కేసీఆర్ ఆఫర్ ....తిరస్కరించిన ఈటల ...?

రాజకీయాల్లో అనేక రకాల ప్రచారాలు జరగడం సర్వ సాధారణం. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు కదా అలా ఉంటాయి రాజకీయాల్లో జరిగే ప్రచారాలు. జరిగే ప్రచారాలు నిజమని చెప్పలేం. అలాగని అబద్ధాలని కొట్టేయలేం. ఎందుకంటే రాజకీయ నాయకులకు రాజకీయ ప్రయోజనాలే ప్రధానం. అందుకే రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. అవమానించిన వారిని ఆలింగనం చేసుకుంటారు. ఆదరించిన వారిని అవమానిస్తారు. ప్రస్తుతం తెలంగాణలో ఒక ప్రచారం జరుగుతోంది. తాను వెళ్లగొట్టిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను తిరిగి గులాబీ పార్టీలోకి తీసుకురావాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారట. మునుగోడులో బీజేపీ టీఆర్‌ఎస్‌ కు  అంత గట్టి పోటీ ఇవ్వగలిగిందంటే అందుకు ఈటలే కారణమని కేసీఆర్ భావిస్తున్నారట. అందుకే కేసీఆర్ ఈటలను తిరిగి గులాబీ పార్టీలోకి తీసుకురావాలని అనుకుంటున్నారట. 

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం సాధించినప్పటికీ అపజయం పొందిన బీజేపీ భారీగా ఓట్లు సాధించింది. ఇన్ని ఓట్లు పడతాయని ఆ పార్టీ కూడా ఊహించలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ మరింతగా బలపడొచ్చని కేసీఆర్ భావిస్తున్నారట. ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానే బీజేపీకి ఓటు బ్యాంకు భారీగా పెరిగిందని అనుకుంటున్నారట. ఇందుకు ఈటల కూడా ఒక కారణంగా భావిస్తున్నారట. బీజేపీ ఈటలకు పార్టీలో మంచి ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో ఆయన పార్టీలో కీలక నేతగా ఎదిగారు. చేరికల కమిటీ చైర్మన్‌ హోదాలో టీఆర్‌ఎస్‌ను బలహీనపర్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బూర నర్సయ్యగౌడ్‌ను పార్టీలోకి తీసుకురాగలిగారు.

ఈటల మార్గంలోనే చాలామంది ఉద్యమకారులు కూడా టీఆర్‌ఎస్‌ను వీడారు. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ ఉద్యమ ద్రోహుల పార్టీగా మారిందన్న చర్చ జరుగుతోంది. ఒక్క దెబ్బతో ఆ ముద్ర పోగొట్టుకోవాలని టీఆర్‌ఎస్‌ అధినేత భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈటలపై గురి పెట్టారని కొందరు టీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. ఈటల రాజేందర్‌ తిరిగి సొంత గూటికి వస్తే.. ఆయనకు గతంలో ఉన్న నంబర్‌ 2 పొజిషన్‌తోపాటు మంత్రి పదవి కూడా ఇస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు బండి సంజయ్‌ కారణంగా రాజేందర్‌ బీజేపీలో ఇమడలేకపోతున్నారన్న చర్చ మొదటి నుంచి జరుగుతోంది. కేసీఆర్‌ మంత్రాంగం ఫలించి ఈటల సొంత గూటికి వెళితే.. బీజేపీ నైతికంగా దెబ్బతినడంతోపాటు.. టీఆర్‌ఎస్‌ నుంచి ఫిరాయించాలని భావిస్తున్నవారు కూడా పునరాలోచన చేస్తానని గులాబీ బాస్‌ ఈ ఎత్తు వేశారన్న చర్చ జరుగుతోంది. 

ఈ విషయంలో నిజానిజాల సంగతి అలా ఉంచితే టీఆర్‌ఎస్‌ లో మాత్రం ఈటల సొంత గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. మరో వైపు ఈటల కూడా కమలం గూటిలో ఇరుకుగా ఫీల్ అవుతున్నారనీ, తన కష్టానికి తగ్గ గుర్తింపు కాషాయం పార్టీలో రావడం లేదన్న భావనలో ఉన్నారనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటల మళ్లీ గులాబి గూటికి చేరుతారన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కేసీఆర్ స్వయంగా ఈటలకు ఫోన్ చేసి పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారనీ, మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారనీ కూడా చెబుతున్నారు. మొత్తం మీద మునుగోడు ఉప ఎన్నికల ఫలితం కేసీఆర్ ఈటల విషయంలో పునరాలోచనలో పడేలా చేసిందన్నది మాత్రం వాస్తవమేననీ, జాతీయ రాజకీయాలపై తాను పూర్తిగా దృష్టి కేంద్రీకరించే ముందు రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ఈటల వంటి నాయకుడి అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారంటున్నారు.

మరో వైపు ఈటల వైపు నుంచి చూస్తే.. ఆయన గురించి తెలిసిన వారెవరూ కమలం గూటిలో ఈటల స్వేచ్చగా ఉన్నారని కలలో కూడా భావించరు. అసలు ఈటల టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి  కమలం తీర్థం పుచ్చున్నప్పుడే ఆయన రాజకీయ నేపథ్యం తెలిసిన వారంతా ఆశ్చర్యపోయారు. వామపక్ష భావజాలం ఉన్న ఈటల కమలం పార్టీలో చేరడమేమిటి? చేరినా అక్కడ ఇమడగలుగుతారా అన్న అనుమానాలు వ్యక్తం చేశారు. వారి అనుమానాలకు తగ్గట్టుగానే ఈటల కమలంలో చేరిన అనతి కాలంలోనే ఆయన అక్కడ ఇమడ లేకపోతున్నారనీ, ఉక్కపోతకు గురౌతున్నారన్న వార్తలు వినవచ్చాయి. అప్పట్లోనే ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టనున్నారన్న ప్రచారమూ జోరుగా సాగింది. బీజేపీ అభ్యర్థిగా హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల ఘన విజయం సాధించినా.. అది బీజేపీ ఖాతాలో కాకుండా ఈటల వ్యక్తిగత ఖాతాలోనే పడింది. 

నియోజకవర్గ ప్రజలే కాదు..రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ హుజూరాబాద్ లో ఈటల విజయం వెనుక ఉన్నది బీజేపీ అని భావించలేదు. ఈటల వ్యక్తిగత విజయంగానే దానిని అభివర్ణించారు.  టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో విభేదించి, బహిష్కృతుడై బయటకు వచ్చిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించారు. బీజేపీలో ఇమడ లేక పోయినా సర్దుకు పోతూ అక్కడే  కొనసాగుతున్న ఈటలకు ఇప్పుడు గులాబీ గూటి నుంచే ఆహ్వానం వచ్చిందంటున్నారు. 

మరోవైపు కేసీఆర్‌ ఇచ్చిన ఆఫర్‌ను ఈటల రాజేందర్‌ తిరస్కరించినట్లు కూడా తెలుస్తోంది. అవమానకర రీతిలో తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడమే కాకుండా.. తన పరువును మంటగలిపాడన్న ఆలోచనలో ఈటల ఉన్నారు. మొదటి నుంచి ఆత్మగౌరవ నినాదంతోనే ఉన్న రాజేందర్‌ తాజాగా కేసీఆర్‌ ఆఫర్‌ను కూడా తిరస్కరించినట్లు సమాచారం. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. ఈ క్రమంలో ఏదైనా జరగవచ్చు అనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. 

Show comments