నంద్యాల లోక్‌స‌భ‌పై క‌న్నేసిన మంత్రి!

జ‌గ‌న్ కేబినెట్‌లో కీల‌క మంత్రిత్వ‌శాఖ బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి దేశ అత్యున్న‌త చ‌ట్ట‌స‌భ‌లో అడుగు పెట్టాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న నంద్యాల లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయాల‌ని ఆలోచిస్తున్నార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం నంద్యాల నుంచి వైసీపీ త‌ర‌పున పోచా బ్ర‌హ్మానంద‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. అంత‌కు ముందు ఎస్పీవై రెడ్డి వ‌రుస‌గా రెండు ద‌ఫాలు నంద్యాల నుంచి గెలుపొందిన సంగ‌తి తెలిసిందే.

నంద్యాల లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో డోన్ వుంటుంది. ఇక్క‌డి నుంచి 2014, 2019ల‌లో వ‌రుస‌గా రెండు ద‌ఫాలు వైసీపీ త‌ర‌పున బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఎన్నిక‌య్యారు. సీఎం జ‌గ‌న్‌కు బుగ్గ‌న అత్యంత స‌న్నిహితులు. అందుకే వ‌రుస‌గా రెండోసారి కూడా బుగ్గ‌న‌ను మంత్రివర్గంలోకి జ‌గ‌న్ తీసుకున్నారు. ఆర్థిక‌మంత్రిగా బుగ్గ‌న విజ‌య‌వంతంగా రాణిస్తున్నారు.

కేంద్రం నుంచి ఆర్థిక నిధులు రాబ‌ట్ట‌డంలో బుగ్గ‌న స‌క్సెస్ అయ్యారు. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రితో పాటు సంబంధిత విభాగం ఉన్న‌తాధికారుల‌తో బుగ్గ‌న రాజేంద్ర మంచి సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. కార్య‌సాధ‌కుడిగా బుగ్గ‌న‌ను జ‌గ‌న్ గుర్తించారు. న‌వ‌ర‌త్నాల సంక్షేమ ప‌థ‌కాల‌కు నిధులు స‌మ‌కూర్చ‌డంలో బుగ్గ‌న పాత్ర కీల‌కం.

పార్ల‌మెంట‌రీ చ‌ట్టాల‌తో పాటు ప్ర‌జాస‌మ‌స్య‌లు, వాటి ప‌రిష్కారాల విషయంలో బుగ్గ‌న‌కు మంచి అవ‌గాహ‌న వుంది. అలాగే ప్ర‌త్య‌ర్థి పార్టీల నేత‌ల‌తో స్నేహ‌సంబంధాలు కొన‌సాగించ‌డంలో బుగ్గ‌న‌కు మ‌రెవ‌రూ సాటి రారు. అసెంబ్లీలో స‌మ‌యోచితంగా ప్ర‌త్య‌ర్థుల‌పై పంచ్‌లు వేయ‌డం, దీటుగా కౌంట‌ర్లు ఇస్తూ, పిట్ట క‌థ‌లు చెబుతూ బుగ్గ‌న అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. 

విధానాల ప‌రంగా త‌ప్ప‌, వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు బుగ్గ‌న దూరంగా వుంటార‌ని పేరు. బుగ్గ‌న నంద్యాల లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేయాల‌నే ఆకాంక్ష‌ను నెర‌వేర్చేందుకు జ‌గ‌న్ ఎంత వ‌ర‌కూ స‌మ్మ‌తిస్తారో చూడాలి.

Show comments