ఎమ్బీయస్‍: రామాయణ పాత్రలు

‘‘ఆదిపురుష్ సమస్య’’ అనే వ్యాసంలో కొన్ని విషయాలు చర్చించాను. దీనిలో ప్రొఫెసర్ కవనశర్మగారి ‘‘రామకాండం’’ పుస్తకంలోని కొన్ని విషయాలు రాస్తాను. శర్మ (1939-2018) కథా, నవల రచయిత.  సివిల్ ఇంజనియర్. బెంగుళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్‌లో ప్రొఫెసర్. ఇంజనీరింగు కాలేజీకి కొంతకాలం ప్రిన్సిపాల్‌గా కూడా ఉన్నారు. కథా, నవలా, వ్యాస రచయిత. వ్యంగ్యంలో దిట్ట. సైంటిస్టు కావడమే కాదు, సైంటిఫిక్ ఎప్రోచ్‌తో మన జ్యోతిష్యం, వాస్తు, పురాతన సంస్కృతి, పురాణవాజ్ఞ్మయం వంటి వాటిని పరామర్శించారు. అనేక విషయాలపై లోతైన అధ్యయనం చేసి, ఒకదాన్ని మరోదానితో సమన్వయం చేయగల ప్రజ్ఞాశాలి. జలవనరుల నిపుణుడు కాబట్టి కాబోలు ఆర్థర్ కాటన్ జీవిత చరిత్ర రాశారు. సైన్సు నడిచిన బాట, ప్రాచీన సాహిత్యం-చరిత్ర.. యిత్యాది అనేక రచనలు చేశారు. ఏది చెప్పినా సాధికారికంగా, నిజాయితీగా చెప్తారని ప్రతీతి.

‘‘రామకాండం’’ పుస్తకంలో ఆయన స్పష్టంగా చెప్పారు, రామాయణం ఒకప్పుడు జరిగిన చరిత్ర యొక్క సాహిత్యరూపం అనుకుని రాస్తున్నాను అని. ఇతిహాసాలుగా పేరుబడిన రామాయణ భారతాల్లో సైనికుల సంఖ్యలు, (రామాయణ యుద్ధంలో పాల్గొన్నవారి సంఖ్య నిజమైతే భూతలం అంతా చాలదు అని లెక్క చెప్పారాయన) దూరాల కొలతలు నమ్మశక్యం కానివి అని ఒప్పుకుంటూనే అంత మాత్రం చేత చరిత్ర కాదనకూడదని ఆయన ఉద్దేశం. మహిమలున్నాయనో, భౌగోళికమైన తప్పులు ఉన్నాయనో, నమ్మశక్యం కాని విషయాలున్నాయనో సాహిత్యాన్ని చరిత్రకు ఆధారంగా తీసుకోం అంటే ప్రపంచంలో ఏ ప్రాచీనసాహిత్యాన్ని చరిత్ర ఆధారంగా స్వీకరించలేం అన్నారు.

వాల్మీకికి దక్షిణాపథం తెలియని అనడం తప్పు, ఆయన ఎన్నో వివరాలను కరక్టుగా రాశారని మెచ్చుకుంటూనే ఆయన పొరపాటు పడిన ఘట్టాన్ని కూడా చెప్పారు. సుగ్రీవుడు సీతాన్వేషణకై వానరులను నలుదిక్కులా పంపుతూ వింధ్య పర్వతాలూ, మహానది దక్షిణాన ఉన్నాయని అన్నట్లు రాశారు. కానీ సుగ్రీవుడికి అవి ఉత్తరాన ఉన్నాయి. అయోధ్యకి దగ్గరగా ఆశ్రమం కట్టుకున్న వాల్మీకికి దక్షిణాన ఉన్నాయి. ఎంతో భౌగోళిక స్పృహతో రచన చేసిన వాల్మీకి పెర్‌స్పెక్టివ్ విషయంలో పొరపాటు చేశారా, లేక కావ్యానికి గౌరవం కలిగిస్తున్నామనుకుని యితరులెవరైనా వీటిని చేర్చారా అనే సందేహం వెలిబుచ్చారు శర్మ.

