంజ్‍ అరచినంత పనిచేశాడు.

ఆల్బర్ట్ ఉలిక్కిపడ్డాడు. అనుకోకుండా క్రేంజ్‍కేసి పరీక్షగా చూశాడు. అంతకుముందు వరకూ బెరుకుతో అతన్ని సరిగ్గా చూడలేదు. ఇప్పుడు చూస్తే అతన్ని ఇంతకుముందెన్నడో చూసినట్టనిపించింది. అంతలోనే తట్టింది తనకూ, ఇతనికీ పోలికలున్నాయని. ఒకవేళ ఇతనూ తనలాగే యూదుడేనేమో! మరి అంత కర్కశంగా అరిచాడేమిటి? ఏమో మరి! భయంవేసి, ఏదో ఒకటి మాట్లాడ్డం మొదలెట్టాడు.

‘‘ఆశ్చర్యంగా ఉందా సార్‍? సంగతేమిటంటే మా అమ్మ జర్మన్‍. నా ఆరో ఏట ఆవిడ పోయిన తర్వాత అనాథాశ్రమంలో చేరాను. నాకు ఆవిడ మాత్రమే గుర్తుంది. యుద్ధంనుండి తిరిగొచ్చిన తర్వాతనే మా నాన్న గురించి తెలిసొచ్చింది. ఆయన మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీ తరఫున పోరాడుతూనే మరణించారని’’

‘‘అంటే నువ్వు-జర్మన్‍కి, జ్యూకి పుట్టినవాడివన్నమాట!’’

‘‘అంతేకదండీ! హిట్లర్‍ 1935లోనే కదా జర్మన్‍, జ్యూ వివాహాలు రద్దుచేసింది! మా అమ్మా, నాన్న పెళ్లి అంతకుముందే జరిగింది. మా నాన్న పోయిన తర్వాత మాకు పోషణ గడవడం కష్టమయింది. అమ్మ, మేం ఇద్దరం అన్నదమ్ములం. మా దుస్థితి చూసి జాలిపడి, మా నాన్నవైపు బంధువులు, అంటే యూదులన్నమాట, అమ్మకు దుకాణం ఒకటి కొనిపెట్టి దాన్ని నడుపుకోమన్నారు. ఆ దుకాణమే మాకు అరిష్టాన్ని కొనితెచ్చింది. మీకు తెలిసే ఉంటుంది. మొదటి ప్రపంచయుద్ధంలో చిన్నచిన్న వ్యాపారస్తులు యుద్ధరంగంలో పోట్లాడుతూ ఉంటే, వాళ్ల భార్యలు దుకాణాలు నడుపుతూండేవారు. యూదులు కొంతమంది వాళ్ల దగ్గరికి వెళ్లి ‘మీ మొగుళ్లు తిరిగొస్తారన్న నమ్మకం లేదు, ఈ షాపులు మాకు అమ్మేయండి’ అని నచ్చచెప్పి తక్కువ ధరకు ఆ దుకాణాలు కొనేశారు. 1919లో యుద్ధంలో జర్మనీ ఓడిపోయాక హిట్లర్‍ దీనికే ఓ కొత్త భాష్యం చెప్పాడు. ‘యూదులు కావాలని దుకాణాలన్నీ కొనేసి, జర్మన్‍ సైనికులకు సరుకులు అందకుండా చేశారనీ, అందువల్లనే యుద్ధంలో నెగ్గబోతున్న సైనికులు ఓడిపోవలసి వచ్చిందనీ’ ప్రచారం చేశాడు.

యుద్ధంలో ఓడిపోయినందుకు గుండెలు రగిలిపోతున్నవారికీ మాటలు నచ్చాయి. ఎదురుగుండా ఒకణ్ణి చూపించి ‘వీడే నీ అంతఃశత్రువు’ అంటే వాళ్లమీద దాడిచేయడం సులభంకదా! చాలామంది పోరంబోకు మనుషులు హిట్లర్‍చుట్టూ చేరి, యూదుల దుకాణాల మీద పడి దోచుకోవడం మొదలెట్టారు. మా దుకాణం కూడా ఒక జర్మన్‍ దగ్గిర కొన్నదే, కొనిపెట్టినది యూదులే. అందుచేత మా అమ్మ కూడా యూదురాలే అయివుంటుందన్న అపోహతో దుకాణం తగలబెట్టేసి, ఆవిణ్ణి మంటల్లో పడేశారు. నేనూ  మా తమ్ముడూ అనాథాశ్రమం పాలవ్వాల్సి వచ్చింది.’’

క్రేంజ్‍ చాలా శ్రద్ధగా వింటున్నాడు. తనకి తెలియకుండానే కారు స్పీడు బాగా తగ్గిపోయింది. ‘‘ఇదంతా 1919 నాటి విషయాలు కదా. నీకెలా తెలిశాయి?’’

‘‘కష్టమేముంది సార్‍? నేను గరాజ్‍ పెట్టుకొన్నాక డబ్బులు బాగానే గడించాను. నేను అనాథనెందుకయ్యాను? అని తెలుసుకోవాలన్న కుతూహలంతో వాకబుచేశాను. కాస్త చేతులు తడిపితే అనాథాశ్రమం గుమాస్తా పాత రికార్డులు వెతికిపెట్టి విషయాలన్నీ చెప్పాడు. మా ఊళ్లో ముసలాళ్లను కదిలిస్తే మిగతా విషయాలు చెప్పారు’’

క్రేంజ్‍ తల తిరుగుతోంది. తల్లి జర్మన్‍, తండ్రి యుద్ధంలో మరణించడం, దుకాణం కాలిపోవడం, అన్నదమ్ములు అనాథాశ్రమంలో! ఎక్కడో విన్నట్టుగా, బాగా తెలిసినట్టుగా అనిపించింది. కారు ఆగిపోయింది. అనుకోకుండానే అడిగేశాడు. ‘‘ఈ అనాథాశ్రమం ఓస్నాబ్రుక్‍లో ఉందన్నావా?’’

‘‘అన్నానా? అనే ఉంటాను. ఓస్నాబ్రుక్‍లో నది ఒడ్డునే ఉంటుంది కదా, అదే దరిద్రగొట్టు అనాథాశ్రమం! పాపం మా తమ్ముడు కార్ల్ అక్కడ ఉండలేక పారిపోయాడు. మహా అవస్థపడ్డాను నేను. వాడు పారిపోయిన నేరానికి నన్ను శిక్షించాడు వార్డెన్‍. ఏవన్నాడో తెలుసా...’’

కార్ల్ స్తబ్ధుడైపోయాడు. ఇతను మా అన్నయ్య అబ్రహాం కాదుకదా! పోలికలూ ఒకటే, నాకంటే కొద్దిగా పెద్దవాడు కూడా. ఇద్దరి జీవిత నేపథ్యము ఒకటే. అవును మా అన్నయ్యే. నో! కాదు, కాకూడదు. అతను యూదుడు. నేను యూదుణ్ణెలా అవుతాను? లక్షలాది మంది యూదులను మట్టుబెట్టినవాడు స్వయంగా యూదుడవుతాడా? కాదు. బహుశా అంతే! కాకతాళీయమేనేమో! అతని అసలు పేరు అడిగితే నిజం బయటపడుతుంది. తన సోదరుడు అవునో కాదో, తను యూదుడు అవునో కాదో తెలిసిపోతుంది. వద్దు, వద్దు. తనకు నిజం అక్కర్లేదు. అతని పేరడిగి నిజాన్ని భరించే శక్తి తనకు లేదు. క్రేంజ్‍ గబగబా కొకైన్‍ పార్శిల్‍ తీసి ‘ఆల్బర్ట్’ చేతిలోపెట్టి కారు దిగమన్నాడు. ఆల్బర్ట్ తెల్లబోయాడు. కానీ చెప్పినట్టే చేశాడు. గుడ్‍బై చెప్పి వెళ్లిపోయాడు.