యుద్ధంలో వానరులు, రాక్షసులు తీవ్రంగా గాయపడ్డారు. రామలక్ష్మణులు మూర్ఛిల్లారు. అప్పుడు హనుమంతుడు మృతసంజీవని మొదలైన ఔషధ గుణాలున్న మొక్కలను తెచ్చినపుడు ఆ మొక్కల ప్రభావంతో రామలక్ష్మణులు మూర్ఛ తేరడంతో పాటు, వానరులు కూడా తేరుకున్నారు. మరి వారితో పాటు రాక్షసులు కూడా లేచి కూర్చున్నారా అనే సందేహం రాకుండా వాల్మీకి, తీవ్రంగా గాయపడిన రాక్షసులను వారి నాయకులు సముద్రంలో పడవేస్తూ రావడం చేత వారికి లాభం చేకూరలేదని కన్విన్సింగ్‌గా రాశారని శర్మ చెప్పారు.

భారతదేశం నుంచి లంకకు ప్రయాణం ఎలా చేసేవారు అనే దానిపై ఆయన రాసినదిది - ‘లంకను, దక్షిణాపథాన్ని కలుపుతూ ఈనాడు సముద్రంలో 3 అడుగుల నుంచి 30 అడుగుల లోతున భూమి ఉన్నట్టు, అది ఇసుక భూమి కాక బండలతో నిండిన భూమి అయినట్టు, ఆ బండలు సున్నపు రాళ్లవి అయినట్టు శాస్త్రజ్ఞులు అభిప్రాయ పడుతున్నారు. ఈ దారిన 15వ శతాబ్దం వరకు లంకకి నడిచిపోగలిగే వారని అంటారు. ఈ  మార్గాన్ని 13వ శతాబ్దపు మార్కొపొలో, 19 వ శతాబ్దపు ఆర్థర్ కాటన్‌లు ‘రామసేతు’గా వ్యవహరించటం గమనార్హం.  ఈ ఉష్ణయుగం ప్రారంభమైనప్పటి నుంచి (రమారమి 8 వేల సం.ల క్రితం) సముద్రమట్టం క్రమేపీ పెరుగుతూ వచ్చి ఆ భూమార్గం నీటిలో మునిగిపోతూ వచ్చింది.

కృష్ణుడు శాలివాహన శకం (ఇది క్రీ.శ.78 నుంచి ప్రారంభమైంది)కు పూర్వం 3200-3100 మధ్య జీవించి ఉంటాడని, రాముడు కృష్ణుడికి ముత్తాత అని నా ఊహ. అంటే రామసేతువు యిప్పటికి 5300 సం.ల క్రితం నిర్మించబడింది. ఆ రాళ్లు క్రమేపీ కొట్టుకుపోయి ఉండవచ్చు. 600 సం.ల క్రితం అది వాడకానికి వీలుకాకుండా పోయుంటుంది. కాటన్ దాని కడ్డంగా, కొంత బండలను తొలగించటం ద్వారా చిన్న నౌకలకు దారి చేశాడు.’ అని రాశారు. ఈ పుస్తకంలో మహిమలు లేకుండా ఒక చారిత్రక గాథలా రామాయణ గాథను చెప్పుకుంటూ వచ్చారాయన. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వాల్మీకి రామాయణానికి చేసిన అనువాదాన్ని అనుసరించి, గీతా ప్రెస్ వారి సంస్కృత రామాయణాన్ని దగ్గర పెట్టుకుని యీ రచన చేశానని ఆయన చెప్పుకున్నారు. హనుమంతుడు సముద్రాన్ని ఎలా దాటాడు, రామసేతువు ఎలా కట్టారు అన్నదానిపై ఆయన యిచ్చిన వివరణ యిలా ఉంది.

సముద్రంలో మునగకుండా నీటి మీదకు పొడుచుకు వస్తున్న బండల మీద ఒక దాని నుంచి మరొకదానికి లంఘిస్తూ హనుమంతుడు వెళ్లాడని రాశారు. ఇది చాలా కష్టమైన పని కాబట్టే హనుమంతుడికి అప్పగించారు. రాముడికి తన వానర సేనను సముద్రం దాటించడం ఎలా అన్న విచారం పట్టుకున్నపుడు విశ్వకర్మ కొడుకైన నలుడు ముందరికి వచ్చి ‘సేతువు నిర్మించే విద్య మా నాన్న వద్ద అభ్యసించాను. పైకి పొడుచుకుని వచ్చినట్టు కన్పిస్తున్న బండల మధ్యనున్న దూరాలని, హనుమంతుడిలాగ దుముకుకుంటూ పోవాల్సిన అవసరం లేకుండా, వాటిని రాళ్లతో పూడ్చి ఒక వంతెన నిర్మిస్తాను’ అన్నాడు. రాముడు సరేననగానే వానర సైనికులు మద్ది చెట్లూ, తాడి చెట్లూ, కొబ్బరి చెట్లూ, ఆకులతో ఉన్న కొమ్మలు, తీగెలు లాంటి వాటినెన్నో అక్కడ తెచ్చి పడవేశారు.

గదలతో మోది కొండలని బద్దలుకొట్టి పెద్దపెద్ద బండరాళ్లను తెచ్చి పడేశారు. కొందరు ఎత్తుపల్లాలు రాకుండాను, వంకర టింకరలు రాకుండాను దారాలు, తాళ్లు పట్టుకున్నారు. కొందరు కొలబద్దలు పట్టారు. కొందరు బండలను తీగెలతో కట్టారు. ‘అది నూరు కొలతల పొడుగు వంతెన. కొలత దూరం 250 మీ- 400 మీ.లు ఉంటుంది. మొదటినాడు 14 కొలతలు, రెండోనాడు 20, మూడోనాడు 21, నాల్గవనాడు 22, ఐదోనాడు 23 పూర్తి చేశార’ని శర్మ రాశారు. కొలత 400 మీ.లు అనుకుంటే 100 కొలతలు అంటే 40000 మీటర్లు, అంటే 40 కి.మీ.లు అన్నమాట. ప్రస్తుతం శ్రీలంక, భారతదేశాల మధ్య పాక్ జలసంధి ద్వారా ఉన్న దూరం 54.8 కి.మీ. రామసేతు (ఏడమ్స్ బ్రిజ్) పొడుగు 48 కి.మీ.లు అని గూగుల్ చెప్తోంది.

రావణుడు సీతను ఏ మార్గాన తీసుకెళ్లాడు? ఆకాశమార్గాన తీసుకెళ్లాడని ఆయన రాయలేదు. లంకను దక్షిణాపథంతో కలిపే భూభాగం కొంత మునిగిపోవడంతో రావణుడు లంక పశ్చిమ భాగం వద్ద పెద్ద బల్లపరుపు నావలను, రథాలను సైన్యాన్ని దాటించడానికి ఉంచుకున్నాడు. కంచర గాడిదల రథంపై బయలు దేరి నావలో సముద్రం దాటి వచ్చాడు. సీతను తీసుకుని వెళ్లేటప్పుడు దక్షిణాపథం పశ్చిమతీరం వెంబడి దాని చివరికి వెళ్లి తన నావలో లంక వదిలిన 15 దినాలకు చేరాడు - అని రాశారు.

ఇక వానర జాతి, యితర జాతుల గురించి ఆయన రాసినదేమిటంటే –  ఈ జాతుల వారు మామూలు మనుష్యులే. అరణ్యంలోని మృగాల నుంచి రక్షించుకోవడానికి చెట్లమీద ఉంటారు. ఉత్తరదేశంలో ఉన్నట్లు ఈ అడవి జాతులకు బాణాలు ప్రయోగించే నేర్పు లేదు. వారి రక్షణ అంతా వారి చేతులతో ఎత్తి ప్రయోగించగల రాళ్లమీద, బండల మీద, చెట్ల మాకుల మీద దాక్కోవడంపై ఆధారపడి ఉంటుంది. వారి దేహబలం, వారు ధరించే తోకలు, రెక్కలు వాటికి అనుగుణంగా ఉంటుంది. వానర జాతి వారు చెట్లు ఎక్కాక కిందకు పడకుండా తోకను తగిలించుకుని కొమ్మకు చుట్టుకుంటారు. అవసరం లేకపోతే తీసి పక్కన పెడుతూంటారు. అలంకారంగా ధరిస్తారు కూడా.