కార్ల్ క్రేంజ్‍ గమ్యం తెలియకుండా కొంతసేపు కారు నడిపి ఎవరూ లేని చోటుకు చేరుకున్నాడు. స్టీరింగ్‍మీద తలవాల్చుకొని తన జీవితాన్ని ఒక్కసారి సమీక్షించుకున్నాడు. హిట్లర్‍, గోబెల్స్ యూదుల గురించి దుష్ప్రచారం చేసి, కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేశారన్న సంగతి తను కొత్తగా విన్నది కాదు. అయినా అది ఇన్నాళ్లూ తను నమ్మదలచుకోలేదు. నమ్మితే తానొక వెర్రివాడిగా ఒప్పుకోవాల్సి వస్తుంది కనక! ఆ దుష్ప్రచారాల వల్ల యవ్వనంలో ఉండగా యూదుల్ని ద్వేషించాడు. ప్రవాస జీవితం వల్ల  వృద్ధాప్యంలో యూదుల్ని ద్వేషిస్తున్నాడు. కానీ నిజం ఏమిటి? తన తండ్రి ఒక యూదుడు. మొదటి ప్రపంచయుద్ధంలో జర్మనీ కోసం పోరాడి అమరుడయ్యాడు. జర్మనీ కోసం!

కొంతసేపటికి తను చేసిన దానికి తనకే ఆశ్చర్యం వేయడం మొదలయింది! తను ఆ ముసలతన్ని ఎందుకు వదిలివేసినట్టు? మా అన్నయ్య అనా? అన్నయ్యేనా? లేక అతను ఒక యూదుడనా? లక్షలాది  యూదుల్ని మారణహోమానికి గురిచేసి ఒకణ్ణి వదిలేస్తే సరిపోతుందా? ఒకవేళ నేను కూడా యూదుణ్ణి  కాబట్టే సాటి యూదుణ్ని వదిలేశానా?

 నేను యూదుణ్ణి కాకూడదు. కొన్ని సిద్ధాంతాలను నమ్ముకొని వాటిని అమలు చేయడానికే నా జీవితమంతా వెచ్చించాను. అవే తప్పని తేలిన తర్వాత నేను బతకడంలో అర్థం ఏముంది? పైగా ఇంకొకణ్ణి చంపి! వాడి స్థానంలో నేను బతకాలని చూడడం ఏ విధంగా సమర్థనీయం?

గుట్టలు గుట్టలుగా పోసిన శవాలు, గాస్‍ ఛాంబర్స్‌లో ఉక్కిరిబిక్కిరవుతున్నవారి మొహాలు, వేదనా భరితమైన వారి చూపులు అన్నీ అతని కళ్లముందు తిరిగాయి. వాంతి వచ్చినట్లయింది. అతని కుడిచేయి కోటుజేబులో కెళ్లింది. తుపాకీ బయటకు తీసింది. అతను దాన్ని కణతలకు గురిపెట్టుకొన్నాడు.

ఓ వారం రోజుల తర్వాత, అర్జెంటీనాలోని మొసాద్‍ ఏజంట్‍ టెల్‍ అవీవ్‍లో ఉన్న వాళ్ల హెడ్డాఫీసుకు సందేశం పంపాడు. ‘‘ఓ వారం రోజుల క్రితం స్థానిక పత్రికలు కార్ల్ క్రేంజ్‍ మరణవార్తను ప్రముఖంగా ప్రకటించాయి. అతను అంతకుముందే తన కొడుక్కి పంపిన ఉత్తరాన్ని జర్మనీలోని మన ఏజంట్లు చేజిక్కించుకోగలిగారు. మెండూజా ఎయిర్‍పోర్టులో క్రేంజ్‍ని పట్టుకోగలిగాం. అంతకుముందే అతని స్థానంలో వచ్చిన మనిషిని చంపేసి ఉన్నాడు. మమ్మల్ని చూడగానే కంగారుపడి తన చేతిలో ఉన్న పొట్లంలోని పదార్థాన్ని మింగేశాడు. దానివల్లనో ఏమో మతి చలించినట్టుగా ఉంది. అతన్ని ఏం చేయాలో తెలియపరచవలసినది’’

మొసాద్‍ చీఫ్‍ సమాధానం వెంటనే పంపాడు ‘వాడి వేషాలు నమ్మకండి. మతి చలించినా, చలించకపోయినా క్రేంజ్‍ మాకు కావాలి. రహస్యంగా వాణ్ణి ఇజ్రాయెలుకు రవాణా చేయండి. తక్కినది మేం చూసుకొంటాం’’

వచ్చే నెల ఆఖరి బుధవారం మరో స్వీయానువాద కథ

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2022)

mbsprasad@gmail.com

Show comments