జటాయువు జాతి వారు రెక్కలు తగిలించుకుంటాడు. చెట్టు మీద నుంచి కిందకు దుమికేటప్పుడు భూమి మీదకు వేగంగా పడకుండా రెక్కలు కాపాడతాయి. అలాగే జాంబవంత జాతి వారు ఎలుగుబంటి చర్మాన్ని తల నుంచి పాదాల దాకా ధరిస్తారు. వారి తల మీద ఎలుగుబంటి తల ఉండడంతో భీకరంగా కనిపిస్తారు. వారు మల్లయుద్ధంలో, ముష్టియుద్ధంలో ప్రవీణులు. ఏనుగు తల ధరించేవారు, సింహం తల ధరించేవారు కూడా ఉన్నారు. ఇవన్నీ శత్రువులను బెదరగొట్టేందుకు ఉపయోగపడతాయి. అని రాశారు.

దండకారణ్యం గురించి, వానర, రాక్షస వైషమ్యాల గురించి చాలా వివరాలే రాశారు. వైవస్వతుడనే రాజు ద్రవిడ దేశాన్ని పాలించేవాడు. అతనికి ఇక్ష్వాకుడు, శర్వాతి అనే కొడుకులు, ఇల అనే కూతురు కలిగారు. ఇక్ష్వాకుడి కొడుకులు కకుత్‌స్థుడు, దండకుడు. ఇక్ష్వాకుడు రాజ్యస్థాపనకు గంగా యమునా ప్రాంతం అనుకూలంగా ఉంటుందనుకుని ఉత్తరాపథానికి తరలి వెళ్లాడు. అతని పెద్ద కొడుకు కకుత్‌స్థుడి కొడుకు రఘు. రఘు మనవడు దశరథుడు. మునిమనుమడు రాముడు. రాముడిది ఇక్ష్వాకు వంశం అంటారు. ఇక్ష్వాకుడి రెండో కొడుకు దండకుడు గోదావరి తీరానే ఉండిపోయి రాక్షస స్త్రీని పెళ్లాడాడు. రాక్షసుల సహాయంతో గోదావరి నుంచి నర్మద వరకు తన అధికారం చెల్లించుకున్నాడు. గోదావరి నుండి కృష్ణ వరకు వ్యాపించి ఉండిన దట్టమైన అడవులలో తాత వైవస్వతుడి నుంచి సంక్రమించిన రాజ్యంలో అతని పాలన సాగింది. అక్కడ వానర జాతి, జాంబవంత జాతి ప్రజలు ఉన్నారు. వారికి, లంకలోని రాక్షసులకు మధ్య యుద్ధాలు, సంధులు జరుగుతూ వచ్చాయి.

కొంతకాలానికి కృష్ణకి దిగువన వాలి కిష్కింధని పాలించాడు. తక్కిన వానరుల్లా కాకుండా అతనికి ధనుర్బాణాలలో ప్రావీణ్యత ఉంది. రావణుడు వాలితో యుద్ధంలో ఓడిపోయి ఒప్పందం చేసుకున్నాడు. దాని ప్రకారం రాక్షసులు లంక నుంచి దండకారణ్యానికి యథేచ్ఛగా వచ్చి పోతున్నారు. అది వానర ప్రముఖులకు, యువరాజైన సుగ్రీవుడికి యిష్టం లేదు. అక్కణ్నుంచి తమ కిష్కింధలోకి కూడా వస్తారని వారి భయం. అది జరిగింది కూడా. మండోదరి సోదరుడైన దుందుభి దండకారణ్యంతో ఆగకుండా వాలిని ధిక్కరించి కిష్కింధలో కూడా తిరగసాగాడు.

వాలి దుందుభిని వారించి, మాట వినకపోతే యుద్ధం చేశాడు. వాళ్లిద్దరూ గుహలో పోట్లాడుతూ ఎంతకూ రాలేదు. ద్వంద్వయుద్ధంలో యిద్దరూ చనిపోయి ఉంటారని అనుకుని సుగ్రీవుడు గుహద్వారాన్ని బండరాయితో మూసేసి వచ్చేశాడు. రాజ్యం చేపట్టాడు. వాలి దుందుభిని చంపి, బయటకు వచ్చి సుగ్రీవుడు కావాలనే యిదంతా చేశాడని అనుకుని అతన్ని రాజ్యం నుంచి తరిమివేశాడు. వాలికి మతంగ ముని అంటే ఉన్న గౌరవం చేత ఆయన ఉన్న ఋష్యమూక పర్వతం మీదకి వెళ్లడు. సుగ్రీవుడు అక్కడ తలదాచుకున్నాడు. సుగ్రీవుడి పక్షాన ఉన్న హనుమంతుడు, జాంబవంతుడు అతని వద్దకు వెళ్లారు. రామలక్ష్మణులతో అతనికి స్నేహం కుదిరి, రాముడి ద్వారా వాలిని చంపించాడు.

శూర్పణఖ ఉదంతం గురించి ఆయన రాసినది - ఆమె భర్త విద్యుజ్జిహ్వుడు పంచవంటి ప్రాంతంలో ఉండేవాడు. రావణుడు తన జోలికి రాడని నమ్మి వానరులతో కయ్యానికి దిగాడు. వద్దన్న రావణుడినే ఎదిరించాడు. అతని చేతిలో చచ్చిపోయాడు. రావణుడు తన కంటె 20 సం.లు చిన్నదైన 40 ఏళ్ల సవతి సోదరి శూర్పణఖతో ‘‘భర్త పోయాడని బాధపడకు. నువ్వు మళ్లీ పెళ్లి చేసుకో. నాతో బంధుత్వానికి ఎవరైనా యిష్టపడతారు. నీ వివాహం జరిపించే పూచీ నాది.’’ అన్నాడు. ఆమె ముప్ఫయి సంవత్సరాల వయసున్న రాముణ్ని చూసి ‘‘నన్ను పెళ్లి చేసుకుని పట్టమహిషిని చేసుకో. నా సోదరులు ఖరదూషణులు నీకు అండగా ఉంటారు. నీ ప్రస్తుత భార్య నీకు చిన్నరాణిగా ఉండవచ్చు.’’ అంది. రాముడు లక్ష్మణుడి దగ్గరకు పంపించాడు. లక్ష్మణుడు నేను రామభృత్యుణ్ని. నన్ను పెళ్లాడితే సీతకు సేవకురాలివి అవుతావు అన్నాడు. దాంతో శూర్పణఖ సీతను చంపబోయింది. రాముడు యీమెను శిక్షించు అన్నాడు.

స్త్రీల దుష్ప్రవర్తనకి సాధారణంగా విధించే శిక్ష అయిన ముక్కు చెవులు తెగగోసి ఆమెను కురూపిని చేసి పంపించాడు. ఆమె ఖరదూషణులను వారిపై యుద్ధానికి పురికొల్పింది. కానీ రాముడి చేతిలో వారు మరణించారు. శూర్పణఖ లంకకు వెళ్లి రావణుడికి ఫిర్యాదు చేసింది. ‘నీ పేరు చెపితే ఎవరైనా నన్ను పెళ్లాడతారన్నావు. వాళ్లు నాకీ గతి పట్టించారు చూడు.’ అంది. ‘రాముణ్ని ఓడించి తెచ్చి నా చెల్లెలికిచ్చి పెళ్లి చేస్తాను. ఈ చెవులు తెగినదాన్ని పెళ్లాడడమే వాడికి శిక్ష’ అన్నాడు రావణుడు. శూర్పణఖతో బాటు వచ్చిన అకంపనుడు ‘రాముడి భార్య సీతను ఏమార్చి తీసుకుని వచ్చి పెళ్లాడు. అదే రాముడికి శిక్ష. విరహంతో ప్రాణాలు విడుస్తాడు’ అని సలహా చెప్పాడు.

రావణుడు మారీచుడి వద్దకు వచ్చి తన ఉద్దేశం చెపితే అతను చెప్పగానే అతను ‘రాముడు బలవంతుడు. సీతను అపహరించే ప్రయత్నంలో రాక్షసులకు ఏకైక దిక్కువైన నువ్వు నాశనం అయిపోతావు. జాగ్రత్త.’ అని హితవు చెప్తే వెనక్కి వెళ్లిపోయాడు. కానీ గ్రీష్మకాలం రాగానే శూర్పణఖ పోరు ఎక్కువై పోయి సీతాపహరణానికి బయలుదేరాడు. బంగారు లేడి ఉదంతాన్ని ఆయన ఎలా చెప్పారంటే మారీచుడి దగ్గర బంగారు వన్నెల మచ్చల లేళ్లు ఉన్నాయి. రావణుడి ఆదేశం మేరకు వాటిలో ఒక దాన్ని రాముడి ఆశ్రమంలో వదిలాడు. దాన్ని చూసి సీత మోహపడగానే దాన్ని వెనక్కి రప్పించాడు. రాముడు దాన్ని పట్టుకోబోయినపుడు  అది దొరకలేదు. చివరకు రాముడు బాణం వేయబోయే సమయానికి మారీచుడు ‘హా సీతా, హా లక్ష్మణా’ అని రాముడి కంఠాన్ని అనుకరిస్తూ అరిచాడు. రాముడు ఆ శబ్దం వచ్చినవైపు బాణం వదిలాడు. మారీచుడు చచ్చిపోయాడు.

ఇక పాత్రల గురించి ఆయన చెప్పినది – రావణుడు బ్రాహ్మణుడు. రాక్షసాంశ పదహారో వంతు మాత్రమే ఉన్నవాడు. అందుకే వేదపారాయణని లంకలో నిషేధించలేదు. అతనికి ఉన్నది ఒక తలే. కానీ తేలిక పదార్థంతో, గొప్ప నైపుణ్యంతో చేసిన తొమ్మిది తలలను ధరిస్తూంటాడు. సింహాసనం మీద ఉన్నపుడు, యుద్ధంలో పోరాడుతున్నపుడు ధరిస్తూ ఉంటాడు. అతను మాట్లాడుతూంటే సింహం గర్జించినట్లు, పదిమంది మాట్లాడినట్లు శబ్దం వినవస్తుంది. గుహుడు పడవ నడిపేవాడు కాదు. బోయరాజు. అయోధ్యకు సామంత రాజ్యంగా ఉన్న శృంగిబేరపురం అనే రాజ్యానికి రాజు. రాముడికి ఆతిథ్యం యిచ్చి మర్నాడు నావను, మంచి నావికుణ్ని యిచ్చి పంపాడు.

ఇలాటి విషయాలతో ఆయన ‘‘రామకాండం’’ రాశారు. నేను మీకు దాన్ని పరిచయం చేశానంతే. దానిపై వ్యాఖ్యలు చేసే స్థాయి నాకు లేదు. దానిలో విషయాలను నమ్మడం, నమ్మకపోవడం మీ యిష్టం. ఇక ఒక వివరణ - ఆదిపురుష్ వ్యాసంపై వ్యాఖ్యలు రాస్తూ నీలమేఘశ్యాముడు అని రాముణ్ని వర్ణించారు కాబట్టి రాముడి రంగు నీలం అని కొందరు వాదించారు. వాళ్లు ఆ ఆ సమాసం యొక్క విగ్రహవాక్యాన్ని తెలుసుకోవటం లేదు. నీల అనే సంస్కృతపదానికి అర్థం డార్క్ బ్లూ ఆర్ బ్లాక్ అని. శ్యామ అంటే నలుపు, కారు చీకటి రాత్రి. కాళికాదేవి నల్లగా ఉంటుంది కాబట్టి శ్యామా అంటారు. కృష్ణుడు నలుపు కాబట్టి ఉత్తరాదిన శ్యామ్ అంటారు. కృష్ణ అన్నా నలుపే. నల్లనివాడు.. అని పోతన పద్యం ఉంది కదా. నీలమేఘశ్యాముడు అంటే నీలమేఘం (కారు మబ్బు) వంటి నల్లనివాడు అని అర్థం. కృష్ణుడు నలుపు అని పురాణాలన్నీ ఘోషిస్తున్నా మనవాళ్లు నీలం రంగు పులిమారు. అదే చేత్తో రాముడికీ పులిమారు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2022)

mbsprasad@gmail.com

Show comments